
మనకు ప్రధానంగా మూడు ఉపకరణాలుంటాయి–శరీరం, మనస్సు, వాక్కు. శరీరం అన్నం చేత తయారవుతుంది. సూక్ష్మ శరీరమైన, సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సు కూడా అన్నం వలననే తయారవుతుంది. ఇది ప్రాణం అత్యంత ప్రధానమైనది. ఎంతకాలం ప్రాణం లోపల తిరుగుతుంటుందో అంతకాలమే ఈ శరీరానికి పూజనీయత. ఎంతకాలం వాయువు బయటికెళ్ళి లోపలకు వస్తుంటుందో అంతకాలం మాత్రమే ‘బాగున్నారా !’, ‘బాగున్నారా!’ అని అని కుశల ప్రశ్నలు వేస్తుంటారు.
లోపలికి వెళ్ళిన వాయువు బయటికి వెళ్ళకపోయినా, బయటికి వెళ్ళిన వాయువు లోపలికి పీల్చబడకపోయినా .. అక్కడితో దాని మంగళప్రదత్వం పోతుంది. అది ఇక శివం కాదు, శవం. అటువంటి ప్రాణాన్ని పోషించగలిగేది నీరు. ప్రాణులను అన్నింటినీ కూడా పోషించగలిగిన శక్తి నీటికి ఉంటుంది. అందుకే ‘అమృతం వా ఆపః’ అంటారు. నీరు అమృతంగా చెప్పబడింది. పరమేశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు పంచామృతాభిషేకం అంటారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, మంచినీరు.. ఇవి పంచామృతాలు. నీళ్ళు ముఖాన చిలకరిస్తే... స్పృహæతప్పిపోయినవాడికి కూడా స్పృహ, ప్రాణాలు వస్తాయి. అంటే ప్రాణాలను తిరిగి యథాస్థానంలో నిలబెట్టగలిగిన శక్తి నీటికి ఉంది.
చిట్టచివరిది వాక్కు. ఈ వాక్కు.. స్వరపేటిక పేరిట భగవంతుడిచ్చిన మహత్తరమైన కానుక. దీనిని ఆధారం చేసుకుని మనిషి తాను తరించిపోవచ్చు... ఇతరుల అజ్ఞానం పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. కలియుగంలో భగవంతుని నామాన్ని పలకడంకన్నా గొప్పది మరొకటి లేదు. అది భగవంతుడిని ఉద్దేశించే పలికింది కాకపోవచ్చు. ‘బిడ్డపేరుపెట్టి పిలిచిననైన విశ్రామకేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయనతలుప కలుషహరము’ అంటారు... భాగవతంలో. బిడ్డను దేముడి పేర్లలో ఒకటిపెట్టి పిలిచినప్పటికీ... పిలిచింది బిడ్డనే అయినా... భగవంతుడి నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి పాపరాశి ధ్వంసమవుతుంది... అన్నారు.
విశ్రామకేళినైన... ఆడుకునే సమయంలో ఇరుపక్షాలూ ఒకరు రాముడి పక్షమనీ, మరొకరు కృష్ణుడి పక్షమంటూ అలా పేర్లుపెట్టుకుని ఆడుకుంటూ ఆ పేర్లను ఉచ్చరించినా చాలట. పద్యమో, గద్యమో, గీతమో... ఏదయినా కావచ్చు... అది భగవంతుని నామంతో కూడుకున్నదయితే చాలు అది కలుషహరము.. కలుషాలను అన్నింటినీ పోగొట్టగలిగిన శక్తిని పొంది ఉంటుంది. అలా తనకు తాను తరించడానికే కాదు.. ఇతరుల అజ్ఞానమనే చీకటిని దహించివేయడానికి కూడా వాక్కు ఉపకరిస్తుంది ... ఎలా? వాక్కు అగ్నిహోత్రంతో సమానమైనది.
అగ్నిహోత్రానికి ఉన్న లక్షణం అవతలి వస్తువును దహించి వేస్తుంది. అలాగే వాక్కుకు ఉన్న లక్షణం అవతలివారి అజ్ఞానాన్ని తొలగించేస్తుంది. తెలియని విషయం అది తెలిసినవారి దగ్గర విన్నప్పుడు.. ‘నాకు తెలియదు’ అన్న తెలియనితనం పోతుంది. అంత గొప్ప వాక్కు మహాత్ములయినవారి నోటివెంట వచ్చినప్పుడు దేశకాలాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అది వ్యక్తి ఉద్ధరణకు, సమాజ ఉద్ధరణకు కారణమయి ఉంటుంది. వారు దేశికులై ... అంటే మార్గనిర్దేశకులై మనం ఎటువైపు ప్రయాణం చేయాలో దిశానిర్దేశనం చేస్తుంటారు.
(సశేషం).
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు