‘‘అమ్మా, అడిగావా నాన్నని. ఏమన్నారు? నువ్వు కాస్త గట్టిగా అడగవే ఒప్పుకుంటారేమో’’ వాట్సాప్ వీడియో కాల్‌లో తల్లి వనజని నిలదీస్తోంది సుప్రియ.అమెరికాకి ఎలాగైనా అమ్మతో పాటు నాన్నని కూడా రప్పించుకోవాలనే పట్టుదలా, మళ్ళీ ఓడిపోతానేమో అనే దిగులు కలగలసి వినిపిస్తోంది సుప్రియ గొంతులో.‘‘ఎన్ని విధాలుగా అడగను చెప్పు. మొదటి రెండుసార్లు ఏదో బెట్టు చేస్తున్నారేమో అనుకున్నాను కానీ, ఇంత మంకుపట్టు పడతారు అనుకోలేదే. ససేమిరా అంటున్నారు ఆయన.
నా వల్ల కాదు ఈ విషయంలో నాన్నని ఒప్పించడం. ముందు రెండుసార్లు అంటే ఏదో నీ పురిటికి సాయంగా వచ్చాను కానీ ఇప్పుడు ఎలా చెప్పు మళ్ళీ ఆయన్ని వదిలేసి రావడం? నవ్విపోరా అంతా.’’గోడకి బిగించిన అద్దంలో చూసుకుంటూ గడ్డం గీసుకుంటున్న కృష్ణమూర్తికి తల్లీ కూతుళ్ళ సంభాషణ వినిపిస్తూనే ఉంది. ఈసారి కూతురు గట్టిగానే పట్టుపడుతోంది. ముందు రెండుసార్లు అంటే బ్యాంక్ ఉద్యోగం వంకతో పని ఒత్తిడి అని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడైతే రిటైర్ అయ్యి సొంత ఊరికి చేరుకున్నాడు. ఏ సాకూ దొరకడం లేదు కృష్ణమూర్తికి.
‘పోనీ అసలు సంగతి చెప్పేద్దామా?’ అనుకున్నాడు ఒక్క క్షణం.‘‘ఎంతైనా నాన్నగారు ప్రత్యేకమైన మనిషమ్మా. అందరూ ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటే నాన్నగారు చూడు అసలు. ఆయన సిద్ధాంతాలు, పద్ధతులూ వేరు. ఒక మాట అనుకుంటే మార్చనేలేము. మావయ్యా వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాక జిల్లా ఎడిషన్‌లో ‘విదేశీ పర్యటన చేసుకుని స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు శుభాకాంక్షలు’ అని పేపర్ యాడ్ కూడా ఇప్పించుకున్నారు తెలుసా. నాన్నగారిని చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా ఇలాంటి గొప్పలేమి పట్టవు ఆ మనిషికి. ముక్కు సూటి మనిషి అని, ఏ పని చేసినా పద్ధతిగా నిబద్ధతతో చేస్తారని మావయ్య వాళ్ళకి కూడా నాన్న అన్నా, ఆయన మాటన్నా అంత గురి మరి.’’ గర్వంగా చెప్తోంది సుప్రియ.
‘‘మరేమనుకున్నావు. ఇన్నేళ్ళ బట్టి చూస్తున్నా కదా మనిషిని. మాటంటే మాటే. ఈరోజుల్లో ఉంటారా ఈయనలాంటి వాళ్ళు.’’ అంది వనజ భర్త గురించి మురిపెంగా.మొహం తుడుచుకుంటూ లోపలికి వచ్చిన కృష్ణమూర్తికి సుప్రియ మాటలు వినడంతోనే అసలు సంగతి కూతురుకి చెప్పేద్దాం అనుకున్న ఆలోచనని వెనక్కి తీసేసుకున్నాడు. చిన్నప్పుడు మా నాన్న ‘శక్తిమాన్’ కన్నా పవర్‌ఫుల్ తెలుసా, అని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేటప్పుడు ఎంత అబ్బురంగా చూసేదో ఇప్పటికీ తనని సూపర్ హీరోలానే చూస్తున్న కూతురికి ఎలా చెప్పగలడు ‘ఇదీ సంగతి’ అని.‘వద్దు వద్దు’ అని మనసులోనే అనుకున్నాడు కృష్ణమూర్తి.
వనజ ఇచ్చిన కాఫీ తాగుతూ రోజూలాగే అక్కడ అమెరికాలో ‘టైం ఎంత’ అని మొదలుపెట్టి, వాతావరణ విశేషాలు అడిగి మనవరాలిని పలకరించి పెట్టేశాడు కాల్.హడావిడిగా చిన్ని హస్తం గరిటని చన్నీటి గ్లాసులో ముంచి వేడి వేడి ఇడ్లీలు దీక్షగా తీసి ప్లేట్లో వేసి ఇస్తున్న వనజ వైపు చూస్తూ , ‘పోనీ అసలు సంగతి వనజకి చెప్పేస్తే?’ అనుకున్నాడు కృష్ణమూర్తి.‘‘నీకో విషయం చెప్పాలోయ్’’ అనే మాట నోటి వెంట బయటికి రాక ముందే, ‘‘సారీ అండి. పాపతో మాట్లాడుతూ కాస్త ఆలస్యమైయింది. ఇదుగో ఇస్తున్నాను.’’ అంటూ కొబ్బరి చట్నీని ముద్దుగా తట్టి ప్లేటులో వేస్తూ చేతికి అందించింది వనజ.‘‘అది కాదు మాట’’ అని చెప్పబోయేంతలో పక్క ఊర్లో ఉండే వనజ వాళ్ళ తమ్ముడు రావడంతో కృష్ణమూర్తి మాట పూర్తవ్వకనే, ‘‘ఏరా ఇదేనా రావడం. రా రా వేడిగా టిఫిన్ చేద్దువు గానీ’’ అంటూ ఎదురెళ్ళింది.
‘‘చేసే వచ్చాను. టిఫిన్ వద్దులే గానీ మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు.’’ అన్నాడు ఆ రోజు పేపర్ తీసుకుని కుర్చీలో కూర్చుంటూ వనజ తమ్ముడు బాలాజీ.టిఫిన్ కానిచ్చి వచ్చిన బావగారిని చూస్తూనే లేచి నిల్చున్నాడు బాలాజీ.‘‘ఏం బాలా, బాగున్నావా. కూర్చో కూర్చో. ఎట్లా ఉంది వ్యాపారం?’’ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు కృష్ణమూర్తి.బావగారు కూర్చున్నాక కానీ కూర్చోలేదు బాలాజీ. తరవాత బిల్డర్‌గా పనిచేయడంలో ఉండే సాధక బాధకాలు చెప్తూ కూర్చున్నాడు.వనజ తమ్ముడికి కాఫీ తీసుకుని రావడంతో ‘‘మీరు మాట్లాడుకుంటూ ఉండండి,’’ అంటూ లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అతనికి.‘‘మరి బావకేదే కాఫీ?’’‘‘ఆయన ఉదయం కాఫీ తాగేశారు కదా. మళ్ళీ ఇంకో రెండు గంటల తర్వాతే.’’‘‘ఎంతైనా బావంటే పద్ధతి. పద్ధతి అంటే బావకా. అవును మరి అమ్ములు అమెరికా రమ్మంటాంది అంట కదా ఇద్దర్నీ ఈసారి. బావేమన్నాడు?’’
‘‘ససేమిరా అంటున్నారురా. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారుంటారా చెప్పు. రిటైర్ అయ్యాక కూడా వాళ్ళ కొలీగ్స్ అంతా సిటీల్లో గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉంటుంటే ఈయన చూశావా నా ఊరు నా మనుషులు అంటూ మళ్ళీ ఇక్కడికే తెచ్చేశారు. నేను చెప్పేశా అమ్ములుతో నాన్నని వదిలి రాను ఇక అని. ఆయన లేకుండా నాకు తోచదు అక్కడ. ఆయన్ని చూసైనా నేను నేర్చుకోవాలి కదా. పిల్లలే వచ్చి చూసి వెళ్తే సరి.’’ అంది వనజ.‘‘అంతేలే. ఎక్కడికెళ్ళినా కింగులా ఉంటాడు బావ. నలుగురు మనుషులు కావాలి ఎప్పుడూ. ఏం తోస్తుంది ఆయనకి అక్కడ. ‘‘సరేలే ఉమ నీకు ఇచ్చిరమ్మంది’’ అంటూ మరదలు పికో ఫాల్స్ చేసిన చీరల కవర్ అక్కడ పెడుతూ ‘‘నే వెళ్ళొస్తాక్కా, టైల్స్ సప్లయర్ వస్తానన్నాడు. బావకి చెప్పు. పిలవద్దులే మళ్ళీ’’ అంటూ బయల్దేరాడు బాలాజీ.
‘ఎందుకో నేనంటే ఇంత గౌరవం వీళ్ళందరికీ!’ అంటూ విసుక్కున్నాడు లోపలి నుంచి కృష్ణమూర్తి.వనజ మీద ఎప్పుడూ లేంది పీకల దాకా కోపం వచ్చింది అతనికి. ‘ఎంతసేపూ నా చుట్టూరా తన జీవితం గడుస్తోంది అని చెప్పుకుంటుందెందుకు వనజ. అసలు వనజ లేకపోతే క్షణం జరగనిది నాకే కదా? ఏమీ తెలీదు ఏమీ తెలీదు అంటూనే కూతురి పురిటికి రెండుసార్లు ఒక్కర్తే చక్కగా ఝామ్మంటూ అమెరికా వెళ్ళొచ్చింది. నేనే ఇక్కడ బిక్కు బిక్కుమంటూ ఉన్నాను కానీ తనొక్కతే అన్నీ చక్కబెట్టుకొచ్చింది. ముప్పై ఐదేళ్ళ నుండి ఆ ఉద్యోగం కాస్తా వెలగబెట్టి ఇంత గడించి వనజ చేతిలో పోసి తాపీగా టింగురంగామని తిని తిరగడం తప్ప ఈ సంసారానికి నేనేం చేశానని.
కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తనే మంచి చెడూ ఆలోచించి, చివరిగా ‘ఇదైతే బాగుంటుంది ఏమంటారు?’ అని నా ముందు ఉంచేది. అసిస్టెంట్ ఇచ్చిన ‘ఎన్‌ఓసీ’ సర్టిఫికెట్ మీద సంతకం పెట్టినట్టు నేను ‘సరే అలాగే’ అంటే చాలు పిల్లల చదువుల దగ్గరి నుండీ మంచి సంబంధాలు చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యడం వరకూ అంతా తన ఇష్టమే. ‘అప్రూవల్’ ఇవ్వడం వరకే నా పని కదా. అయినా కాని అన్నిటికీ నేనే కారణమన్నట్టు నేనేదో దైవాంశ సంభూతుడినైనట్టు ప్రవర్తిస్తుంది ఎందుకూ?’ అని ఆలోచనలో పడిపోయాడు కృష్ణమూర్తి.‘అన్నిటికీ ఈ రూపమే కారణం’ అనుకుంటూ అద్దంలోకి చూసుకుని సణుక్కుంటూ పల్చబడ్డ క్రాఫుని నైసుగా సర్దుకున్నాడు కృష్ణమూర్తి.
కృష్ణమూర్తి మూడించీలు తక్కువగా ఆరడుగులు. అయినా కానీ వనజ నోట్లోపడి ‘ఆరడుగుల అందగాడు’ అయిపోయాడు. మంచి విగ్రహపుష్టి, దానికి తోడు ధీర గంభీర స్వరం కలవాడవటంతో అడక్కుండానే అందరి గౌరవ మర్యాదలకు పాత్రుడయ్యాడు. కట్టుకున్న భార్యకి కన్నుల దీపావళి అయ్యాడు. బావ బామ్మర్దులైతే కిట్ట పరమాత్ముడే మా ఆడబిడ్డని చేపట్టినాడు అని మురిసి మర్యాదలు చేసేవారు.ఇంట్లో వనజ ముదిగారంతో వేరే ఏ రకమైన డిస్ట్రాక్షన్లు లేక ఉద్యోగంలో మెట్టు మెట్టూ పైకెక్కి కింది వారి గులాములు అందుకున్నాడు. ఆఫీసరు భార్యగా తన దర్జాకి, మొగుడి దర్జాకి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా చూసుకునేది వనజ. ఈ గౌరవానికి కృష్ణమూర్తి కూడా అలవాటు పడిపోయాడు.
చివరికి ఉద్యోగ విరమణ అయ్యాక తన కొలీగ్స్‌తో పాటు గేటెడ్ కమ్యూనిటీలో ఉందామనుకునే లోపు, ‘ఊరు పేరు లేని చోట్ల అనామకుడిలా ఉండలేరు ఆయన. నలుగురు మనుషులకి సాయంగా, అందరి తల్లో నాలుకలా ఉండడమే ఇష్టం ఆయనకి. పుట్టిన ఊరంటే ఎంత మమకారమో. ఈరోజుల్లో ఎవరుంటారమ్మా ఇలాగ!’ అంటూ అటు తన పుట్టింటికి కూడా కూత వేటు దూరంలో ఉండే సొంతూరికి చేరవేసింది కృష్ణమూర్తిని వనజ.వనజ మెల్లిగా ఇక్కడ కూడా మొగుడి పరపతి పెంచేసింది. మొగుడి దర్జాకి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా ప్రతి చిన్న విషయంలోనూ ‘ఈరోజుల్లో ఉంటారా ఈయనలాంటి వాళ్ళు’ అని మొగుడి గురించి అందరికీ కథలు కథలుగా చెప్పి తన ప్రమేయం లేకుండానే అందరికీ ‘కిట్టప్ప’గా మాత్రమే పరిచయం ఉన్న మూర్తిని కాస్తా ‘కృష్ణమూర్తిగారు’గా ఊరిలోకే పెద్ద తలకాయలాగా చెలామణీలోకి తెచ్చేసింది వనజ.
ఉద్యోగం ఉన్నంత వరకు ఫరవాలేదు కానీ ఇప్పుడు ఊరికొచ్చే సరికి కథ అడ్డం తిరిగింది. అందరూ కృష్ణమూర్తిని చూసి ఒక చేత్తో అర్ధ నమస్కారం చేసి తప్పుకునే వారే కానీ ఎవ్వరూ మనస్ఫూర్తిగా మాట్లాడేవారు కాదు. ఉత్సవ విగ్రహంలాగా ఊరంతా ఊరేగి, అందరి తలపంకింపులకు బదులు చెప్పి, వాళ్ళ ఈతి బాధలు విని తనకు తోచిన మాటేదో చెప్పి రావడంతోనే సరిపోతోంది. అతని ఇష్టాయిష్టాలు, సరదాలు వినడానికి ఎవ్వరూ లేక పిచ్చెక్కుతోంది మూర్తికి.
దానికి తోడు కొత్తగా ఈ అమెరికా గోల ఒకటి తోడయ్యింది. ఇన్నిసార్లు ‘నేను అమెరికా రాను’ అంటుంటే, కాస్త మెల్లిగా ‘ఎందుకండి? ఏమిటి సంగతి?’ అని అడిగి తెలుసుకుందామనే ఆలోచనే లేని వనజని చూస్తుంటే ఎప్పుడూ లేనిది మొట్టబుద్ధేస్తోంది కృష్ణమూర్తికి.‘నేను అమెరికా రాను’ అని కృష్ణమూర్తి అనగానే, దానికి కూడా అదేదో గొప్ప సుగుణం అన్నట్టు ‘ఈరోజుల్లో కూడా ఇలాంటి వారుంటారా?’ అంటూ దేశ భక్తుల జాబితాలో కలిపేసింది మొగుడిని వనజ.హ అప్పటినుండి ఊర్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ ఈ మాటే.జెండామాను సెంటరు దగ్గరికి సాయంత్రాలు వెళ్ళగానే అరుగు మీద మధ్యాసనం ఇచ్చి ఒకటే ఎత్తేస్తున్నారు కృష్ణమూర్తిని అంతా.
ఇట్లా దేశం మీద, పుట్టిన ఊరి మీద ఇంత అభిమానం ఉండడం మీకే చెల్లింది. మావాడు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం కూడా పాస్ అవ్వలేదు అప్పుడే అమెరికా, ఆస్ట్రేలియా అంటూ కలవరిస్తున్నాడు మూర్తి గారు.’‘మా బామ్మర్ది, కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళి వచ్చినప్పటినుండీ మమ్మల్ని మనుషులుగా చూస్తే ఒట్టు. మూణ్నెళ్ళకే వాడికి పుట్టిన ఊరు మాసిపోయినట్టు కనపడిందంట. తిరిగి వచ్చినప్పటి నుండీ పూటకి నాలుగుసార్లు ఇళ్ళు దులపను సరిపోతోంది వాడికి.’‘రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూసినట్టే...బ్బా’‘బా చెప్పావ్. పోయేకాలం బుద్ధులు. అందరూ కృష్ణమూర్తిగారిలా నిండుకుండలా ఉండగలరా? మనిషంటే ఇట్లా ఉండాలి.’‘మరే! అందుకే ఇంకా ఈ దేశంలో వానలు పడతాండేది.’ఇట్లా కృష్ణమూర్తిని మధ్యలో పెట్టుకుని అంతా ఆకాశానికి ఎత్తేస్తుంటే చిరాకు ఎక్కువైపోతోంది మూర్తికి.
‘వుండండెహే! ఎదవ గోల. ఏ నాకొడుకూ నా మాట వినరేమిరా!’ అని అరిచి పచ్చిబూతులు నాలుగు మాట్లాడి, అసలు సంగతి చెప్పేద్దామనుకున్నాడు మూర్తి.‘‘కానీ అసలు తను అమెరికా ఎందుకు వెళ్ళను అంటున్నాడో చెపితే వీళ్ళంతా నిచ్చలకపోరూ? ఈ గౌరవం ఈ మర్యాదా ఇంచుక పుల్లంత అన్నా మిగులుతుందా అని? అసలు సంగతి తెలిస్తే ఇక జెండామాను సెంటర్‌లో నాకు సెంటర్ సీటు ఉంటుందా? అంతా కలిసి నన్ను ఒక మూలకి తోసెయ్యరా.
నా నోట్లోంచి మాటొచ్చేదే వేదంగా వినుకునే వాళ్ళు, ‘నువ్వలాగ ఉండరా కిట్టిగా, ఇవతల పెద్దాయన మాట్లాడుతున్నాడా.’ అని తీసిపారేస్తేనో?’’ ఆ ఊహకే ఒళ్ళు జలదరించింది కృష్ణమూర్తికి. సైలెంటయిపోయాడు.ఇక ‘‘వెంకాయి గాడి అంగడిలో నేను గోల్డ్‌ఫ్లేక్ తీస్కుంటే గుప్పిట్లో అగ్గిని పదిలంగా నా మూతికాడికి తీసుకువచ్చి నా సిగరెట్ వెలిగించి, ఆపైన నేను కదిలి వెళ్ళాకగాని తన బీడీ వెలిగించుకోని రమేషుగాడికి అసలు సంగతి తెలిస్తే నా సిగరెట్ వెలిగిస్తాడా ఎప్పటికైనా? ‘ఏంట్రా ఆ ఆగింతం కిష్టిగా, నా బీడీ వెలిగించుకునేదాకా ఆగలేవా అంట.
’ అని విసుక్కుంటే నేను తట్టుకోగలనా?’’ అనుకుని ఆగిపోయాడు కృష్ణమూర్తి.బావ బామ్మర్దులకి చెప్పుకుందామంటే కొండపైన వేలుపులా చూసే వాళ్ళ కళ్ళలో హేళన చూసేకన్నా కట్ట కింద బావిలో దూకడం మేలనుకుని గమ్మునుండిపోయాడు.ఆపైన తమ ఇంట్లో సహాయం చేసే మునెమ్మ, ఇస్త్రీపెట్టి ఈశ్వరయ్య, నీళ్ళ క్యాను వేసే మధుసూదన్, అమెజాన్ డెలివరీకి ఉర్లోకొచ్చే సతీష్, గ్యాస్ కనెక్షన్ ఇచ్చే పైఊరి అబ్బాయి ఇట్లా ఎవరికి చెప్పుకుందామన్నా తన పేరుకే చేటు అని అనుకుని ఊరకుండిపోయాడు కృష్ణమూర్తి. ఆలోచించిన కొద్దీ ఎవరో ఒక్కరికైనా అసలు సంగతి చెప్పాలనే కోరిక బలంగా నాటుకోసాగింది. చెప్పుకుంటే ఊరంతా వెనకగా చేరి ఘొల్లుమని నవ్విపోతారేమో’’ అనే బెంగ తొలిచేస్తోంది.
‘‘ఇంకా నయం వనజకి చెప్పలేదు. ‘ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు’ అన్నట్టు అంతెత్తున నిలబెట్టి చూస్తూంటుంది నన్ను ఎప్పుడూ. తీరా అసలు సంగతి తెలిస్తే? మయసభలో ద్రౌపదిలా తను నవ్వితే? ఇంత బతుకూ బతికి ఇంటిలోనే అవమానం పొందాలా? వద్దు వనజకి కూడా చెప్పకూడదు’’ అనుకున్నాడు కృష్ణమూర్తి.ఇలా ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేక తికమక పడుతున్న కృష్ణమూర్తికి ముందరి గదిలో అలికిడి వినపడడంతో ఆలోచనలని పక్కన పెట్టి లోపలి గదిలోంచి ఇవతలికి వచ్చాడు.మునెమ్మ వచ్చింది పని సాయానికి.‘‘నువ్వొస్తే వచ్చావు మళ్ళీ వీడిని ఎందుకు వెంటేసుకుని వచ్చావు.
ఉప్పురాయి పని చెయ్యడు. దర్బారుకేమీ తక్కువ కాడు’’ అంటూ ఆక్షేపణగా అంటోంది వనజ మునెమ్మెతో పాటు వచ్చిన మునెమ్మ మనవడిని.వాడిని చూడగానే కళ్ళు తళతళ మెరిశాయి కృష్ణమూర్తికి. ‘అరె భలే మంచి టయానికి వచ్చాడే వీడు. వీడి గురించిన ఆలోచనే రాలేదే’ అనుకుని సైలెంటుగా పేపర్ తీసి చదువుతూ కూర్చున్నాడు. వనజ కృష్ణమూర్తికి కాఫీ, మునెమ్మ మనవడికి కాస్త టిఫిను పట్టుకొచ్చి ఇచ్చింది.మునెమ్మ, టౌనులో చదువుకుంటూ అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చే మనవడిని తీసుకుని వస్తుంది కృష్ణమూర్తి వాళ్ళింటికి. వాడంటే మంచి గురి కృష్ణమూర్తికి. ఊర్లో మిగతా వారిలా అతి వినయాలకి పోడనీ, సూటిగా కళ్ళల్లోకి చూస్తాడనీ, వనజని చూసి గౌరవంతో కూడిన భయభక్తుల ప్రదర్శన చేసి మెప్పు పొందాలనుకోడనీ కృష్ణమూర్తికి వాడంటే ఇష్టం. వనజకి వాడంటే అందుకే విసుగు. పైగా కృష్ణమూర్తిని ‘సారుగారు’ అని వాడి చేత పిలిపించాలని ప్రయత్నించి ఓడిపోయింది. అందుకని కూడా వాడంటే ప్రత్యేక అభిమానం కృష్ణమూర్తికి.
ఒక్కోసారి తనతో పాటు వాకింగ్‌కి పాత బజారు తీస్కెళ్ళేవాడు వాడిని కూడా. ఇప్పుడు వనజ ‘చీపు టేస్టు’ అని విసుక్కునే చిన్నప్పుడు తనకి అమితంగా ఇష్టమైన జిలేబీ ఇప్పించి తిరిగి వస్తూ వస్తూ కొన్ని తనూ తినేవాడు కృష్ణమూర్తి గుంభనంగా.
వనజ, మునెమ్మ లోపల పనుల్లో పడగానే కాఫీ తాగేసి పక్కన పెట్టేసి మునెమ్మ మనవడిని సైగ చేసి రమ్మని పిలిచి చడీ చప్పుడు కాకుండా బయటికి తీస్కెళ్ళాడు కృష్ణమూర్తి.అలా కాస్త దూరం నడిచి బస్టాండ్ షెల్టర్‌లో అరుగు మీద కూర్చున్నారు ఇద్దరూ.‘‘ఒరేయ్. నాకెందుకో నిన్ను చూస్తే భలే నమ్మకమైన మనిషిలా కనపడుతున్నావురా.’’ అన్నాడు కృష్ణమూర్తి మునెమ్మ మనవడితో.‘ఏంటి విషయం!’ అన్నట్టు చూశాడు వాడు.‘‘ఇప్పుడు నీకో సంగతి చెప్తాను.
సత్య ప్రమాణంగా ఎవ్వరికీ చెప్పనని మాటివ్వాలి నాకు. ఇస్తావా మరి?’’ అని అడిగాడు కృష్ణమూర్తి ఆశగా వాడి వైపు చూస్తూ.అవును కాదూకి మధ్యస్థంగా తలూపి మెదలకుండా కూర్చున్నాడు వాడు.‘మరేమో నేను మాములు కోరికలకి అతీతుడినని, అందరిలాగా తుచ్ఛమైన గొప్పలకు పోనని, ఎంతో పద్ధతి గలవాడినని అంతా అనుకుంటున్నారు కదా.’’‘అయితే ఎవడికి గొప్ప!’ అన్నట్టు చూసి, చెట్టు మీద వాలిన కాకిపై దృష్టి పెట్టాడు వాడు.‘‘దేశం మీద ఊరి మీద వెర్రి అభిమానంతో విదేశీయాన అవకాశాన్ని కూడా చెత్త కాగితంలాగా ఉండచుట్టి విసిరేసిన పెద్దమనిషినని అనుకుంటున్నారు కదా? అవేమీ నిజం కాదురా. నేను అమెరికా వెళ్ళకుండా ఉండిపోడానికి అసలు కారణం ఏమిటో తెలుసా?’’వాడసలే కోపదారి మనిషేమో ‘ఏందీ పెద్దమనిషి, నానుస్తాడే గాని అసలు సంగతి చెప్పడేందేహే’ అని విసుగేసి అరుగు మీంచి దూకి పరుగందుకోబోయాడు.
వాణ్ని లటుక్కున పట్టుకుని, బతిమాలి బామాలి అరుగుమీద కూర్చొనబెట్టి మళ్ళీ కొనసాగించాడు కృష్ణమూర్తి.‘‘నాకూ. నాకు..ఎస్కలేటర్లన్నా, విమానాలన్నా చచ్చేటంత భయంరా అయ్యా! ఎస్కలేటర్ ఎక్కాలంటే ప్యాంటులోనే ఒకటీ రెండూ అన్నీ అయిపోతాయి. విమానంలో అన్నేసి గంటలు ఉండాలన్న ఊహకే దడుపు వచ్చేస్తుందిరా. నాకు అదొక ఫోబియా. నాకుండదా అమెరికా చూడాలని! వనజ లేదూ వాట్సాప్‌లో అక్కడి ఫొటోలు అవీ పంపుతుంటే, నవ్వి ఊరుకునే వాడిని కానీ ‘తస్సాదియ్యా అన్నీ ఎక్కి దిగేసి చిన్నపిల్లలా తెగ ఎంజాయ్ చేసేస్తోంది ఇది’ అని తెగ ఉడుక్కునేవాడిని. అదిరా అసలు సంగతి. ఎవ్వరికీ చెప్పకేం. సరేనా.’’ అని చెప్పడం ఆపాడు కృష్ణమూర్తి.
‘ఏంది ఇంతమాత్రానికే ఓ అని ఇదైపోతండావా పెద్దాయనా!’ అన్నట్టు నవ్వాడు వాడు పత్తిపువ్వులాగా.‘‘సరే మరి. ఈ విషయం చెప్దామనే తీసుకొచ్చాను నిన్ను. ఒట్టేశావు ఎవ్వరికీ చెప్పనని. గుర్తుంచుకోరా. సరేనా.’’ అని చెయ్యి చాపాడు కృష్ణమూర్తి.‘వొరె వొరె! పాపం పెద్దాయనకి ఎంత కష్టం ఒచ్చిందీ’ అనుకుని ఆ చేతిలో తన చెయ్యి వేశాడు వాడు.మనసులోని భారం తీరడంతో ఒక్కసారి చూట్టూ చూసి గంభీరంగా ‘రాజు వెడలె’ అన్నట్టు కదిలాడు ‘కృష్ణమూర్తిగారు.’ఆయన చెయ్యి పట్టుకుని జిలేబీ అంగడి వైపు దారి తీశాడు తను ఎంత పెద్ద సహాయం చేశాడో తెలీని మూడున్నరేళ్ళ మునెమ్మ మనవడు.
- శ్రీనిధి యెల్లల


