Assam First Woman IGP: Violet Baruah Appointed As First Female IGP Of Assam Police - Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ ఉమన్‌.. డేరింగ్‌ అండ్‌ కేరింగ్‌ ఆఫీసర్‌

Published Fri, Jan 7 2022 12:37 AM

Violet Baruah Appointed As First Female IGP Of Assam Police - Sakshi

అస్సాం తొలి మహిళా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలిస్‌ (ఐజీ) గా వయొలెట్‌ బారువాకు ప్రభుత్వం పదోన్నతి కల్పించిన తరువాత ఆమె ట్విట్టర్‌ పేజీలో అభినందనలు వెల్లువెత్తాయి. వాటిలో కొన్ని... ‘ఈ పదవికి మీకంటే అర్హులైన వారు లేరు’ ‘మీ విజయం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ ‘అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు’ ‘ఐపీయస్‌ చేయాలనేది నా కోరిక. మీ ఆశీర్వాదం, సలహాలు కావాలి. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’ అస్సాంలో వరదలు ఎంత సహజమో, అల్లర్లు అంతే సహజం. వరదలకైనా టైమ్‌ ఉంటుందేమోగానీ, అల్లర్లు మాత్రం... అన్ని కాలాల్లోనూ ఉంటాయి. అలాంటి చోట పోలిసు ఉద్యోగం చేయడం అనేది కత్తులవంతెన మీద ప్రయాణం చేయడమంత కష్టం.

అయితే డియస్పీ, ఎస్పీ, డిఐజీగా రకరకాల హోదాల్లో పనిచేసిన బారువా మాత్రం తాను రిస్క్‌ జాబ్‌ చేస్తున్నానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ అలా అనుకోని ఆగిపోయి ఉంటే చారిత్రక గుర్తింపుకు నోచుకొని ఉండేవారు కాదమో!
వయొలెట్‌ బారువా....‘బ్యూటిఫుల్‌ నేమ్‌’ అంటారు ఆమె సన్నిహితులు.
వర్ణశాస్త్రం ప్రకారం వయొలెట్‌ కలర్‌ను జ్ఞానానికి, సున్నితత్వానికి ప్రతీకగా చెబుతారు. ‘సాహసం’ అనే మరో ప్రతీకను కూడా చేర్చారు బారువా.
గౌహతి యూనివర్శిటీ నుంచి బాచ్‌లర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీ తీసుకున్నారు బారువా. యూనివర్శిటీ రోజుల్లో కూడా చదువు ఎంత ముఖ్యమో, సమాజం కూడా అంతే ముఖ్యం అనుకునేవారు. తాను వెళ్లే దారిలో ఎక్కడైనా గొడవ జరిగితే సర్దిచెప్పడం, ఆకతాయిల పని పట్టడం జరిగేది.
గౌలపర, మోరిగన్, కచర్,బర్‌పెట జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించడమంటే మాటలు కాదు. కేవలం తూటాలు, లాఠీలను నమ్ముకుంటే మాత్రమే సరిపోదు. తెలివి ఉపయోగించాలి. అల్లర్లకు అడ్రస్‌ అయిన ఆ నాలుగు జిల్లాల్లో శాంతిభద్రతలను పరిరక్షించడంలో బారువా విజయం సాధించారు.
సీబిఐ విభాగంలోనూ తన సత్తా చాటారు.

నేరపరిశోధనలో, నేరాలను అదుపులో పెట్టడంలో తనదైన ముద్ర వేసిన బారువా ఇలా అంటున్నారు...
‘నా కెరీర్‌లో ఏ పోస్టింగ్, టాస్క్‌కు ఇబ్బంది పడలేదు. నో చెప్పలేదు. గౌహతి పోలిస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేయడం కంటే మారుమూల ప్రాంతాలలో పనిచేయడానికే ఆసక్తి చూపాను’
బారువా ఏ ప్రాంతంలో పనిచేసినా ‘పోలిస్‌ ఆఫీసర్‌’తో పాటు ‘కేరింగ్‌ ఆఫీసర్‌’ అని అభిమానంగా పిలుచుకుంటారు ప్రజలు.
అస్సాం పోలిస్‌శాఖలో మహిళల సంఖ్య చాలా తక్కువ.
అయితే అస్సాం తొలి మహిళా డీఎస్పీ, తొలి మహిళా డీఐజీ, తొలి ఐజీ అయిన బారువా స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు పోలిస్‌శాఖలో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. బారువా సాధించించిన మరో మహత్తరమైన విజయమిది!

Advertisement
Advertisement