పచ్చగా నిను కొలిచేమయ్యా.. చల్లగా చూడు మా బొజ్జ గణపయ్యా..

Vinayaka Chavithi Special Story: People Choose Eco Friendly Idols - Sakshi

వినాయక చవితి... యువతరం గుండెల్లో పెట్టుకునే పండగ. ఆనందం, ఆధ్యాత్మిక భావన... వాడవాడల్లో నిండుగా వెలిగే పండగ. కొంతకాలంగా ‘పర్యావరణహితం’ యూత్‌ ఎజెండాలో మొదటి వరుసలో చేరింది. రసాయన రహిత విగ్రహాలను కొనుగోలు చేయడానికే యువతరంలో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకు వేసి, మట్టితో విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణి చేస్తున్నారు. పర్యావరణహిత సందేశానికి రెక్కలు ఇస్తున్నారు...

వినాయక చవితి యువతరం సొంతం చేసుకునే పండగ. పండగ ముందు పందిరిగుంజలు పాతడం నుంచి నిమజ్జనం వరకు ప్రతిక్షణం ఆధ్యాత్మిక భావన, ఆనందం వారి సొంతం. అయితే గత కొద్దికాలంగా ‘ఎకో–ఫ్రెండ్లీ గణేశ’ విగ్రహాల వైపు యూత్‌ మొగ్గుచూపుతోంది. వారిలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. లక్నోలోని ఐటీ కళాశాల ముందు గత అయిదు సంవత్సరాలుగా వినాయకుడి విగ్రహాలను అమ్ముతున్నాడు ఆకాష్‌ కుమార్‌. ‘గతంతో పోల్చితే మార్పు వచ్చిందనే చెప్పాలి. మట్టితో తయారు చేసిన గణేశుడి విగ్రహాలు కొనడానికి ప్రాధాన్యత ఇస్తున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంది.

కొద్దిపాటి కృత్రిమ రంగులు, ప్లాస్టిక్‌ అలంకరణను కూడా యువత ఇష్టపడడం లేదు’ అంటున్నాడు ఆకాష్‌ కుమార్‌. తనీష ఈసారి ఎకో–ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాన్ని కొనుగోలు చేసింది. గత సంవత్సరం కొనుగోలు చేసిన విగ్రహంతో పోల్చితే ఆకర్షణీయంగా లేకపోవచ్చుగాక, కాని తన మనసుకు మాత్రం తృప్తిగా ఉంది. ‘ఆకర్షణీయమైన రసాయన రంగుల కంటే పర్యావరణం ముఖ్యం’ అంటుంది తనీష. మరో కస్టమర్‌ అనీష కూడా ఎకో–ఫ్రెండ్లీ విగ్రహాన్నే కొనుగోలు చేసింది. ‘నేను కొనడమే కాదు, ఇతరులు కూడా కొనేలా నా వంతు ప్రచారాన్ని చేస్తున్నాను’ అంటుంది అనీష. సాధారణ విగ్రహాలతో పోల్చితే పర్యావరణహిత వినాయక విగ్రహాల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని కొనడానికి ఆసక్తి చూపడం విశేషం.

సాధారణంగా కోల్‌కతాలో మట్టితో తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. ముంబైలో మాత్రం ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ను ఉపయోగించి తయారు చేసే విగ్రహాలే ఎక్కువ. అయితే బాంద్రాలోని పాలి హిల్‌కు చెందిన యువత మట్టిని ఉపయోగించి విగ్రహాలు తయారు చేయడమే కాదు, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్, మట్టి విగ్రహాలకు మధ్య తేడా గురించి ప్రచారం చేస్తున్నారు. ‘ఏదైనా మంచి విషయం చెబితే ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తారు చాలామంది. కాని మేము చెప్పే విషయాలను చాలా ఆసక్తిగా వింటున్నారు. మార్పు వస్తుందనే నమ్మకం వచ్చింది’ అంటున్నాడు మట్టితో వినాయక విగ్రహాలు తయారుచేసే సచిన్‌. బాంద్రా నుంచి బెంగళూరు వచ్చేద్దాం. బెంగళూరుకు చెందిన శ్రీ విద్యారణ్య యువక సంఘ, కర్ణాటక స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌తో కలిసి ఔషధ గింజలతో కూడిన పదివేల మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేశారు.

జైపుర్‌కు చెందిన కెరీర్‌ కౌన్సెలర్‌ షల్లీ కపూర్‌ తన ఫ్రెండ్‌ శ్వేతతో కలిసి ‘పర్యావరణహిత వినాయక చవితి’ గురించి స్కూల్, కాలేజీలలో విస్తృతంగా ప్రచారం చేయడమే కాదు, మట్టితో చిన్న చిన్న వినాయక విగ్రహాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తుంది. ‘మార్పు అనేది యువతరంతోనే మొదలవుతుందనే బలమైన నమ్మకం ఉంది. అందుకే ఈ ప్రయత్నం’ అంటుంది శ్వేత. ‘నేను సొంతంగా గణేశుడి విగ్రహాన్ని తయారు చేయడం సంతోషంగా అనిపించింది. వర్క్‌షాప్‌లో నేర్చుకున్న, విన్న విషయాలను తల్లిదండ్రులతో పంచుకున్నాను’ అంటుంది అర్చనా గుప్తా. పదిమంది నడిచే బాటే ఆ తరువాత ట్రెండ్‌ అవుతుంది. యువతరంలో మొదలైన మార్పును చూస్తుంటే పర్యావరణహిత విగ్రహాలను ఇష్టపడే ధోరణి ట్రెండ్‌గా మారడానికి అట్టే కాలం పట్టకపోవచ్చు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top