డైనోసార్‌ అంతెత్తు..! కరములు కించిత్తు..!! | Tyrannosaurus Rex Alias T-Rex Dinosaur Life History | Sakshi
Sakshi News home page

డైనోసార్‌ అంతెత్తు..! కరములు కించిత్తు..!!

May 27 2026 12:02 PM | Updated on May 27 2026 12:09 PM

Tyrannosaurus Rex Alias T-Rex Dinosaur Life History

ఇజ్జత్‌ మొత్తం పాయె..!

టైరానసారస్‌ రెక్స్‌ అలియాస్‌ టీ రెక్స్‌. సింపుల్‌గా చెప్పాలంటే.. రాకాసి బల్లుల రాజ్యానికి రారాజు టైపు. డైనోసార్లలో సూపర్‌స్టార్‌ అన్నమాట. జురాసిక్‌ పార్కు సినిమాలన్నిటిలో దీనిదే కీలక పాత్ర. 45 అడుగుల పొడవు.. భీకరాకారం.. భయపెట్టే కళ్లు.. కరకరా నమిలేసే పళ్లు.. అయితే, అన్నీ ఎలివేషన్లే అయితే.. దీనికి బాగా పొగరు పెరిగిపోదూ.. ఈ డౌట్‌తోనేనేమో దీన్ని సృష్టించే సమయంలో దేవుడు దీనికి ‘హ్యాండ్‌’ ఇచ్చాడు. 45 అడుగుల టీ రెక్స్‌కు కేవలం మూడడుగుల పొడవుండే చేతులు మాత్రమే ఇచ్చాడు.

అంటే.. ఆరడుగుల మనిషికి ఐదు అంగుళాల చేతులు ఉన్నట్లన్నమాట. నిజంగా దేవుడు అలా చేశాడా లేదా అన్నది పక్కనపెడితే.. అత్యంత భయంకరమైన మాంసాహారిగా పేరొందిన టీ రెక్స్‌ చేతులు ఎందుకు అంత చిన్నగా ఉన్నాయి అన్న అంశంపై ఏళ్లుగా శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. వాళ్ల బుర్రలకు భరోసా కల్పిస్తూ యూనివర్సిటీ కాలేజీ లండన్‌ పరిశోధకులు తామీ రహస్యాన్ని ఛేదించామని తాజాగా ప్రకటించారు.

ఇప్పటివరకూ దాని భారీ శరీర పరిణామం వల్లే చేతులు చిన్నవిగా ఉన్నాయని భావించారు. అయితే.. వేటలో చేతుల ప్రాధాన్యం తగ్గిపోవడంతో.. పరిణామ క్రమంలో అవి చిన్నవి అయ్యాయని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు తేల్చారు. ఇందుకోసం థెరోపాడ్‌ జాతి డైనోసార్లను పరిశీలించారు. టీ రెక్స్‌తోపాటు ఈ జాతిలోని మరికొన్నిటి చేతులు చిన్నవిగా ఉన్నాయని గుర్తించారు. 

‘‘చేతులు చిన్నగా ఉండటానికి కారణం.. వాటి బలమైన తల, దవడలే. పెద్ద జంతువులను వేటాడేటప్పుడు గోర్లతో కంటే.. దవడలతో దాడి చేయడం సమర్థవంతంగా మారింది. 100 అడుగుల పొడవుంటే భారీ సౌరోపాడ్‌ రాకాసి బల్లిని చేతులతో పట్టుకోవడం సాధ్యం కాదు. వాటిని తలను ఉపయోగించి.. దవడలతో దాడి చేయడం టీ రెక్స్‌కు ఈజీగా ఉండేది. దీంతో ఎప్పుడైతే.. ఉపయోగం తగ్గిందో.. అప్పటినుంచీ వాటి చేతుల సైజూ తగ్గిపోవడం మొదలైంది’’అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన చార్లీ రోజర్‌ చెప్పారు. 

- సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement