Diabetes diet: ఏం తినాలో! ఎలా తినాలో..!!

These Friendly Diet Tips To Help You Lose Weight And Diabetes - Sakshi

వెయిట్‌ లాస్, డయబెటిస్‌ కంట్రోల్‌... ఈ రెండు పదాలు ఇప్పుడు ప్రపంచాన్ని చిటికెన వేలి మీద ఆడిస్తున్నాయి. వార్తా పత్రికలు, టెలివిజన్‌ కార్యక్రమాలు కూడా దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ రెండు అంశాల మీద ఫోకస్‌ పెడుతున్నాయి. ఇందుకోసం నిపుణుల సలహాల శీర్షికలు నిర్వహిస్తున్నాయి. ప్రధానస్రవంతి మీడియా కొంత పరిమితిని, ప్రమాణాలను పాటిస్తూ వస్తోంది. ఇటీవల స్వీయప్రకటిత ఆరోగ్యనిపుణులు సోషల్‌ మీడియాలో ఆరోగ్యసూత్రాలను చెప్తున్నారు. వారి ప్రసంగాలు బరువైన పదాలు, శాస్త్రీయనామాల ప్రస్తావన లేకుండా సాగుతుండడంతో వీక్షకులు కూడా ఆ ప్రోగ్రామ్‌లకు, పోస్ట్‌లకు త్వరగా కనెక్ట్‌ అవుతున్నారు. అయితే ‘డైట్‌’ అనేది స్థూలంగా అందరికీ ఒకే ఫార్ములా పనికిరాదంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు. 

ఎవరి డైట్‌ చార్ట్‌ వారికే!
ఒక వ్యక్తికి కేవలం అధిక బరువు మాత్రమే ఉండి, ఇతర ఆరోగ్యసమస్యలేవీ లేకపోతే ఒక రకం డైట్‌ సూచించాల్సి ఉంటుంది. అది కూడా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, బరువు ఆధారంగా నిర్ణయించాలి. అలాగే సెంట్రల్‌ ఒబేసిటీ, ఓవరాల్‌ ఒబేసిటీ వంటి తేడాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒక వ్యక్తికి అధిక బరువుతోపాటు డయాబెటిస్, హైబీపీ, గుండె సమస్యల వంటి సమస్యలు ఉన్నట్లయితే డైట్‌ ప్లాన్‌ మరో రకంగా ఉండాలి. అలాగే పై రెండు కేటగిరీల్లో కూడా ఏ ఇద్దరికీ ఒకరకమైన డైట్‌ ప్లాన్‌ సరిపడదు.

ప్రతి వ్యక్తికీ వారి వారి బాడీ మాస్‌ ఇండెక్స్‌ను బట్టి, హెల్త్‌ హిస్టరీని అనుసరించి, వారి డైలీ రొటీన్‌ను దృష్టిలో పెట్టుకుని మరీ డైట్‌ డిజైన్‌ చేయాల్సి ఉంటుంది. అది న్యూట్రిషన్‌ ఎక్స్‌పర్ట్‌లకు మాత్రమే సాధ్యమయ్యే పని. కాబట్టి సోషల్‌ మీడియా సమాచారాన్ని ఆధారం చేసుకుని డైట్‌ విషయంలో స్వీయ ప్రయోగాలకు పోవద్దని, ఆరోగ్యానికి హాని తెచ్చుకోవద్దని చెబుతున్నారు నిపుణులు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రధానంగా ఫ్యాషన్, ఫుడ్, డైట్‌లు ట్రెండింగ్‌ టాపిక్స్‌ గా ఉన్నాయి. ఫ్యాషన్‌ విషయంలో ఆరోగ్యానికి వచ్చే ముప్పేమీ ఉండదు, అలాగే వంటల విషయంలో కూడా సాధారణంగా ప్రమాదం ఉండబోదు. ఇక డైట్‌ విషయంలో మాత్రం ఎవరికి వారు స్వయంగా నిపుణులను సంప్రదించి, వారి సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు.

చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top