కలిసి చేస్తే కలదు ఆరోగ్యం అంటున్నారు యోగా శిక్షకులు. ఆసనాలు సాధన చేసేటప్పుడు మరొకరితో కలిసి చేసే పార్ట్‌నర్ యోగా వల్ల అదనపు ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో నగరంలో ఈ పార్ట్‌నర్ యోగా క్రేజీగా మారుతోంది. మరీ ముఖ్యంగా భాగస్వామితో కలిసి ఆసనాల సాధనపై ఆసక్తికనబరుస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఈ తరహా పార్ట్‌నర్ యోగా సాధన చేసే ఔత్సాహికులు హైదరాబాద్ సిటీలోని ఫిట్‌నెస్ స్టూడియోల్లో, యోగా సెంటర్లలో బాగా కనిపిస్తున్నారు. దీనిని కపుల్ యోగా అనే పేరుతో ప్రత్యేకంగా జంటల కోసం కూడా సాధన చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ప్రముఖ యోగా శిక్షకురాలు రీనా హిందోచా దీని గురించిన విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
యోగా భంగిమలను సాధన చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మద్దతు అందించే శైలినే పార్ట్‌నర్ యోగా అని పేర్కొంటున్నారు. యోగాసనాలు వేసే సమయంలో పరస్పరం సహకరించుకునే క్రమంలో.. సమతుల్యతను కాపాడుకోవడం, శరీరం మరింత బాగా సాగేందుకు, భంగిమను సరిగ్గా అనుసరించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఆసనాలు వేయడం సులభం అవుతుంది.
ఇది ఫిట్‌నెస్‌తో పాటు నమ్మకం, పరస్పర విశ్వాసం కల్పించడంతో పాటు.. అనుబంధాలను బలోపేతం చేస్తుంది. భాగస్వామితో సాధన చేయడం వల్ల యోగా మరింత ఆహ్లాదకరంగా ప్రేరణ కలిగించేదిగా మారుతుంది. ప్రత్యేకించి కొన్ని భంగిమలు ఒంటరిగా కష్టంగా భావించే వ్యక్తులు కూడా భాగస్వామితో చేసినప్పుడు వాటిని సులభంగా వేయగలుగుతారు. తమ జీవిత భాగస్వామి, సహోద్యోగి లేదా అప్పుడే పరిచయం అయిన యోగా స్నేహితులతో కలిసి భాగస్వామి సాధన చేయవచ్చు. ఇది యోగాను కలిసి ఆస్వాదించడానికి ఒక అందమైన మార్గం.
ప్రయోజనాలెన్నో..
ఈ తరహాలో యోగా సాధన శరీరంలోని ఫ్లెక్సిబులిటీని, అదే విధంగా బలాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆసనాలను సరైన విధంగా సాధన చేసేందుకు సహాయపడుతుంది. ఆసనాలు వేసే సమయంలో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ నైపుణ్యంతో పాటు భావోద్వేగ బంధాన్ని కూడా పెంచుతుంది.
ఆరోగ్యకరం..‘భాగ’స్వామ్యం..
ఒకరు బాగా అనుభవజ్ఞులై మరొకరు కొత్తగా యోగసాధన చేస్తున్నవారైతే.. ఆ వ్యత్యాసానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ‘భాగస్వామి యోగా భంగిమలు శారీరక శ్రేయస్సును పెంచడమే కాకుండా నమ్మకాన్ని, కమ్యూనికేషన్ని కూడా పెంపొందిస్తాయి.
ఇవి ఆయా వ్యక్తులు తమ భాగస్వామితో పరస్పర అవగాహన కలిగి ఉండడానికి, ఆ సమయంలో ఏకాగ్రతతో ఉండటానికి ప్రోత్సహిస్తాయి అని అక్షర యోగా కేంద్ర వ్యవస్థాపకురాలు హిమాలయన్ సిద్ధా అక్షర్ అంటున్నారు. నగరవాసులకు క్రేజీగా మారిన పార్ట్‌నర్ యోగా ఏ వ్యాయామం అయినా ప్రారంభించే
ముందు తప్పనిసరిగా వార్మప్ వ్యాయామాలు చేయాలి. మీ భాగస్వామితో అనువుగా ఉండేలా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామి లేదా సన్నిహిత మిత్రులనో ఎంచుకోవడం మంచిది. వ్యక్తుల శారీరక సామర్థ్యాలు, శరీర కదలికలు ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకుని పార్ట్‌నర్‌ని ఎంచుకోవాలి. అలాగే ఆసనాల సమయంలో కదలికలు నిదానంగా ఉండాలి.
భాగస్వామి బలంతో పాటు పరిమితులను కూడా సరిగా అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడూ బలవంతంగా లేదా అతిగా సాగదీయకూడదు. ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. శ్వాస క్రియ కూడా ఒకే క్రమంలో ఉండేలా చూసుకోవాలి.
(చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్)


