Kundurti Anjaneyulu: వచన కవితా మూర్తి

Telugu Poet Kundurti Anjaneyulu Centenary, Vachana Kavitha Pitamahudu - Sakshi

జాషువా, విశ్వనాథల ప్రేరణా ప్రభావాలతో పద్య కవిత రచనకు పూనుకున్నాడు కుందుర్తి ఆంజనేయులు. విశ్వనాథ వారి ప్రౌఢమైన శైలిలో ‘సౌప్తికం’ అనే కావ్యాన్ని రచించాడు. ఆయన 1922 డిసెంబర్‌ 16వ తేదీన నరసరావుపేట సమీపంలో కోటవారిపాలెంలో పేదకుటుంబంలో జన్మించాడు. నరసరావుపేట మున్సిపల్‌ హైస్కూల్‌లో అనిసెట్టి, రెంటాల, బెల్లంకొండ రామదాస్, మాచిరాజు దేవీ ప్రసాదులు ఆయన సహాధ్యాయులు. మాచిరాజు దేవీప్రసాద్‌ ప్రేరణతో శ్రీశ్రీ కవిత్వ లాలసుడై వచన కవిత్వం వైపు దృక్పథం మరల్చుకున్నాడు. నవ్యకళా పరిషత్, నరసరావుపేట ఆధ్వర్యంలో ఏల్చూరి, బెల్లంకొండ రామదాసులతో కలసి తెలుగులో తొలి వచనా కవితా సంపుటి ‘నయాగరా’ను 1944లో ప్రచురించాడు. తొమ్మిది కవితల సంపుటి నయాగరాలో కుందుర్తి రచించిన ‘మన్యం లోకి’ కవితలో మన్యం వీరుడు అరి విప్లవాగ్నిని ప్రశంసించాడు. 

‘జయిస్తుంది’ కవితలో బ్రిటిష్‌ వారి దురాగతాలను నిరసించాడు. క్విట్‌ ఇండియా ప్రభావంతో అసమ సమాజాన్ని ఈసడిస్తూ ‘ఒకవేపున అధికోత్పత్తీ/ మరోవేపు డొక్కల కరువు’ ఇకపై సాగవని హెచ్చరిక చేశాడు. ఆయన కవితలపై శ్రీశ్రీ మరోప్రపంచం గేయం ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 

‘పాతకాలం పద్యమైతే / వర్తమానం వచన గేయం’ అంటూ ‘నాలో నినాదాలు’లో కుందుర్తి స్పష్టంగా ప్రకటించాడు. ఎందరో అధునిక కవులను ప్రభావితం చేశాడు. అనిసెట్టి, ఆరుద్ర, దాశరథి, సి. నారాయణ రెడ్డి, రెంటాల వంటి వారు వచన కవితను ఆదరించి వచన కవితా సంపుటాలు ప్రచురించారు. వచనకవితా మూర్తి కుందుర్తికి ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ ఊపిరి. ప్రాచీన కవిత్వంపై తిరుగుబాటు చేసి ‘రచనల పూలతోటలో ఛందస్సుల మొక్కలు నాటను’ అని ప్రతిజ్ఞ చేశాడు. ఆధునిక కాలానికి అనువైన ప్రక్రియ వచన కవిత్వ మేనని నిరూపించేందుకు ఎంతో శ్రమపడ్డాడు. 

ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో వ్యాసాలు, పీఠికల ద్వారా వచన కవితా ప్రచారం ముమ్మరంగా చేసినందున కుందుర్తిని వచన కవితా పితామహుడిగా విమర్శకులు పేర్కొన్నారు. ఆశ, ఆచారిగారి అమ్మాయి, శిక్ష వంటి గేయ నాటికలు రాశాడు. తెలంగాణ, యుగేయుగే, నగరంలో వాన, నాలోని నాదాలు, కుందుర్తి కృతులు పాఠకుల మన్ననలు పొందాయి. ‘హంస ఎగిరిపోయింది’ అనే సతీస్మృతి కావ్యం విశిష్టమైంది. ఆయన కవిత్వంలో అభ్యుదయ దృక్పథం, హేతువాద దృష్టి, ప్రకృతిని సామాజిక స్పృహతో సమన్వయించటం, చమత్కారమైన అధిక్షేపణ, ఆకర్షణీయమైన అంత్యప్రాసలు ఎందరో యువకులను ప్రభావితం చేశాయి. ఆయన 1982 అక్టోబర్‌ 25వ తేదీన మరణించినా, వచన కవితా పితామహుడిగా ఆధునికాంధ్ర కవిత్వంలో చిరస్మరణీయుడు! (క్లిక్‌ చేయండి: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము)

– డాక్టర్‌ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు 
(డిసెంబర్‌ 16 కుందుర్తి ఆంజనేయులు శత జయంతి ముగింపు) 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top