‘కృష్ణవేణి అమ్మాళ్’‌.. ఈ తరానికి సిసలైన ప్రతినిధి

Tamil Nadu Mother Give Equal Share To Daughters The Inheritance Home - Sakshi

చెన్నై: ఆడపిల్ల పెళ్లి చేశాక ఎన్నటికీ ఈడ పిల్ల కానే కాదు అనేది మన సనాతన సంప్రదాయం. అందుకే, వారసత్వంగా వచ్చే ఆస్తులేవైనా మగపిల్లలకే తప్ప ఆడపిల్లలకు ఇవ్వాలనుకోరు. కానీ, తమిళనాడులోని శతాధిక వృద్ధురాలు కృష్ణవేణి అమ్మాళ్‌ మాత్రం కొడుకుతో పాటు సమానంగా తన ముగ్గురు కూతుళ్లకూ వారసత్వ ఇంటి ఆస్తి దక్కాల్సిందే అని పట్టుబట్టి పోలీసు స్టేషన్‌ గడప తొక్కింది. అనుకున్నది సాధించింది. విల్లుపురంలోని సిరువాంధాడు గ్రామానికి చెందిన కృష్ణవేణి అమ్మాళ్‌ పండు ముదుసలి. వయసు 108 ఏళ్లు. ఆమెకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కృష్ణవేణి అమ్మాళ్‌ కూతుళ్లతో పాటు ఉండగా కొడుకు గణేశన్‌ అదే ఊళ్లో విడిగా తన కుటుంబంతో నివసిస్తున్నాడు. వారసత్వంగా వస్తున్న ఇంటిని కొడుకుతో పాటు కూతుళ్లకూ సమాన వాటా ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆ అవ్వ సదరు అధికారులను కలిసింది. కొడుకు తనకు తెలియకుండా ఆస్తి పత్రాన్ని మార్చుకొని, మోసం చేశాడని తెలిసింది. (చదవండి: ఇంత అవమానమా.. ఆలస్యంగా వెలుగులోకి..)

నేరుగా కొడుకును అడిగింది. ‘చెప్పకుండా ఆస్తి నీ పేరున మార్చుకున్నావు. ఇప్పటికైనా అక్కచెల్లెళ్లకూ ఆ ఆస్తిలో సమానవాటా ఇవ్వమ’ని అడిగితే కాదు పొమ్మన్నాడు. కృష్ణవేణి అమ్మాళ్‌ ఊరుకోలేదు. జిల్లా పోలీసు అధికారులను కలిసి, కొడుకు చేసిన మోసాన్ని వివరించింది. సహాయం చేయమని కోరింది. జిల్లా ఎస్పీ ఎస్‌.రాధాకృష్ణన్‌ సిరువాంధాడు గ్రామానికి వెళ్లి కృష్ణవేణి అమ్మాళ్‌ ఫిర్యాదుపై ఆరా తీశారు. గణేశన్‌ని పిలిచి విషయం పై నిలదీశారు. ఎస్పీ మాట్లాడిన తర్వాత గణేశన్‌ తన అక్కచెల్లెళ్లకూ ఇంట్లో వాటా ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ వెంటనే, ఆస్తిని గణేశన్‌తోపాటు ముగ్గురు అక్కచెల్లెళ్లకూ సమాన వాటా చెందేలా పత్రం రాసి, రిజిస్టర్‌ చేయించారు. డీఎస్పీ రాధాకృష్ణన్, ఇతర పోలీసు సిబ్బంది సమక్షంలో కొత్త భూ పత్రాన్ని కృష్ణవేణి అమ్మాళ్‌కు అందజేశారు. కొడుకుతో పాటు కూతుళ్లకూ వారసత్వ ఇంటిలో వాటా దక్కాల్సిందే అని పోరాడిన కృష్ణవేణి అమ్మాళ్‌ ఈ తరానికి సిసలైన ప్రతినిధిగా నిలిచారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top