నమ్మకంతో నక్షత్రాలై! | Successful youngest women entrepreneurs in India | Sakshi
Sakshi News home page

నమ్మకంతో నక్షత్రాలై!

Sep 13 2025 1:12 AM | Updated on Sep 13 2025 1:12 AM

Successful youngest women entrepreneurs in India

గెలుపు దారి

‘స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు’ అనుకునే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా డిక్షనరీలో ‘ఇక చాలు’ అనే మాట ఎప్పుడూ లేదు. సక్సెస్‌ఫుల్‌ కన్సల్టెంట్‌ నుంచి సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది. మొదట 73 మంది ఇన్వెస్టర్‌ల నుంచి ఆమెకు తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్‌ నమ్మాడు. ఆ నమ్మకమే గొప్ప విజయం అయింది.

పేషెంట్లు, హాస్పిటల్స్‌ మధ్య దూరం ఉందని గ్రహించిన గరిమ సానే ‘ప్రిస్టీన్‌ కేర్‌’తో హెల్త్‌కేర్‌ రంగంలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఆమె మాటలను పెద్దగా ఎవరూ విశ్వసించలేదు. అయినా ఆమె ప్రయాణం ఆపలేదు. విశ్వసనీయతే జీవనాడిగా ప్రయాణం ప్రారంభించిన ప్రిస్టీన్‌కేర్‌ హెల్త్‌కేర్‌ రంగంలో సరికొత్త సంచలనం అయింది.

‘సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’గా పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంతో ఒక స్టార్టప్‌తో ప్రయాణం మొదలుపెట్టిన వినీతా సింగ్‌కు అపజయాలు హాయ్‌ చెప్పాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే ఉత్సాహం ఒక్కటే సరిపోదని వ్యూహం కూడా కావాలని గ్రహించి మేకప్‌ బ్రాండ్‌ ‘షుగర్‌ కాస్మోటిక్స్‌’తో తిరుగులేని విజయాన్ని సాధించింది.

దేశీయ యూనికార్న్‌ క్లబ్‌లో కొన్ని స్టార్టప్‌లు యూనికార్న్‌ హోదాను కోల్పోయాయి. కొన్ని మాత్రం ఆ హోదాను స్థిరంగా నిలుపుకుంటూనే, ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తున్నాయి.

‘వైవిధ్యమైన రంగాలలో మహిళా వ్యాపారవేత్తలు అద్భుత విజయాలు సాధించారు’ అంటూ గరిమ సానే (ప్రిస్టీన్‌ కేర్‌), రుచి కల్రా (ఆఫ్‌ బిజినెస్‌), వినీతా సింగ్‌ (షుగర్‌ కాస్మోటిక్స్‌) పేర్లను ప్రస్తావించింది ఏఎస్‌కె ప్రైవేట్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా యూనికార్న్‌ అండ్‌ ఫ్యూచర్‌ యూనికార్న్‌–2025 నివేదిక.
ఈ ముగ్గురు ఎవర్‌గ్రీన్‌ యూనికార్న్‌ స్టార్‌ల సక్సెస్‌ మంత్రా గురించి...

పరాజయాల తరువాత ఘన విజయం
లక్నోకు చెందిన వినీతాసింగ్‌ చదువులో ఎప్పుడూ ముందుండేది. స్కూల్, కాలేజి రోజుల్లో బంగారు పతకాలు అందుకుంది. ఐఐటీ, మద్రాస్‌లో చదువుకున్న వినీత బ్యాడ్మింటన్‌లో సత్తా చాటేది. ఎన్నో టోర్నమెంట్స్‌లో విజయం సాధించింది. పరుగు పందేలలో కూడా దూసుకుపోయేది. ఒక్కమాటలో చెప్పాలంటే చురుకుదనానికి కేరాఫ్‌ అడ్రస్‌లా ఉండేది.

ఇన్వెస్టింగ్‌ బ్యాంకింగ్‌లో విలువైన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వదులుకొని ‘క్వెజాల్‌’ వెంచర్‌ మొదలు పెట్టింది. ఆ స్టార్టప్‌ విజయం సాధించలేదు. ఆ తరువాత ప్రారంభించిన ‘ఫ్యాబ్‌–బాగ్‌’ అంతంతమాత్రమే అనిపించింది. అయిన్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. గట్టి విజయం కోసం తపన పోలేదు. ‘షుగర్‌ కాస్మోటిక్స్‌’ స్టార్టప్‌తోతో అసలు సిసలు విజయాన్ని అందుకుంది. ‘రకరకాల స్కిన్‌ టోన్‌లను దృష్టిలో పెట్టుకొని అధిక నాణ్యతతో కూడిన, అందుబాటు ధరల్లో ఉండే ప్రాడక్ట్స్‌ను తీసుకువచ్చాం’ అంటుంది వినీతాసింగ్‌.

‘షుగర్‌ కాస్మోటిక్స్‌’లో పనిచేస్తున్న 75 శాతం మంది ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. రియాలిటీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ కార్యక్రమంలో జడ్జీ, ఇన్వెస్టర్‌గా రెండు బాధ్యతలు నిర్వహిస్తోంది వినీత. ఈ కార్యక్రమం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలనుకునే ప్రతిభావంతులకు విలువైన సలహాలు ఇస్తోంది. వారి కలలు సాకారం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. యూనికార్న్‌ స్టార్‌గా వినీతాసింగ్‌ విజయం ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతుంది. అందులో ఒకటి.... ‘కష్టపడితే... కాలంతో పాటు నడిస్తే ఏదీ అసాధ్యం కాదు’

డెబ్బైమూడు మంది తిరస్కరించారు!
పంజాబ్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుకుంది. అయినప్పటికీ ఆర్థికవిషయాలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో ఎంబీఎ చేసింది. చదువు పూర్తయిన తరువాత మెకెన్జీ అండ్‌ కంపెనీలో తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసింది. ఆ కంపెనీలో పనిచేసిన అనుభవం తనలోని నైపుణ్యాలను మెరుగు దిద్దుకునేలా చేసింది. 

ఆ నైపుణ్య బలమే వ్యాపారవేత్తగా తన ప్రయాణానికి ఇంధనం అయింది. మెటల్స్, కెమికల్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన బి2బి కామర్స్‌ ΄్లాట్‌ఫామ్‌ ‘ఆఫ్‌బిజినెస్‌’కు శ్రీకారం చుట్టింది. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ముడి సరుకును అందించే కంపెనీ ఇది. మొదట్లో 73 మంది ఇన్వెస్టర్‌ల నుంచి తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్‌ నమ్మాడు.‘ఆఫ్‌బిజినెస్‌’ను సక్సెస్‌ఫుల్‌ వెంచర్‌గా తీర్చిదిద్దిన రుచి కల్రా ఆ తరువాత ఈ కంపెనీకి అనుబంధంగా ‘ఆక్సీజో’ పేరుతో ఫైనాన్షియల్‌ సర్సీసెస్‌ మొదలుపెట్టింది.

బలమైన నాయకత్వ సామర్థ్యానికి అంకితభావం తోడైతే ఎంత విజయం సాధించవచ్చో నిరూపించింది రుచి. ‘ఆఫ్‌బిజినెస్‌’ విజయంతో ఎంతోమంది ఔత్సాహికులు, వ్యాపార రంగంలోకి రావాలని కలలనే కనే యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది.

మొదట్లో ఎవరూ విశ్వసించలేదు!
గైనకాలజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న డా. గరిమ సానే ‘ప్రిస్టీన్‌ కేర్‌’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది. తన వైద్యవృత్తి ద్వారాఎన్నోరకాల నైపుణ్యాలను సొంతం చేసుకున్న గరిమకు ఓపిక ఎక్కువ. తొందరపాటు లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. 

అధిక పనిభారం, తక్కువమంది సిబ్బంది, పేషెంట్లపై సరిౖయెన శ్రద్ధ చూపకపోవడం... కొన్ని హాస్పిటల్స్‌లో ఈ పరిస్థితిని చూసిన గరిమ ‘ప్రిస్టీన్‌ కేర్‌’తో హెల్త్‌కేర్‌ రంగంలోకి అడుగుపెట్టింది. హాస్పిటల్స్‌కు, పేషెంట్లకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి, పేషెంట్లు కోరుకునే క్వాలిటీ సర్జికల్‌ కేర్‌ను అందించాలి అనే లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది.

వైద్యుల ఎంపిక, క్లినిక్‌లో అపాయింట్‌మెంట్, డయాగ్నోస్టిక్‌ కేంద్రాలలో టెస్ట్‌లు బుకింగ్‌ చేయడం, ఇన్సూరెన్స్‌ పేపర్‌ వర్క్, హాస్పిటల్‌ ఆడ్మిషన్‌–డిశ్చార్జీ ప్రాసెస్, సర్జరీ తరువాత ఫాలో–అప్‌ కన్సల్టేషన్, రకరకాల డిపార్ట్‌మెంట్‌లతో సమన్వయం... మొదలైన పనులు ప్రిస్టీన్‌ కేర్‌ జాబితాలో ఉన్నాయి. అందుకే పేషెంట్ల సర్జరీని సులభతరం చేసే అత్యాధునిక హెల్త్‌కేర్‌ కంపెనీగా ‘ప్రిస్టీన్‌ కేర్‌’ పేరు తెచ్చుకుంది. 

ప్రస్తుతం ప్రిస్టీన్‌ కేర్‌ 150కి పైగా క్లినిక్స్, 800కి పైగా పార్ట్‌నర్‌ హాస్పిటల్స్, 400కి పైగా సూపర్‌ స్పెషలిస్ట్‌ సర్జన్‌లను ఆపరేట్‌ చేస్తుంది.

మొదట్లో చాలామంది వైద్యులు, హాస్పిటల్స్‌ గరిమ చెప్పే మాటలను పెద్దగా విశ్వసించలేదు. ఆ తరువాత వారికి ప్రిస్టీన్‌ కేర్‌ అంకితభావం, కష్టం అర్థమయ్యాయి.
‘హెల్త్‌కేర్‌ అనేది కేవలం సైన్స్‌ మాత్రమే కాదు నమ్మకం, భావోద్వేగాలు కూడా అందులో మిళితమై ఉన్నాయి’ అంటున్న గరిమ మార్కెటింగ్‌ వ్యూహాలను బాగా అర్థం చేసుకుంది. ఆ వ్యూహాలతో కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లింది. ‘సర్జరీ సింప్లిఫైడ్‌’ అనేది పిస్ట్రీన్‌ కేర్‌ ట్యాగ్‌లైన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement