సంసార జీవితంతో వేగలేను

Sri Kalahastiswara Satakam Special Story In Telugu - Sakshi

శ్రీకాళహస్తీశ్వర శతకం

కాయల్గాచె వధూనఖాగ్రముల చే గాయంబు వక్షోజముల్‌          
రాయన్రాపడె ఱొమ్ము మన్మథ విహారక్లేశవిభ్రాంతిచే                    
ప్రాయంబాయెను బట్టగట్టెతల చెప్పన్‌ రోత సంసారమే
చేయంజాలవిరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వరా ! 

     
భావం: శ్రీకాళహస్తీశ్వరా! స్త్రీల గోటిగీట్లతో నా శరీరమంతా కాయలు కాసింది. వారి వక్షోజముల రాపిడికి నా గుండె మొద్దుబారి పోయింది. మన్మథలీలల బాధలతో, మోహంతో, నా యవ్వనమంతా గడచిపోయింది. బట్టతల వచ్చేసింది. చెప్పాలంటే ఈ సంసార జీవితం నాకిపుడు అసహ్యం వేస్తోంది. ఇక నేనీ సంసార జీవితంతో వేగలేను. నన్నింక వైరాగ్య జీవితంలోనికి మళ్లించు ప్రభూ!   

నిన్నే రూపముగా భజింతు  మదిలో, నీరూపు మోకాలొ, స్త్రీ 
చన్నో కుంచమొ మేకపెంటికయొ యీసందేహముల్మాన్పినా           
కన్నారన్భవదీయమూర్తి సగుణాకారంబుగాజూపవే
చిన్నీరేజ విహార మత్త మధుపా శ్రీకాళహస్తీశ్వరా!  
              

భావం: శ్రీ కాళహస్తీశ్వరా! మనోకమలంలో విహరించే తుమ్మెదవైన ఈశ్వరా! శ్రీకాళహస్తీశ్వరా! నిన్నేరూపంతో ఆరాధించేది? నీ ఆకారము మోకాలా? స్త్రీ వక్షోజమా? మేకపెంటికయా? కుంచమా? నా యీ సందేహాన్ని తొలగించి, నీ రూపాన్ని, సగుణాకారంగా, నా కన్నులారా నేను చూసేలా, నాకు చూపించు.     

-తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top