దిగ్గజ నేపథ్య గాయని ఏప్రిల్ 12, ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఏ తరానికి చెందినవారైన ఆశా మధురమైన గాత్రానికి ఫిదా అవ్వాల్సిందే. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆలపిస్తూ..అభిమానుల మనసును దోచుకునే దిగ్గజ గాయని. ఆ సంగీత నైపుణ్యం ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి కూడా. అక్క లతా మంగేష్కర్ అడుగుజాడల్లోనే నడుస్తూ..సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి పాటలైన ఆశా స్వరంతో జత కలిస్తే ఓ అద్భుతం అనేలా పేరుతెచ్చుకున్నారామె.
అలాంటి పాటలరాణి మనముందు లేరు అన్నమాటే బాధగా అనిపిస్తున్నా..ఆమె జ్ఞాపకాలు, స్మృతులు మనకళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. వాటిలో ఒకటి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకే విధమైన రంగు చీరలతో కనిపించిన అద్భుతమైన దృశ్యాలు. ఇద్దరు ఎక్కువగా తెలుపు రంగునే ఎంచుకునేవారు. దీంతో అభిమానులు ఇద్దరూ ఇలా ఎందుకు ధరిస్తారనే దానిపై చాలా కుతుహలంగా ఉండారు. ఒక షాడ్‌కాస్ట్‌లో దివంగత గాయని ఆశా భోంస్లేనే ఆ విషయాన్ని పంచుకున్నారు.

ఎందుకు ఆ రంగే ఇష్టం అంటే..
గతేడాది ఆర్జే అన్మోల్, అతని భార్య నటి అమృతరావు హోస్ట్ చేసిన 'కపుల్ ఆఫ్ థింగ్స్' అనే పాడ్‌కాస్ట్‌తో భోస్లే అరంగేట్రం చేశారు. ఆ సంభాషణలో తన సోదరి వృత్తిపరమైన ప్రత్యర్థి అయినప్పటికీ ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారామె. అంతేగాదు ఆ ఇంటర్వ్యూలో ఆశా తన సోదరి ఇద్దరూ తెలుపు రంగుకే తొలి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చేవారో చెప్పారు.
"నేను దీదీ(లతా మంగేష్కర్) ఎల్లప్పుడూ తెల్ల చీరలే ధరించేవాళ్లం. తెలుపు రంగు మా చర్మ ఛాయకు బాగా నప్పుతుందని మేము భావించేవాళ్ళం. ఇతర రంగులు ధరిస్తే, మేము మరింత నల్లగా కనిపించేవాళ్ళం. ఆ తర్వాత, నేను గులాబీ రంగు చీరలు ధరించడం మొదలుపెట్టాను, దీదీ నన్ను వింతగా చూసేవారు, కానీ నేను నెమ్మదిగా గులాబీ రంగుతో పాటు ఇతర రంగులను కూడా జోడించడం ప్రారంభించాను." అని నవ్వతూ చెప్పారామె.

కాగా, ఆశా భోంస్లే తన దుస్తుల విషయంలో రంగులను ఇష్టపడటం మొదలుపెట్టారు. కానీ లతా మంగేష్కర్ అడపాదడపా కనిపించే ప్రకాశవంతమైన ఎరుపు రంగు బ్రోకేడ్ పల్లు లేదా షెవ్రాన్ ప్రింటెడ్ బహుళ-రంగుల అంచు మినహా, తెలుపు, లేత తెలుపు వంటి ఐవరీ దుస్తులకే పరిమితమయ్యారు.
భోంస్లే కాలక్రమేణా తన జీవిత ఉత్సాహాన్ని వ్యక్తపరిచేలా రంగుల దుస్తులతో తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. ఆమె ఎక్కువగా చందేరి, బనారసి, చేనేత వస్త్రాలు, కాంజీవరం చీరలు, షిఫాన్ ప్రింట్లు వంటి రకరకాల రంగురంగుల చీరలతో తళుక్కుమనేవారు. గాత్రంలోనే కాదు..వేషధారణలోనూ ఆశా ఎవర్‌గ్రీన్ అన్నట్లుగా తన మార్కును చూపించేవారామె.
(చదవండి: Asha Bhosle: నిశబ్దంగా ఆ మధుర స్వరం.. కానీ ఆమె జ్ఞాపకాలు చిరస్మణీయం!)


