ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో టీ షర్ట్స్‌..ఏకంగా రూ. 80 కోట్లు..! | Senthil Sankar T Shirts Made From Recycled Plastic Bottles | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో టీ షర్ట్స్‌..ఏకంగా రూ. 80 కోట్లు..!

Jun 18 2024 6:43 PM | Updated on Jun 21 2024 12:50 PM

Senthil Sankar T Shirts Made From Recycled Plastic Bottles

ప్లాస్టిక్‌​ బాటిల్స్‌తో టీ షర్ట్స్‌ తయారు చేయడం గురించి విన్నారా?. ఔను ఇది నిజం. ఎనిమిది పెట్‌ బాటిల్స్‌ ఉంటే ఒక టీ షర్ట్‌ రెడీ. ఇరవై-ముప్పై బాటిల్స్‌ ఉంటే జాకెట్, బ్లేజర్‌ సిద్ధం. ఎంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. పైగా ఎకో లైన్‌ బ్రాండ్‌తో దుస్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి లాభాలను ఆర్జించాడు. నేడు ఏకంగా ఎనభై కోట్ల టర్నోవర్‌గా కంపెనీగా మార్చాడు. అంతేగాదు పర్యావరణాన్ని సంరక్షిస్తూ కూడా కోట్లు గడించొచ్చని చాటి చెప్పాడు. అతడెవరంటే..

చెన్నైలో పెట్టి పెరిగిన సెంథిల్‌ శంకర్‌ మెకానికల్‌ ఇంజనీర్‌. తండ్రి స్థాపించిన శ్రీరంగ పాలిమర్స్‌కి ఎం.డిగా బాధ్యతలు చేపట్టాడు. పాలియెస్టర్‌ రీసైకిల్‌ చేస్తున్న సమయంలో అతడికి వచ్చిన ఆలోచనే ఎకోలైన్‌ దుస్తులు. ఈ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఇంతకీ బాటిల్స్‌తో చొక్కాలు ఎలా చేస్తారంటే... 

ఎలాగంటే..
పెట్‌ బాటిల్స్‌కున్న మూతలు, రేపర్‌లు తొలగించిన తర్వాత క్రషింగ్‌ మెషీన్‌లో వేసి చిన్న ముక్కలు చేయాలి. ఆ ముక్కలను వేడి చేసి కరగబెట్టి ఫైబర్‌గా మార్చాలి. ఈ ఫైబర్‌ దారాలతో వస్త్రాన్ని రూపొందించాలి. క్లాత్‌తో మనకు కావల్సినట్లు టీ షర్ట్, జాకెట్, బ్లేజర్‌ వంటి రకరకాలుగా కుట్టుకోవడమే. వీటి ధర కూడా తక్కువే. ఐదు వందల నుంచి ఆరు వేల వరకు ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్లి ఎకోలైన్‌ అని సెర్చ్‌ చేయండి అంటున్నారు సెంథిల్‌.

అయితే ఈ వస్త్రాన్ని రీసైకిల్ చేసిన పెట్‌ బాటిల్స్‌తో తయారు చేసినట్లు ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి తమకు చాలా సమయం పట్టిందన్నారు. దీని కోసం, కస్టమర్‌కు అవగాహన కల్పించడానికి  వెబ్‌సైట్‌లో మొత్తం మేకింగ్ ప్రక్రియను వీడియో రూపంలో బహిర్గతం చేయల్సి వచ్చిందనిసెంథిల్ చెప్పారు. ఈ లోగా మిగతా కార్పొరేట్ కంపెనీలు పర్యావరణ అనుకూలంగా రూపొందుతున్న ఈ టీ షర్ట్‌లకు మద్దతు ఇవ్వడంతో అనూహ్యంగా కంపెనీ లాభాల బాట పట్టింది.

ఇక ఈ ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ప్రక్రియలో నీటిని ఆదా చేస్తారే గానీ వృధా కానియ్యరు. అలాగే వీళ్లు ఇందుకోసం బొగ్గును కూడా వినియోగించారు. చాలావరకు 90% సోలార్‌ ఎనర్జీపైనే ఆధారపడతారు. అంతేగాదు ఈ బాటిల్స్‌ వల్ల ఉత్పత్తి అయ్యే దాదాపు పదివేల టన్నులు కార్బన్‌డయాక్సైడ్‌ ఉద్గారాలను కూడా ఈ ప్రక్రియతో నిరోధించారు. అంతేకాదండోయ్‌ మనం ఈ ప్లాస్టిక్‌ దుస్తులను వాడి వాడి బోర్‌ కొట్టినట్లయితే..తిరిగి వాటిని ఈ కంపెనీకి ఇచ్చేయొచ్చు. వాటిని మళ్లీ రీసైకిల్‌ చేస్తుంది కూడా. అంతేగాదు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో తయారు చేసిన జాకెట్లను ధరించారు కూడా.

ఇలా రూపొందించడానికి రీజన్‌..
పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతగా ఈ ప్రక్రియకు నాంది పలికానని అన్నారు సెంథిల్‌ శంకర్‌. ప్రపంచవ్యాప్తంగా మనం వాడి పారేసిన ప్లాస్టిక్‌ బాటిళ్ల సంఖ్య నిమిషానికి మిలియన్‌ ఉంటున్నట్లు ఫోర్బ్స్‌ చెప్తోందన్నారు. ఒక బాటిల్‌ డీకంపోజ్‌ కావాలంటే నాలుగు వందల ఏళ్లు పడుతుందని, పైగా ఆ అవశేషాలు పల్లపు ప్రదేశాలకు కొట్టుకుపోతుంటాయని చెప్పారు. 

దీంతో ఇవన్నీ వర్షం కారణంగా కాలువలకు అడ్డుపడి వరదలకు కారణమవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తన వంతు బాధ్యతగా చెన్నైకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో వేస్ట్‌గా పడి ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లన్నింటిని సేకరిస్తున్నామని చెప్పారు. అంతేగాదు తమ ఫ్యాక్టరీలో రోజుకు 15 లక్షల బాటిళ్ల దాక రీసైకిల్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇక చివరిగా అందరూ పర్యావరణ సంరక్షణార్థం  ఈ రీసైకిల్‌ ప్రక్రియలో పాలు పంచుకోండి అని పిలుపునిస్తున్నారు సెంథిల్‌ శంకర్‌.

(చదవండి: నీట్‌ ఎగ్జామ్‌లో సత్తా చాటిన తండ్రి, కూతురు!..50 ఏళ్ల వయసులో..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement