
ప్రస్తుతం బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఆడియన్స్‌లో ఈ షోకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ షో రన్ అవుతోంది. టాలీవుడ్‌లో బిగ్‌బాస్ షో ఇప్పుడిప్పుడే ఆదరణ దక్కించుకుంటోంది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో బిగ్‌బాస్ షో మరింత ఆసక్తికరంగా మారింది.
తెలుగులో మినహాయిస్తే.. ఇటీవల బిగ్‌బాస్ కన్నడలో జరిగిన వివాదం మనందరికీ తెలిసిందే. ఈ షో కోసం వేసిన సెట్ వల్ల వ్యర్థాలు వస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో సడన్‌గా మూసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత మళ్లీ రీ స్టార్ట్ చేశారు. శాండల్‌వుడ్‌లో ఈ రియాలిటీ షో హోస్ట్‌గా హీరో కిచ్చా సుదీప్ వ్యవహరిస్తున్నారు. ఈ వివాదం ముగిసిపోవడంతో కన్నడలో బిగ్‌బాస్ ఎలాంటి అటంకం లేకుండా కొనసాగుతోంది.
అయితే తాజాగా తమిళ బిగ్‌బాస్ షో చుట్టు వివాదం మొదలైంది. తమిళనాడులో 'బిగ్ బాస్' షోను నిషేధించాలని అధికార డీఎంకే ప్రభుత్వ మిత్రపక్షం తమిజ్హగ వజ్వురిమై కట్చి (టీవీకే) డిమాండ్ చేస్తోంది. ఈ షోలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు తమిళ సంస్కృతిని కించపరిచే విధంగా ఉన్నాయని టీవీకే లీడర్, ఎమ్మెల్యే వేల్మురుగన్ ఆరోపించారు. బిగ్ బాస్ షో తమిళ సంస్కృతి, సంప్రదాయంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. అసహ్యకరమైన శరీర కదలికలు, ముద్దు సన్నివేశాలు, బెడ్ రూమ్ దృశ్యాలు.. టీనేజ్ అమ్మాయిలు, పిల్లలు సమక్షంలో చూడకూడదని అన్నారు. ఇంకా నయం ఈ షోలో ఇప్పటివరకు లైంగిక పరమైన దృశ్యాలను చూపించలేదని వేల్మురుగన్ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ సంప్రదించానని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ నా తీర్మానాన్ని చర్చకు అనుమతించకపోతే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, ఐటీ, ప్రసార శాఖలు ఈ షోను నిషేధించకపోతే.. బిగ్ బాస్ సెట్‌తో పాటు విజయ్ టెలివిజన్ వద్ద వేల మంది మహిళలతో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని వేల్మురుగన్ హెచ్చరించారు. కాగా.. విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ తమిళ సీజన్ -9 అక్టోబర్ 5న గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సీజన్‌లో దాదాపు 20 మంది కంటెస్టెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టారు.