
లంబాడీ గిరిజనులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే పండుగే... ‘సీత్లా భవాని’ వేడుక. గిరి జన సంప్రదా యంలో లంబాడీలు చేసుకునే తొలి పండుగ కూడా ఇదే. ప్రకృతిని ఆరాధిస్తూ... పంటలను, పశు సంపదను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడు కుంటారు. ఈ పండుగ, బోనాల వేడుకలు ఒకేకాలంలో రావడం గమనార్హం. వర్షాకాలంలో రక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అటు హిందువులూ, ఇటు లంబాడీ గిరిజ నులూ తమ తమ గ్రామదేవతలకు బోనాలు ఎత్తి పూజించి మొక్కులు చెల్లించుకుంటూ ఆ వ్యాధుల బారిన పడకుండా కాపాడమని వేడుకుంటారు.
సీత్లా భవాని కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశు సంపద పెరగాలనీ; దూడలకు పాలు సరిపోనుఉండాలనీ, తమ పశువులకు గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా వాటిని కాపాడా లనీ, అటవీ సంపద తరగకూడదనీ సీత్ల తల్లికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ పండుగను వివిధతండాల్లో ఆ తండా ప్రజలు, పెద్ద మనుషులంతా కలిసి ఆషాఢ మాసంలో ఏదో ఒక మంగళవారంఎంచుకొని జరుపుతారు. ప్రతి సంవత్సరం కేవలం మంగళవారం మాత్రమే జరపడం ఆనవాయితీ.
ఇదీ చదవండి: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్
తండాల సరిహద్దుల్లోని పొలిమేర, కూడలి వద్ద సీత్ల భవాని సాధారణంగా ప్రతిష్ఠితమై ఉంటుంది. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు, మేకలతో; మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అక్కడికి వెళ్తారు. ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడుతారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. దేవతను పూజించే ప్రక్రియలో తండా పెద్ద మనిషి పూజారిగా వ్యవహరించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హం.
– నరేష్ జాటోత్, నల్గొండ