టీచరమ్మ స్కూలు సేద్యం.. ‘థ్యాంక్స్‌ టు కోవిడ్‌’ | School Campus was Turned Into an Organic Farm | Sakshi
Sakshi News home page

టీచరమ్మ స్కూలు సేద్యం.. ‘థ్యాంక్స్‌ టు కోవిడ్‌’

Jan 21 2022 4:05 AM | Updated on Jan 21 2022 4:37 PM

School Campus was Turned Into an Organic Farm - Sakshi

సుశీలా సంతోష్‌ , పచ్చదనంతో నిండిన తోటలా కనిపిస్తున్న స్కూలు

పిల్లలకు పాఠాలు చెప్తే వాళ్లు భవిష్యత్‌ ఫలాలు ఇస్తారు. కాని ఖాళీగా ఉన్న స్థలంలో పంటలు వేస్తే ఇప్పుడే వారు ఆరోగ్యంగా తిని ఎదుగుతారు. బెంగళూరులోని ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌కి ఆ ఆలోచనే వచ్చింది. వెంటనే ఆ బడి ఆవరణంతా సేంద్రియ సేద్యం మొదలెట్టింది. ఇంకేముంది... రోజుకు కిలోల కొద్ది పండ్లో, కాయలో, కూరలో దిగుబడికి వస్తున్నాయి. నేలకు పాఠం చెప్తే అది తెచ్చుకున్న ఆకుపచ్చటి మార్కులు ఇవి.

స్కూల్లో తోట పెంచితే రెండు రకాల సీతాకోక చిలుకలు కనిపిస్తాయి. ఒక రకం యూనిఫామ్‌ వేసుకున్నవి. ఒక రకం రంగు రంగుల రెక్కలల్లారుస్తూ మొక్కలపై వాలేవి. పిల్లలకు ఏ మంచి చూపినా ఇష్టమే. వారు ఆడమంటే ఆడతారు. పాడమంటే పాడతారు. మొక్కలు పెంచమంటే పెంచుతారు. క్లాసుల్లో వేసి సిలబస్‌లు రుబ్బడమే చదువుగా మారాక పిల్లలకు బెండకాయ చెట్టు, వంకాయ మొలకా కూడా తెలియకుండా పోతున్నాయి. ‘థ్యాంక్స్‌ టు కోవిడ్‌’ అంటారు సుశీలా సంతోష్‌.

ఆమె బెంగళూరులోని ఎలహంకలో ఉన్న విశ్వ విద్యాపీఠ్‌ స్కూల్‌కు డైరెక్టర్‌. ఆ స్కూల్‌కు మరో రెండు క్యాంపస్‌లు ఉన్నా ఎలహంక బాధ్యతలు చూస్తున్న సుశీలా సంతోష్‌ చేసిన పని ఇప్పుడు తీగలు, పాదులుగా మారి స్కూల్‌ను కళకళలాడిస్తూ ఉంది.

‘2021 మార్చి ఏప్రిల్‌ నుంచి లాక్‌డౌన్‌ మొదలయ్యింది. 1400 మంది పిల్లలు చదివే క్యాంపస్‌ మాది. మధ్యాహ్నం భోజనాలు మా స్కూల్‌లోనే చేస్తారు. కనుక స్టాఫ్‌ ఎక్కువ. కాని లాక్‌డౌన్‌ వల్ల బస్‌ డ్రైవర్లు, ఆయాలు, వంట మాస్టర్లు, అడెండర్లు అందరూ పనిలేని వారయ్యారు. వారంత చుట్టుపక్కల పల్లెల వారు. పని పోతుందేమోనని భయపడ్డారు. కాని వారిని మేము తీసేయ దలుచుకోలేదు. అలాగని ఖాళీగా పెడితే వారికి కూడా తోచదు. అలా వచ్చిన ఆలోచనే ఆర్గానిక్‌ ఫార్మింగ్‌. స్కూలు తోట. పదండి... ఏదైనా పండిద్దాం అన్నాను వారితో. అప్పుడు చూడాలి వారి ముఖం’ అంటుంది సుశీలా సంతోష్‌.

స్కూలులో ప్రెయర్‌ గ్రౌండ్‌ తప్ప మిగిలిన ఏ ప్రదేశమైనా పంట యోగ్యం చేయాలని వారు నిశ్చయించుకున్నారు. ‘ఇంతకు ముందు వీరిలో కొందరికి సేద్యం తెలుసు కనుక మా పని సులువయ్యింది’ అంటారు సుశీల. ఆమె సారధ్యంలో స్కూల్‌ పెరడు, బిల్డింగుల మధ్య ఉన్న ఖాళీ స్థలం, కాంపౌండ్‌ వాల్స్‌కు ఆనుకుని ఉండే నేల... ఇంకా ఎక్కడెక్కడ ఏ స్థలం ఉన్నా అదంతా కాయగూరలు, పండ్ల మొక్కలు, ఇవి కాకుండా 40 రకాల హెర్బల్‌ ప్లాంట్లు వేసి వాటి బాగోగులు చూడటం మొదలెట్టారు. ‘మాకు చాలా పెద్ద కిచెన్‌ ఉంది. దాని టెర్రస్‌ను కూడా తోటగా మార్చాం’ అన్నారు సుశీల.

స్కూలులోపల ఉన్న నీటి వ్యవస్థనే కాక వంట గదిలో వాడగా పారేసే నీటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ (ఆ నీరు అరటికి చాలా ఉపయోగం) 200 అరటి చెట్లు పెంచడం మొదలెట్టారు. ఇవి కాకుండా ఆకు కూరలు, కాయగూరలు, క్యారెట్, క్యాబేజీ వంటివి కూడా పండించ సాగారు. ‘మూడు నెలల్లోనే ఏదో ఒక కాయగూర కనిపించడం మొదలెట్టింది. స్టాఫ్‌ మధ్యాహ్న భోజనానికి వాడగా మిగిలినవి చుట్టుపక్కల వారికి పంచడం మొదలెట్టాం. మరి కొన్నాళ్లకు మేమే వాటితో వండిన భోజనాన్ని కోవిడ్‌ పేషెంట్స్‌కు సాధారణ రేట్లకు అమ్మాం. ఆరోగ్యకరమైన భోజనం తక్కువ ధరకు కాబట్టి సంతోషంగా తీసుకున్నారు. మా స్టాఫ్‌కు ఇదంతా మంచి యాక్టివిటీని ఇచ్చింది’ అంటారు సుశీల.

ఈ సంవత్సర కాలంలో స్కూలు ఆవరణలో సీజనల్‌ పండ్లు, కాయగూరలు స్కూల్‌ స్టాఫ్‌ తమ అనుభవం కొద్దీ పండిస్తూ స్కూలు ఆవరణను ఒక పంట పొలంలా మార్చారు. ‘ఇప్పుడు స్కూల్‌కు వచ్చిన పిల్లలు ఇదంతా చూసి సంబరపడుతున్నారు. వారిని మేము ఈ సేద్యంలో ఇన్‌వాల్వ్‌ చేయదలిచాం. స్కూల్‌ కొరికులం కూడా ఆ మేరకు మార్చాం. పిల్లలకు పంటల గురించి తెలియాలి. తమ తిండిని తాము పండించుకోవడమే కాదు నలుగురి కోసం పండించడం కూడా వారికి రావాలి. మార్కెట్‌లోని తట్టలో కాకుండా కళ్లెదురుగా ఉంటే మొక్కకి టొమాటోనో, తీగకి కాకరో వేళ్లాడుతూ కనిపిస్తే వాళ్లు పొందే ఆనందం వేరు’ అంటారు సుశీల.

మన దగ్గర కూడా చాలా స్కూళ్లల్లో ఎంతో ఖాళీ స్థలం ఉంటుంది. ‘స్కూలు సేద్యం’ కొంత మంది టీచర్లు ప్రోత్సహిస్తుంటారు. కాని ప్రతి స్కూల్లో సుశీల లాంటి మోటివేటర్లు ఉంటే సిబ్బంది పూనుకుంటే ప్రతి స్కూలు ఒక సేంద్రియ పంటపొలం అవుతుంది. మధ్యాహ్న భోజనం మరింత రుచికరం అవుతుంది.
ఇలాంటి స్కూళ్లను గ్రీన్‌ స్కూల్స్‌ అనొచ్చేమో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement