అక్కున చేర్చుకుందాం

Sakshi Special Story On Stray Animal Foundation of India

గ్రేట్‌ జర్నీ

మూడున్నర కోట్లకు పైగా వీథికుక్కలున్నాయి మనదేశంలో. పెంపుడు కుక్కలకు ఉన్నట్లు వాటి పొట్టను చూసి ఆకలి తీర్చే పెట్‌ పేరెంట్స్‌ ఎవరూ వీథి కుక్కలకు ఉండరు. వాటి ఆహారాన్ని అవి సొంతంగా సంపాదించుకుంటాయి. అది ప్రకృతి నియమం కూడా. అయితే... వాటికి ఎదురయ్యే ప్రధాన కష్టం ఆరోగ్యరక్షణ లేకపోవడమే.

‘‘ప్రతి పాణికీ జీవించే హక్కు ఉంది. వీథికుక్కలు అయినంత మాత్రాన వాటి జీవించే హక్కును కాలరాసే అధికారం మనిషికి ఉండదు. చేతనైతే వాటిని పరిరక్షించడానికి ముందుకు రండి’’ అంటున్నారు ఎన్‌ఆర్‌ఐ ఉజ్వల చింతల. ఇందుకోసం ఆమె ‘స్ట్రే యానిమల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ను స్థాపించి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాలోని వీథికుక్కల కోసం పని చేస్తున్నారు.

మాది మహేశ్వరం
ఉజ్వల చింతల 2019లో యూఎస్, ఫ్లోరిడాలో ‘స్ట్రే యానిమల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థను స్థాపించారు. అంతకు ముందు కొన్నేళ్లుగా ఆమె వీథి కుక్కల కోసం పని చేస్తూనే ఉన్నారు. ‘‘మాది హైదరాబాద్‌ సమీపంలోని మహేశ్వరం. నాన్న నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయంలోనే చదివాను. బాండింగ్‌ నా బలం, బలహీనత కూడా. ఇంటర్‌కి విజయవాడలోని మేరీస్టెల్లా కాలేజ్‌లో చేరిస్తే అమ్మానాన్నలకు దూరంగా ఉండలేక, మూడు నెలల్లో వెనక్కి వచ్చేశాను. డిగ్రీ హన్మకొండ, ఎంబీఏ బెంగళూరులో చేసిన తర్వాత పెళ్లితో యూఎస్‌ వెళ్లాల్సి వచ్చింది. యూఎస్‌లో కంప్యూటర్స్‌ కోర్సులు చేసి ఉద్యోగంలో చేరాను. పేరెంట్స్‌ మీద బెంగ తో తరచూ ఇండియాకి వస్తూనే ఉంటాను. అలా రావడమే ఈ సేవాపథంలో నడిపించింది.

పాలు తాగే పిల్లల్ని విసిరేశారు
2013లో ఇండియా వచ్చినప్పుడు ఒక ఇంటి వాళ్లు చిన్న కుక్కపిల్లల్ని పాలుతాగే పిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బయటపడేయడం నా కంట పడింది. అప్పుడు తల్లి కుక్క పడిన ఆరాటం, ఆవేదన వర్ణించడానికి మాటలు చాలవు.  మరోసారి పెళ్లిలో భోజనాల దగ్గర... పదార్థాలన్నీ పారవేస్తున్నారు. ఆ ప్లేట్ల కుప్ప మీదకు కుక్కలు ఎగబడుతున్నాయి. ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని విచక్షణరహితంగా కొడుతున్నాడు. అలాంటిదే మరోటి... ఓ కుక్కకు వెనుక కాళ్లు రెండూ విరిగిపోయాయి. దేహాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోతోంది. దానికి ట్రీట్‌మెంట్‌ చేయించడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. పర్మిషన్‌ తీసుకుని నాతోపాటు మూడు కుక్కలను యూఎస్‌ తీసుకెళ్లాను. అక్కడ చికిత్స చేయించి కోలుకున్న  తర్వాత పెంచుకునే వాళ్లకు దత్తత ఇచ్చాను. అప్పటి నుంచి స్ట్రే యానిమల్స్‌ కోసం పని చేస్తున్నాను.

అమెరికాలో లడ్డూ హౌస్‌
హైదరాబాద్, అమీన్‌పూర్‌లో షెడ్‌ వేసి, ముగ్గురు ఉద్యోగులతో ఓ సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఇప్పడు తొంభై ఉన్నాయి. నెలనెలా వాటి పోషణ, ట్రీట్‌మెంట్‌ కోసం డబ్బు పంపిస్తున్నాను. నా జీతం నుంచి కొంత భాగం, నా లడ్డూ హౌస్‌ రాబడితో వాటిని సంరక్షిస్తున్నాను. లడ్డూ హౌస్‌ బ్రాండ్‌ మీద నేను ఆర్గానిక్‌ ప్రోడక్ట్స్‌తో తినుబండారాలు తయారు చేసి, ఆదివారం ‘స్ట్రే యానిమల్స్‌ కోసం’ అని బోర్డు పెట్టి సేల్‌ చేస్తున్నాను. యూఎస్‌లో చారిటీ కోసం సేల్స్‌ చేసినప్పుడు... ఒక వస్తువు ధరను ఆ పదార్థానికి ఆపాదించి చూడరు, చారిటీ కోసం ధారాళంగా ఖర్చు చేస్తారు. మేము ప్రధానంగా గాయపడిన కుక్కలకు వైద్యం చేయించడం, కోలుకున్న తర్వాత పెంపకానికి ఇచ్చేయడం లేదా స్వేచ్ఛగా వదిలేయడం మీద దృష్టి పెట్టాం. ముసలితనం వల్ల ఎటూ పోలేని కుక్కలకైతే జీవితకాలపు సంరక్షణ బాధ్యత మాదే. ఇక కుక్కలకు స్టెరిలైజేషన్‌ వంటి కొన్ని సహకారాలను బ్లూ క్రాస్‌ నుంచి తీసుకుంటాం’’ అని చెప్పారు ఉజ్వల.

భారతీయ సమాజాన్ని ఆమె కోరుకునేది ఒక్కటే... మనం మనుషులం, మానవీయంగా మసలుకుందాం. కుక్క అనగానే తక్కువగా చూడవద్దు. వాటి జీవితం మన అధికారం ప్రదర్శించవద్దు. మనవి ‘ప్రాణాలను హరించే చేతులు కావద్దు, రక్షించే చేతులు కావాలి’ అన్నారు.

– వాకా మంజులారెడ్డి
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top