గోరంత దీపం జగమంత వెలుగు | Sakshi Special Story About Diwali 2025 | Sakshi
Sakshi News home page

గోరంత దీపం జగమంత వెలుగు

Oct 20 2025 12:13 AM | Updated on Oct 20 2025 7:21 AM

Sakshi Special Story About Diwali 2025

శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అణగ దొక్కి సుతల రాజ్యాధిపతిని చేసినందుకుగాను ఈ అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారనీ, శ్రీరామచంద్రుడు రావణాసురుడిని వధించి శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయాదులతో అయోధ్యకేతెంచి, పట్టాభిషిక్తుడైనదీవేళే కనుక ఈ రోజును దీపావళిగా జరుపుకుంటారని, శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై నరకుని వధించిన సందర్భంగా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారని, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలకు సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి.

 ఇంకా, పంచపాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని విజయవంతులై తిరిగి వచ్చినందుకు ఆనందంతో ప్రజలు దీపావళి జరుపుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఆదిపరాశక్తి శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించినందుకు ఆనందంతో వెలిగించిన జ్యోతులే దీపావళి అని కూడా ప్రచారంలో ఉంది. ఇవేకాక, క్షీరసాగర సమద్భూత అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడిని వరించినందుకు దేవతలు, మానవులు, అందరూ ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకుంటున్నారు అని కూడా చెప్తారు. 

భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి. మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. ఈ పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. 

కాలంలో వచ్చే మార్పులతోపాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి నెలలోనూ పండుగలను నిర్దేశించారు. అలా మన సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు, మానవతా విలువలకు ప్రతీకగా మారింది దీపావళి పండుగ. నేటి కాలంలో ప్రపంచ దేశాలలో ఎందరో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అమెరికాలో వైట్‌హౌస్‌లో కూడా దీపావళి నాడు దీపాలు వెలిగిస్తున్నారు. 

ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ హస్త భోజనం అని, తరువాత నాగుల చవితి, నాగ పంచమి అని – ఇన్ని రోజులు పండుగ చేసుకుంటాము.

దీపావళి పండుగనాడు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానమాచరించి, పితృ తర్పణాలివ్వటం, దానం చెయ్యటం, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటం, ఆకాశదీపం పెట్టటం చేస్తాం. ఆకాశదీపం పెట్టడం వల్ల దూర్రపాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు  మార్గ దర్శనం చేస్తుంది.

మనం ప్రతిరోజు ఉభయ సంధ్యలలోను మన ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీపాన్ని, దీపజ్యోతిని ఆరాధిస్తాం. ఏ శుభకార్యాలు చేసినా, ఏ వేడుకలు జరిగేటప్పుడు అయినా ముందుగా దీప ప్రజ్జ్వలన చేసి, అప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. వివాహాలు కూడా అగ్నిసాక్షిగా చేసుకుంటాం, అంటే దీపం, దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉంటారన్నమాట. వారు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక దీపం వెలిగించటం అన్నది అత్యంత ప్రధానమైనదని అందరికీ తెలియజేయటానికి, అందరూ దీపాలు వెలిగించేలా చేయడానికి దీపావళి పండగను మన మహర్షులు ఏర్పాటు చేశారు. 

దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం 
ఆశ్వయుజ బహుళ అమావాస్యకు ముందు మూడు రోజుల నుంచి ఇంటి ముందు దీపాలు పెట్టటం ప్రారంభిస్తాం. అలా వెలిగించడం ప్రారంభించిన ఈ దీపాలను కార్తీక మాసమంతా వెలిగిస్తాం

దీపాల కథ
పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాçహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు, భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. 

స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, ‘కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా’ అని ఆలోచించి, ‘నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి‘ అని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. 

ఇంక తనకు చావే లేదనే భ్రమతో నరకుడు లోకకంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, బ్రాహ్మణులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీ కృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. 

నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకాసురుడి పీడ వదలగానే ప్రజలందరూ మంగళ వాద్యాలు మోగించి సత్యభామా శ్రీ కృష్ణులకు స్వాగతం చె΄్పారు. ఆ మంగళ ధ్వనులే నేటికీ బాణసంచా రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి.

కొన్ని ప్రాంతాలలో బాణసంచా కాల్చి ఇంట్లోకి వచ్చాక, ఆడవాళ్ళందరూ కలిసి చేటలు, పళ్ళాలు వాయిస్తారు. అది దరిద్ర దేవతను తరిమి వేయటమన్నమాట. దీనిని ‘అలక్ష్మీ నిస్సరణము’ అంటారు.  

ఎలా జరుపు కోవాలంటే..?
దీపావళి నాడు పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి, తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట. వారికి దారి కనిపించటం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇంట్లోని పెద్దవారు పిల్లలతో ఈ దివిటీను కొట్టిస్తారు. 

పొడుగాటి గోగు కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి, వాటిని పిల్లల చేతులకిచ్చి, వారిని వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి, ఆకాశంలో దక్షిణం వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి, నేలకు వేసి కొట్టిస్తూ, ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి‘ అని అనిపిస్తారు. 

ఆ తరువాత ఆ కాడలను ఒకపక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లూ చేతులు కడిగి, కళ్ళు తడిచేతితో తుడిచి, నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని, తరువాత ఆ పిల్లలచేత మిఠాయిలు తినిపిస్తారు. తరువాత ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చడం ప్రారంభిస్తారు. బాణసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక, అర్ధరాత్రి దాటాక, ఇళ్ళు వాకిళ్ళను తుడిపించుకోవాలని ధర్మశాస్త్రం చెప్తోంది.

ఈసారి రికార్డ్‌ బ్రేక్‌ కావాల్సిందే!
గత సంవత్సరం అక్టోబర్‌లో అయోధ్యలో  25.12 లక్షల దీపాలను వెలిగించి ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను సెట్‌ చేసింది. తాజాగా...28 లక్షల దీపాలను వెలిగించి తన రికార్డ్‌ను తానే బ్రేక్‌ చేయాలనుకుంటోంది.

వారణాసిలో దేవతల దీపావళి
దీపావళి తరువాత పదిహేను రోజులకు వారణాసిలో దేవ దీపావళిని జరుపుకుంటారు. కార్తిక పూర్ణిమ రాత్రి గంగానది వెంబడి ఉన్న ఘాట్లు లక్షలాది దీపాలతో వెలుగుతాయి. ఆ వెలుగుల ప్రతిబింబాలు నదిలో అందమైన చిత్రాలను ఆవిష్కరిస్తాయి. గంగానదిలో స్నానం చేయడానికి దేవతలు భూమి మీదికి దిగి వచ్చిన రోజుగా ఈ రోజును జరుపుకుంటారు.

దీపావళి పూట...శివాజీ కోట!
దీపావళి సీజన్‌లో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శివాజీ పాలించిన కోటకు ప్రతిరూపంగా మట్టికోటలను తయారుచేయడం అనేది ఆచారం. ఈ కోటను నిర్మించే క్రమంలో బురదలో విత్తనాలు నాటుతారు. కోట చుట్టూ పచ్చదనం ఉండేలా చేస్తారు. రాత్రివేళల్లో ఈ మట్టి కోటపై చిన్న చిన్న దీపాలను వెలిగిస్తారు.

దేవతలకు స్వాగతం
జార్ఖండ్‌లో దీపావళి పండగ సందర్భంగా సోహ్రై వేడుకను జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా దేవతలను స్వాగతించడానికి ఘరోండాలు (మట్టి బొమ్మల ఇళ్ళు) తయారుచేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి అగరువత్తులు కాల్చుతారు. సోహ్రై వేడుకలలో పశువులకు స్నానం చేయించి పూజ లు చేస్తారు.

పేడ పూసుకుని వేడుక చేసుకుంటారు!
కర్నాటక, తమిళనాడు సరిహద్దులలోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకొని ‘గోరెహబ్బ’ వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా మగవాళ్లు ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఆడవాళ్లు ఒంటికి రాసుకుంటారు. ఆవుపేడలో ఔషధగుణాలు ఉన్నాయనే నమ్మకంతో ఏర్పడిన శతాబ్దాల నాటి సంప్రదాయం ఇది.

– డా. సోమంచి (తంగిరాల) విశాలాక్షి. విశ్రాంత సంస్కృతాచార్య 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement