Chilli Crop Cultivation Guide: మిర్చి పంటకు ‘తామర పురుగు’ముప్పు అందుకే! ఈ జాగ్రత్తలు తీసుకుంటే..

Sakshi Sagubadi Special Ways To Prevent Tamara Purugu Disease In chilli Cultivation

మిరప పూలను ఆశిస్తున్న తామర పురుగులను మొట్టమొదటిగా గత ఏడాదే గుర్తింపు 

ఈ ఏడాది రెండు నెలలు ముందుగానే విజృంభించి పంటకు తీవ్ర నష్టం 

పురుగుమందులకూ లొంగటం లేదంటున్న నిపుణులు

Pesticides For Thamara Purugu Damage In Chilli Cultivation: మిరప పంట రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4.5 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. రసాయనిక వ్యవసాయంలో ఏకపంటగా సాగవుతున్న ఈ పంటకు సాధారణంగా చీడపీడల బెడద ఎక్కువే. పురుగుమందులను విస్తృతంగా పిచికారీ చేస్తున్నప్పటికీ భూతాపోన్నతి కారణంగా కొత్తరకం చీడపీడలూ కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ‘మిరప పంటలో పూలను ఆశించే తామర పురుగులు’ మొట్ట మొదటి సారిగా గత ఏడాది జనవరి – ఫిబ్రవరిలో గుంటూరు జిల్లాలో కనిపించాయి. ఈ ఏడాది రెండు, మూడు నెలలు ముందే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల్లో విజృంభించాయి.

వేలాది ఎకరాల్లో మిర్చి పంట పైముడతతో నాశనం అవుతున్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతుల ఆశలు నిలువునా నేల రాలిపోతున్నాయి. కొందరు మిర్చి తోటలు పీకేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల మిర్చి తోటల్లో, దేశవాళీ మిరప రకాలు సాగు చేస్తున్న పొలాల్లో పరిస్థితి ఉన్నంతలో మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. 

ఇవి కొత్త రకం తామర పురుగులు!
►గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొట్ట మొదటిసారిగా గుంటూరు జిల్లాలో మిరప పంట పండించే రైతులు పూతను ఆశించే తామర పురుగులను గమనించారు. ఈ సంవత్సరం ముందుగా మిరప పంట వేసిన పొలాల్లో ఈ పురుగులను గమనించాం. పూతను ఎక్కువ సంఖ్యలో ఈ పురుగులు ఆశించి పూత రాలిపోయి, కాయగా మారకపోవడం వలన తీవ్రంగా నష్టపోతామని రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు.
►సాధారణంగా మిరప పంటలో తామర పురుగులు అన్ని దశల్లోనూ ఆశిస్తుంటాయి. తద్వారా ఆకులు అంచుల వెంబడి పైకి ముడుచుకోవడం వలన ‘పై ముడత’ అని అంటారు. ఈ పురుగును నివారించుకోవడానికి రైతు స్పైనోసాడ్‌ (ట్రేసర్‌), ఫిప్రోనిల్‌ (రీజెంట్‌), డయాఫెన్‌ థయురాన్‌ (పెగాసస్‌), ఇంటర్‌ ప్రిడ్, ఎసిటామిప్రిడ్, క్లోరోఫెన్‌ పిల్‌ లాంటి మందులను వారం రోజుల వ్యవధిలో ఒకసారి లేదా రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా నివారించడం జరుగుతుంది.  కానీ, ఈ కొత్త రకం తామర పురుగులు వాటికి భిన్నంగా ముదురు నలుపు రంగులో వుండి.. ఎలాంటి పురుగు మందులకు లొంగకుండా.. విపరీతంగా పూతను ఆశించి నష్టపరుస్తుండటం వలన రైతులు ఒత్తిడికి లోనవుతున్నారు.

చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..

రైతులు తక్షణం తీసుకోవలసిన జాగ్రత్తలు:
►రైతులు ఆందోళనతో విపరీతంగా మందులు కొట్టడం వలన ఈ తామర పురుగులో గుడ్లుపెట్టే సామర్థ్యం ఎక్కువైనట్లు గమనించాం. కాబట్టి, సింథటిక్‌ పైరిత్రాయిడ్‌ మందులను, స్పైనోసాడ్, ప్రొఫెనోఫాస్, ఇమిడాక్లోప్రిడ్‌ లాంటి మందులు ఎక్కువ సార్లు పిచికారీ చేయకుండా వుండాలి.
►రైతులు సామూహికంగా ఎక్కువ సంఖ్యలో జిగురు పూసిన నీలిరంగు, పసుపురంగు అట్టలను పొలంలో పెట్టుకోవడం ద్వారా వీటి తల్లిపురుగులను నివారించుకునే అవకాశముంది.
►ఇవి మనం వాడే అన్ని రకాల పురుగుమందులను తట్టుకునే సామర్థ్యం కలిగి వున్నందున.. పురుగు మందుల ద్వారా వీటిని నివారించడం కష్టం.
►ప్రస్తుతం మనకు అందుబాటులో వున్న పురుగు మందుల ద్వారా పిల్ల పురుగులను సులువుగా నివారించవచ్చు. కానీ, తల్లి పురుగులను నివారించడం చాలా కష్టం.
►తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించడం కోసం వేప సంబంధిత పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను వేప నూనె 10,000 పి.పి.యం సేకరించాలి. లీటరు నీటికి 3 మి.లీ. మరియు 0.5 గ్రా. సర్ఫ్‌ గాని ట్రైటాన్‌ – 100 గాని కలిపి పిచికారీ చేసుకోవాలి.
►బవేరియా బస్సియానా, లికానిసిలియం లికాని అనే జీవ శీలింద్ర నాశినిలను వాడుకోవచ్చు (5 గ్రా./ లీటరు నీటికి కలిపి దీనితో పాటు ట్రైటాన్‌ 100 0.5 గ్రా.ను కూడా కలపాలి).
►అందుబాటులో వున్న పురుగు మందులు: ఎసిటామిప్రిడ్‌ (ప్రైడ్‌) 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి  లేదా సైయాంట్రనిలిప్రోల్‌ (బెనీవియా) 240 మి.లి./ఎకరానికి లేదా ఫిప్రోనిల్‌ 80 ఔ+40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా పోలిస్‌ (40% ఇమిడాక్లోప్రిడ్‌ + ఫిప్రోనిల్‌ 40% ఔ+  40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి) మార్చి మార్చి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.
►మిరప రైతులు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి అవసరం మేరకే వాడుకోవలసిన అవసరం చాలా వుంది. లేదంటే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనటంలో సందేహం లేదు.
►పొలంలో అక్కడక్కడా ప్రొద్దుతిరుగుడు మొక్కలను అకర్షక పంటగా వేసుకోవాలి.
►విత్తనం, మొక్కలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా వుంది.
ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి పరిశోధనలు పురోగతిలో వున్నాయి. 

– డా. ఆర్‌.వి.ఎస్‌.కె. రెడ్డి,
పరిశోధనా సంచాలకులు, 
డా.వై.యస్‌.ఆర్‌. ఉద్యాన విశ్వవిద్యాలయం,
వెంకటరామన్నగూడెం, ప.గో. జిల్లా
dir-research@drysrhu.edu.in

చదవండి: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top