మొబైల్‌ మాస్టారు | Sakshi Funday Special Story: Using Mobile Devices as Digital Education | Sakshi
Sakshi News home page

మొబైల్‌ మాస్టారు

May 24 2026 12:17 AM | Updated on May 24 2026 12:17 AM

Sakshi Funday Special Story: Using Mobile Devices as Digital Education

గోడల మధ్య బంధించిన చదువు, ఇప్పుడు స్క్రీన్ ల వెలుగుల్లో విహరిస్తోంది. చాక్‌పీస్‌ రాతలతో నిండిన బ్లాక్‌బోర్డ్‌ స్థానంలో, వేలి స్పర్శకే తెరుచుకునే డిజిటల్‌ నోట్స్‌ నిలుస్తోంది. స్కూల్‌ బస్‌ హారన్ లతో మొదలయ్యే విద్యార్థుల ఉదయాలు, నేడు మొబైల్‌ నోటిఫికేషన్స్‌తో స్టార్ట్‌ అవుతున్నాయి. ‘హోంవర్క్‌ చేశావా?’ అని గట్టిగా అడిగే టీచర్‌ స్వరం, ‘నెట్‌ వస్తుందా? లేదా?’ అనే ఆందోళనతో పెద్దదైపోతోంది. ఇప్పుడు చదువుకోవాలంటే, ఫీజులతో కొనాల్సిన అవసరం లేదు. 

ఒక చేతిలో మొబైల్, మరో చేతిలో చార్జర్, మనసులో తపన ఉంటే సరిపోతుంది. అప్పుడు, ఐఐటీ సార్‌ కూడా మీ చిన్న స్క్రీన్ పై ‘గుడ్‌మార్నింగ్‌ స్టూడెంట్స్‌’ అంటూ చిరునవ్వు చిందిస్తారు. ఈ స్క్రీన్‌ స్కూల్‌లో పుస్తకాల బరువు తగ్గిపోయింది. కానీ కలల ఎత్తు పెరిగిపోయింది. చిన్న డేటా ప్యాక్‌ దూరంలోనే నిలుస్తున్న ఈ డిగ్రీలు నిజంగా లాభామా? నష్టమా?

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ విద్య ఇప్పుడు రాకెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతోంది. నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం, 2024 నాటికి దేశంలో 88.6 కోట్ల మంది ఇంటర్నెట్‌ వాడుతున్నారు. పట్టణాల్లో అయితే పరిస్థితి హై లెవెల్‌! ప్రతి 100 మందికి 116 కనెక్షన్లు ఉన్నాయి. అంటే ఒక మనిషికి రెండు సిమ్‌లు, మూడు ఓటీపీలు, నాలుగు వైఫై పాస్‌వర్డులు కామన్  అయిపోయాయి! కానీ గ్రామాల్లో అది 47.6 శాతం మాత్రమే. అయినా మొత్తం యూజర్లలో 57 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారే ఉంటున్నారు. 

మరో ట్విస్ట్‌ ఏమిటంటే, 86 శాతం ఇళ్లలో ఇంటర్నెట్‌ ఉంది, కానీ కంప్యూటర్లు మాత్రం 10 శాతం కూడా లేవు! అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్‌కి ల్యాప్‌టాప్స్‌ కాదు, చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్సే అసలైన కాలేజ్, క్లాస్‌రూమ్, లైబ్రరీ, ఎగ్జామ్‌ హాల్‌ అన్నీ మొబైలే అయిపోయింది! అందుకే, ఆడుతూ, పాడుతూ విద్యార్థులు చదువు సాగించేలా డిజిటల్‌ స్కూల్‌ కూడా గేమ్‌ బేస్డ్‌ లర్నింగ్‌ టెక్నిక్స్‌ ఫాలో అవుతున్నాయి.

డిజిటల్‌ గురువులు
టీచర్‌ చెప్పింది అర్థం కాకపోతే, అడిగే ధైర్యం లేనివారందరూ, డౌట్‌ను కూడా నోట్‌బుక్‌లో మడిచేసుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. మరికొంతమంది తోటి విద్యార్థి సాయంతో తీర్చుకునేవారు. ఇప్పుడు, పరిస్థితి పూర్తిగా రివర్స్‌! అర్థం కాలేదా? వీడియోని పాజ్‌ చేసి, రివైండ్‌ చేసి ఇంకోసారి చూడొచ్చు? ఇంకా క్లియర్‌గా కావాలంటే, 0.5 స్పీడ్‌లో స్లో మోషన్ లో కూడా చూడొచ్చు. చదువు యూట్యూబ్‌ వీడియోలాగే చాలా ఈజీగా మారిపోయింది. ఇలా యాప్‌లో కనిపించే ప్రతి వీడియో, ప్రతి యానిమేషన్ , ప్రతి నోటిఫికేషన్  కూడా ఒక చిన్న డిజిటల్‌ గురువుగా మారిపోయింది.

గేమ్‌లో గెలుపు, చదువు కోసమే!
ఒకప్పుడు ‘మొబైల్‌ గేమ్స్‌ ఆడొద్దు, చదువు పాడవుతుంది!’ అని పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు, అదే గేమ్స్‌ పిల్లలకు మ్యాథ్స్, కోడింగ్, సైన్స్  కూడా నేర్పిస్తున్నాయి! అంటూ మొబైల్స్‌ చేతికి ఇస్తున్నారు. అవును చదువు ఇప్పుడు బోరింగ్‌ బ్లాక్‌బోర్డ్‌ నుంచి బయటికి వచ్చి, ‘నెక్ట్స్‌ లెవెల్‌ అన్ లాక్‌’ చేసే గేమ్‌లా మారిపోయింది. 

ఒక ప్రశ్నకు సరైన సమాధానం చెబితే పాయింట్లు, మరో లెసన్  పూర్తి చేస్తే బ్యాడ్జీలు, రోజూ లాగిన్  అయితే స్టికర్స్‌ ఇలా చదువు కూడా ఇప్పుడు వీడియో గేమ్‌ ఫీల్‌ ఇస్తోంది. అందుకే పిల్లలు ‘ఇంకో ఐదు నిమిషాలు’ అంటూ గేమ్‌ ఆడినట్టే, ఇప్పుడు ‘ఇంకో క్విజ్‌’ అంటూ చదువులో కూడా మునిగిపోతున్నారు! ముఖ్యంగా మ్యాథ్స్‌ లాంటి సబ్జెక్టులు ఇప్పుడు భయం కాదు, మొబైల్‌లో ఫన్  చాలెంజెస్‌లా మారిపోయాయి. ఒకప్పుడు మార్కుల కోసం చదివిన పిల్లలు, ఇప్పుడు లీడర్‌బోర్డ్‌లో టాప్‌ రావడానికి చదువుతున్నారు!

ఫ్రీగా ఇంత చదువా?
ఒక్క మొబైల్‌లో డేటా ఆన్  చేస్తే చాలు– ఇంజినీరింగ్‌ నుంచి మెడిసి న్  వరకు, కోడింగ్‌ నుంచి విదేశీ భాషల వరకు, మాక్‌ టెస్టుల నుంచి మాస్టర్‌ క్లాస్‌ల వరకు అన్నీ స్క్రీన్ పై క్యూలో నిల్చుంటున్నాయి. అంతేకాదు, ఐఐటీ ప్రొఫెసర్‌ కూడా ‘సబ్‌స్క్రైబ్‌’ బటన్  దూరంలోనే ఉంటున్నారు. ‘ఇంత ఖరీదైన నాలెడ్జ్‌ని నిజంగానే ఫ్రీగా ఇస్తారా?!’ అని స్టూడెంట్స్‌ షాక్‌ అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన చాలా విద్యాసంస్థలు, ఇదే విధానాన్ని ఫాలో అయ్యి, క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఇక్కడే మోసాలు కూడా మొదలయ్యాయి.

క్లిక్‌ చేస్తే క్లాస్‌.. తర్వాత షాక్‌ !
ప్రతి ‘బై నౌ’ బటన్  వెనుక నిజంగా నాలెడ్జ్‌ ఉంటుందా? అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. కొన్నిసార్లు ‘లైవ్‌ క్లాసులు’ అని చెప్పి పాత వీడియోలు చూపిస్తారు. ‘ఫ్రీ ట్రయల్‌’ అంటూ మొదలై, తర్వాత సైలెంట్‌గా బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ అవుతుంటాయి. ఇలా చదువు పేరుతో స్క్రీన్  వెనుక ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు సిలబస్‌ చదవడం కంటే, ముందు స్క్రీన్ మీద కనిపించే ప్రతి ‘క్లిక్‌’ను  జాగ్రత్తగా చదవాల్సిన పరిస్థితి.

ప్రభుత్వ డిజిటల్‌ దిగ్గజాల దూకుడు!
  ప్రైవేట్‌ సంస్థలకంటే, ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌ విద్యా ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు మరింత ఉపయోగకరంగా దూసుకు పోతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా..

దీక్ష: ఇప్పటికే 2 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. 36 భారతీయ భాషల్లో కంటెంట్‌ అందుబాటులో ఉండటం దీని అతిపెద్ద బలం.
స్వయం: 4,400కిపైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 5.8 కోట్లకు పైగా ఎన్రోల్‌మెంట్లు నమోదయ్యాయి. అలాగే, 52 లక్షల మందికి పైగా ఈ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా సర్టిఫికేషన్  కోర్సులు పూర్తి చేశారు.

ఎన్ పీటీఈఎల్‌: ఐఐటీలు, ఐఐఎంల కోర్సులు ఇప్పుడు మొబైల్‌ స్క్రీన్ పైనే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఇందులో 3.79 కోట్లకు పైగా కోర్స్‌ ఎన్రోల్‌మెంట్లు నమోదయ్యాయి. చాలామంది దీన్ని ‘ఎడ్యుకేషన్  నెట్‌ఫ్లిక్స్‌’గా కూడా చూస్తున్నారు.
స్వయం ప్రభ: ఇంటర్నెట్‌ లేకున్నా చదువు ఆగకూడదనే ఉద్దేశంతో, 48 ప్రత్యేక టీవీ చానెల్స్‌ ద్వారా విద్యా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఇక్కడ టీవీ కూడా టీచర్‌ అయ్యింది.

డిజిటల్‌ స్కూల్‌ vs రియాల్టీ స్కూల్‌.. 
డిజిటల్‌ స్కూల్, రియాల్టీ స్కూల్‌ అనే ఈ రెండు ప్రపంచాల్లో స్టూడెంట్స్‌కి అసలు ఏది బెస్ట్‌? ఏది ఈజీ? ఏది నిజంగా ప్రభావం చూపుతోంది? 
అసలు ఈ రెండింటి మధ్య తేడాలను ఇక్కడ చూద్దాం.. 

స్క్రీన్  క్లాస్‌రూమ్‌
వీడియోలను పాజ్, రివైండ్, స్లో మోషన్ లో కూడా చూడొచ్చు.
ఇంట్లో నుంచే ఐఐటీ, టాప్‌ ఫ్యాకల్టీ క్లాసులు అటెండ్‌ కావచ్చు.
టైమ్‌ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.

ప్రెజెంటేషన్స్ , క్విజ్‌లు, డిజిటల్‌ నోట్స్‌ ఈజీగా అందుబాటులో ఉంటాయి.
సిగ్గు పడే స్టూడెంట్స్‌ కూడా చాట్‌బాక్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటారు.
స్మార్ట్‌ఫోన్  ఇప్పుడు చిన్న యూనివర్సిటీలా మారిపోయింది.

ఈజీ డిస్ట్రాక్షన్స్  ఎక్కువ, ఆన్‌లైన్‌ మోసాలకు బలయ్యే అవకాశాలు ఎక్కువ.
క్లాస్‌తో పాటు రీల్స్, నోటిఫికేషన్స్  కూడా పోటీ పడుతుంటాయి.
‘మైక్‌ ఆఫ్‌.. కెమెరా ఆఫ్‌.. అటెన్షన్  కూడా ఆఫ్‌!’ అనే సీన్  కామన్ .

నిజమైన క్లాస్‌రూమ్‌
టీచర్‌తో డైరెక్ట్‌ ఇంటరాక్షన్  ఉంటుంది.
డౌట్స్‌ వెంటనే క్లియర్‌ చేసుకోవచ్చు.
కాన్సెప్ట్‌లు మరింత బాగా అర్థమవుతాయి.

స్పీకింగ్, కమ్యూనికేషన్  స్కిల్స్‌ మెరుగుపడతాయి.
ఫిజికల్‌ యాక్టివిటీ, ఫ్రెండ్స్‌తో డిస్కషన్స్ , గ్రూప్‌ లెర్నింగ్‌ ఎక్కువ.
టీచర్లు స్టూడెంట్స్‌ అటెన్షన్ ను సులభంగా గమనించగలరు.

చదువుతో పాటు క్లాస్‌రూమ్‌ మెమరీస్‌ కూడా క్రియేట్‌ అవుతాయి.
బెంచ్‌ ఫ్రెండ్స్, చిన్న నవ్వులు, హోంవర్క్‌ టెన్షన్స్  ప్రత్యేకమైన ఫీలింగ్‌ ఇస్తాయి.
టైమ్, ట్రావెల్, ఫీజుల ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు.

ఎగ్జామ్‌కి డెమో వెర్షన్ !
పోటీ పరీక్షలు అంటే ఒకప్పుడు టెన్షన్ , భయం, రాత్రంతా నిద్రలేని ప్రిపరేషన్ . కానీ ఇప్పుడు సీన్  పూర్తిగా మారిపోయింది! అసలు పరీక్షకు వెళ్లే ముందే, స్టూడెంట్స్‌కి ‘ట్రైలర్‌ షో’ చూసే చాన్స్  వచ్చేసింది. ఫ్రీ మాక్‌ టెస్టులు, ప్రాక్టీస్‌ పేపర్లు, టైమ్‌బేస్డ్‌ ఎగ్జామ్‌లు అన్నీ ఇప్పుడు ఒక క్లిక్‌ దూరంలోనే ఉన్నాయి. అంటే అసలు పరీక్ష హాల్లో కూర్చోకముందే, ‘ఎగ్జామ్‌ ఎలా ఉంటుంది?’ అన్న ఫీలింగ్‌ను ముందుగానే అనుభవించొచ్చు. దీంతో ఇప్పుడు స్టూడెంట్స్‌కి టెన్షన్  కంటే, ‘ర్యాంక్‌ స్క్రీన్ షాట్‌ను స్టేటస్‌లో ఎప్పుడు పెట్టాలి?’ అన్న ఆసక్తే ఎక్కువైపోతోంది!

బిలియన్ డాలర్ల బిజినెస్‌!
గ్లోబల్ డిజిటల్‌ లెర్నింగ్‌ మార్కెట్‌
ఈ–లెర్నింగ్‌ సర్వీసుల మార్కెట్‌ విలువ 2024లో సుమారు 300 బిలియన్  డాలర్లకు చేరింది.
ఇది 2030 నాటికి 840 బిలియన్  డాలర్లకు పైగా పెరిగే అవకాశముందని విశ్లేషకుల అంచనా.

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ లెర్నింగ్‌ మార్కెట్‌ ఇప్పుడు భారీ బిజినెస్‌గా మారిపోయింది. మార్కెట్‌ రిపోర్టుల ప్రకారం, మొత్తం ఈ–లెర్నింగ్‌ సర్వీసుల మార్కెట్‌ విలువ 2024లో సుమారు 300 బిలియన్  డాలర్లకు చేరింది. ఇది 2030 నాటికి 840 బిలియన్  డాలర్లకు పైగా పెరిగే అవకాశముందని విశ్లేషకుల అంచనా. అంటే, ఒక్కో యూజర్‌ నుంచి సగటున 69 డాలర్లకు పైగా ఆదాయం వస్తోంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 86 శాతం మంది విద్యార్థులు ఇప్పుడు చదువులో ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారని ఈ సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో స్మార్ట్‌ఫోన్  వినియోగం పెరగడం, చౌకైన డేటా అందుబాటులోకి రావడం, ప్రభుత్వ డిజిటల్‌ లిటరసీ కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఆన్ లైన్  ఎడ్యుకేషన్  కంపెనీలు భారీగా క్యాష్‌ చేసుకుంటున్నాయి.

చదువు కూడా కన్జ్యూమర్‌ ప్రొడక్టే! 
చదువు ‘కొనడం’ కూడా ఇప్పుడు ఒక అధికారిక కొనుగోలు! అంటే మీరు డిజిటల్‌ లెర్నింగ్‌ యాప్, ఎగ్జామ్‌ సబ్‌స్క్రిప్షన్ , కోడింగ్‌ కోర్స్‌ లేదా ఆన్ లైన్  క్లాస్‌ కోసం డబ్బులు చెల్లిస్తే, ఆ ప్లాట్‌ఫారమ్‌లు కూడా వినియోగదారుల చట్టాల పరిధిలోకి వస్తాయి. భారతదేశంలోని వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం, డిజిటల్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లు కూడా జవాబుదారులే. అందుకే సీసీపీఏ (సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్  అథారిటీ) ఎడ్‌టెక్‌ కంపెనీలపై ప్రత్యేక గైడ్‌లైన్స్  తీసుకొచ్చింది. అంతేకాదు, స్టూడెంట్స్‌కి కూడా కొన్ని ముఖ్యమైన హక్కులు ఉన్నాయి.


డిజిటల్‌ మోసాలకు చెక్‌ పెట్టే స్మార్ట్‌ స్టెప్స్‌!
డిజిటల్‌ ప్రపంచంలో బటన్‌ నొక్కే ముందు ఒక్కసారి బ్రెయిన్ ను కూడా రిఫ్రెష్‌ చేయాలి. ఆన్ లైన్  మోసాల నుంచి సేఫ్‌గా ఉండేందుకు ఈ చిన్న సర్వైవల్‌ గైడ్‌ను తప్పకుండా ఫాలో అవ్వాలి. ఒకవేళ మోసపోతే, అందులో నుంచి ఇలా బయటపడోచ్చు.

కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేయండి
ముందుగా యాప్, వెబ్‌సైట్‌ లేదా కోచింగ్‌ సంస్థకు సమస్యను క్లియర్‌గా చెప్పండి. ఆర్డర్‌ నంబర్, ఇన్వాయిస్‌ పంపండి. చాలాసార్లు ఒక స్ట్రాంగ్‌ మెయిల్‌కే రీఫండ్‌ 
వచ్చేస్తుంది!

ముందుగా ప్రూఫ్‌ సేవ్‌ చేయండి
డిజిటల్‌ ప్రపంచంలో స్క్రీన్ షాట్‌ కూడా ఒక ఆయుధమే! బిల్లులు, మెయిల్స్, చాట్‌లు, స్క్రీన్ షాట్లు అన్నీ వెంటనే సేవ్‌ చేసుకోండి. ‘ప్రూఫ్‌’ ఉంటేనే మీ ఫిర్యాదుకు పవర్‌ వస్తుంది.

ట్రయల్‌ ట్రాప్‌ను చెక్‌ చేయండి
‘ఫ్రీ’ అని మొదలై, తర్వాత సైలెంట్‌గా డబ్బులు కట్‌ అవ్వడం కామన్ ! ఆటో రెన్యూవల్‌ ఆన్ లో ఉందో లేదో ముందే చూసుకోండి.

టైమర్‌ చూసి టెన్షన్  పడకండి
‘ఇంకా 2 సీట్లు మాత్రమే!’, ‘ఆఫర్‌ ఇంకో 5 నిమిషాలే!’ ఇవి చాలాసార్లు మార్కెటింగ్‌ డ్రామాలే! వెంటనే క్లిక్‌ చేయకుండా, రెండు నిమిషాలు ఆలోచించండి.

చిన్న అక్షరాలు కూడా చదవండి
షరతులు వర్తిస్తాయి అని కనిపించనంత చిన్నగా చివర్లో రాసిన వాటిని కూడా క్షుణ్ణంగా చూడాలి. లేకుంటే, రూ.99 అని కనిపించే కోర్స్, చివరికి రూ.499 బిల్లుగా మారొచ్చు! ట్యాక్స్‌లు, ప్లాట్‌ఫామ్‌ ఫీజులు ముందే చెక్‌ చేయండి.

స్పందన లేకపోతే.. 1915
కంపెనీ స్పందించకపోతే నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్ప్‌లైన్  1915కు ఫిర్యాదు చేయండి. డిజిటల్‌ మోసాల్లో ఇది మీ బ్యాకప్‌ బటన్  లాంటిది!

మారుతున్న కాలంతో పాటు మనం మారడంలో తప్పు లేదు. కాని, అతిగా అందుబాటులో ఉందని ‘రేపటి నుంచి చదువుతా’ అనే అలసత్వాన్ని మాత్రం ఆఫ్‌ చేయాలి! అప్పుడు చదువు ఎలా చదివినా చదువే అవుతోంది. స్క్రీన్  ఇప్పుడు గురువు అయినప్పటికీ, చదవాలా? స్క్రోల్‌ చేయాలా? అన్న నిర్ణయం మాత్రం ఇంకా విద్యార్థి చేతిలోనే ఉంది.

  • కొండి దీపిక 

Advertisement
 
Advertisement
Advertisement