కీటకం.. ఆహారం.. వ్యాపారం | Sakshi Funday Special Story: Insect Farming | Sakshi
Sakshi News home page

కీటకం.. ఆహారం.. వ్యాపారం

May 31 2026 3:25 AM | Updated on May 31 2026 3:25 AM

Sakshi Funday Special Story: Insect Farming

ఇళ్లల్లో ముచ్చటకొద్ది కుక్కలు, పిల్లలు వంటి జంతువులను, రామచిలుకలు, గోరువంకలు వంటి పక్షులను పెంచుకుంటారు. పాడి కోసం ఆవులు, గేదెలు వంటి పశువులను పెంచుకుంటారు. ఆహార అవసరాల కోసం కోళ్లు, మేకలు, గొర్రెలు, పందుల వంటి జీవాలను కూడా పెంచుకుంటారు. మనుషులు రకరకాల జీవాలను మచ్చిక చేసుకుని, వాటిని పెంచడం పురాతనకాలం నుంచి అలవాటే! కీటకాలలో తేనెటీగలను, పట్టుపురుగులను ప్రత్యేకంగా పెంచడం కూడా పురాతకాలం నుంచి సాగుతున్నదే! తేనెటీగల వల్ల తీయని తేనె, పట్టుపురుగుల నుంచి పట్టువస్త్రాలకు కావలసిన పట్టు దారాలు దొరుకుతాయి కాబట్టి వాటిని పెంచడం సరే! అసలు చూడగానే ఒళ్లు జలదరించేలా కనిపించే కీటకాలను కూడా ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా పెంచుతున్నారు.

 ఇలా పెంచుతున్న కీటకాలలో ఈగలు, దోమలు, చీమలు, బొద్దింకలు, కుమ్మరిపురుగులు, కందిరీగలు, మిడతలు, చిమ్మటలు, గొల్లభామలు, గొంగళిపురుగులు వంటివి కూడా ఉన్నాయి. అసలు వీటిని ప్రత్యేకంగా ఎందుకు పెంచుతున్నారు, వీటి వల్ల ఒరిగే ప్రయోజనాలు ఏముంటాయి అనే సందేహాలు చాలామందిలోనే ఉంటాయి. కీటకాల పెంపకం వల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం...

ఇళ్లల్లోకి ఈగలు, దోమలు, బొద్దింకలు, కందిరీగలు, గొంగళిపురుగులు వంటి కీటకాలు చేరితే వాటిని వెంటనే తరిమి కొట్టేందుకు ప్రయత్నిస్తాం. కీటకాల దాడి ముమ్మరంగా ఉంటే, వాటిని చంపేయడానికి నానా రకాల మందులు ప్రయోగిస్తాం. కాని, కీటకాల పెంపకం ఇప్పుడొక పరిశ్రమగా మారుతోంది. పలు దేశాల్లో కీటకాల పెంపకం క్రమంగా పుంజుకుంటోంది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రకరకాల అవసరాల కోసం సాగించే కీటకాల పెంపకం వ్యాపారం విలువ దాదాపు 30 బిలియన్‌ డాలర్ల వరకు ఉంది. 

కీటకాల పెంపకం వ్యాపారంలో దాదాపు 13 శాతం వార్షిక వృద్ధి నమోదవుతోంది. కీటకాల పెంపకంలో ఆసియా దేశాలు ముందంజలో ఉంటున్నాయి. కీటకాల పెంపకంలో ఆసియా దేశాల వాటా 40 శాతం వరకు ఉంటోంది. మనుషులు ఆహారంగా ఉపయోగించడానికి; మనుషులు తినే జలచరాలు, ఇతర జీవాలకు దాణాగా ఉపయోగించడానికి పలుచోట్ల కీటకాల పెంపకం సాగిస్తున్నారు. కొన్ని దేశాల్లోని రెస్టరెంట్లలో కీటకాలతో రకరకాల వంటకాలను వండి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. ఆకర్షణీయమైన సీసాలు, టిన్నులలో ప్యాక్‌ చేసి కూడా విక్రయిస్తున్నారు. మనుషులు వాడే ప్రొటీన్‌ పౌడర్లలోను; పశు పక్ష్యాదుల దాణాలోను కూడా కీటకాలను ఎండబెట్టి, పొడిచేసి ఉపయోగిస్తున్నారు.

మనుషుల ఆహారంలో కీటకాలు
మన దేశంలో కోళ్లు, మేకలు వంటి పశుపక్ష్యాదుల మాంసాన్ని; చేపలు, రొయ్యలు, పీతలు, ఎండ్రపీతలు వంటి జలచరాలను విరివిగా ఆహారంగా తీసుకునే జనాలు ఎక్కువగానే ఉన్నారు గాని, నేరుగా కీటకాలను ఆహారంగా తీసుకునే జనాలు చాలా తక్కువ. తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లో కీటకాలతో వంటకాలు చేసుకుని, తినే జనాలు ఎక్కువగానే కనిపిస్తారు. యూరోప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లోనూ కీటకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది జనాభా కీటకాలను తింటున్నారు. అంటే, ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగోవంతు కీటకాహారులు ఉన్నారు.

ఆసియా దేశాలలో ఎక్కువగా మిడతలు, గొల్లభామలు, పట్టుపురుగుల ప్యూపా, నీటి పురుగులు సహా రకరకాల కీటకాలను ఆహారంగా తీసుకునేవారు ఉన్నారు. దక్షిణ అమెరికాలో మిడతలు, చీమల గుడ్లు సహా అమెజాన్‌ అడవుల్లో దొరికే రకరకాల కీటకాలను తినేవారు ఉన్నారు. ఆఫ్రికాలో గొంగళిపురుగులు, చెదపురుగులు, తాటిముక్కు పురుగులు వంటి కీటకాలను తినేవారు ఉన్నారు. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) చెబుతున్న ప్రకారం దాదాపు రెండువేలకు పైగా జాతులకు చెందిన కీటకాలు మనుషులు నేరుగా ఆహారంగా వినియోగించడానికి అనువైనవి.

ప్రపంచ జనాభా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మనుషులు తమ ఆహారంలో కీటకాలను కూడా చేర్చుకోవాలని ఎఫ్‌ఏఓ 2013లో పిలుపునిచ్చింది. మనుషులు ఆహారంగా తీసుకోదగ్గ కీటకాలపై విస్తృత పరిశోధనలు జరిపి, ‘ఎడిబుల్‌ ఇన్సెక్ట్స్‌: ఫ్యూచర్‌ ప్రాస్పెక్ట్స్‌ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఫీడ్‌ సెక్యూరిటీ’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. మనుషుల ఆహారం కోసం, పశుపక్ష్యాదుల దాణా కోసం కీటకాల పెంపకం 1990ల నుంచి పారిశ్రామిక పద్ధతుల్లో మొదలైనా, 2013లో ఎఫ్‌ఏఓ పిలుపు తర్వాత ఇది ఊపందుకుంది.

కీటకాహారంలో ఆసియా దేశాల హవా
కీటకాహారంలో ఆసియా దేశాల హవా నడుస్తోంది. మనుషులు తినడం కోసం కీటకాల పెంపకంలో తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలు ముందంజలో ఉంటున్నాయి. థాయ్‌లండ్‌ చిమ్మటల పెంపకంలో అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో దాదాపు పాతికవేల చిమ్మటల పెంపకం కేంద్రాలు ఉన్నాయి. వాటితో పాటు మిడతలు, గొల్లభామల పెంపకం కేంద్రాలు కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. పట్టుపరుగుల ప్యూపా, మీల్‌వార్మ్స్‌ పెంపకం కేంద్రాలలో చైనా అగ్రస్థానంలో ఉంది. వియత్నాంలో చిమ్మటలు, కీచురాళ్ల పెంపకం కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి.

దక్షిణ కొరియాలో మీల్‌వార్మ్, పట్టుపురుగుల ప్యూపా, మిడతల పెంపంకం కేంద్రాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. జపాన్‌లో కందిరీగలు, మిడతల పెంపకం కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాలలోని పలు రెస్టరెంట్లలో కీటకాలతో తయారు చేసిన వంటకాలను కస్టమర్లకు వడ్డిస్తుండటం విశేషం. దక్షిణ అమెరికాలోని మెక్సికో, బ్రెజిల్‌; యూరోప్‌లోని నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌ దేశాలు కూడా ఆహారంగా ఉపయోగించే కీటకాల పెంపకంలో ముందంజలో ఉన్నాయి.

ఆహారంగా కీటకాలు... లాభాలు
మనుషుల ఆహారంగా కీటకాలను ఉపయోగించడంలో చాలా లాభాలు ఉన్నట్లు ఎఫ్‌ఏఓ సహా పలు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఎండబెట్టిన కీటకాలలో ప్రొటీన్లు మిగిలిన ఆహారాల కంటే అత్యధికంగా ఉంటాయి.

వీటిలో ఏకంగా దాదాపు 80 శాతం వరకు ప్రొటీన్లు ఉంటాయి. వీటిలో ఒమేగా–3, ఒమేగా–6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు; ఐరన్, జింక్‌ వంటి కీలకమైన ఖనిజాలు; విటమిన్‌–ఎ, విటమిన్‌–బి2, విటమిన్‌–బి12 వంటి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

మిడతలు, గొల్లభామలు వంటి కీటకాలలో ‘కీటిన్‌’ అనే పీచుపదార్థం ఉంటుంది. అందువల్ల కీటకాలు భేషైన పోషకాహారంగా తీసుకోదగినవని ఎఫ్‌ఏఓ చెబుతోంది.

కీటకాల వల్ల పోషక ప్రయోజనాలు ఇలా ఉంటే, వీటిని పెంచడం చాలా తేలిక. ఆహారం కోసం ఇతర జీవాలను పెంచడం చాలా శ్రమతో కూడుకున్న పని. వాటికి విశాలమైన స్థలం, నీరు, గాలి, వెలుతురు వంటివి ఎక్కువగా అవసరమవుతాయి. వాటికి పెట్టే దాణా కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కీటకాలను తక్కువ స ్థలంలోనే పెంచవచ్చు. వీటి పెంపకానికి నీరు చాలా తక్కువ ఖర్చవుతుంది. దాణా ఖర్చు దాదాపు నామమాత్రం. వీటి పెంపకం ప్రక్రియలో కర్బన ఉద్గారాలు చాలా తక్కువగా విడుదలవుతాయి. పోషకాహారంగానే కాకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం కూడా కీటకాల పెంపకాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కీటకాల పెంపకం పరిశ్రమ
కీటకాల పెంపకం పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా కంపెనీలు ఉన్నాయి. ఇవి కీటకాల లార్వాలను సేకరించి, శాస్త్రీయమైన పద్ధతుల్లో కీటకాల పెంపకం సాగిస్తున్నాయి. దాదాపు నాలుగు వందల కంపెనీలు కీటకాలతో పశు పక్ష్యాదులకు, జలచరాలకు ఉపయోగించే దాణాను; మనుషులు తినదగ్గ కీటకాహారాన్ని తయారు చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లో కీటకాల పెంపకం, కీటకాహార ఉత్పత్తిని భారీగా సాగిస్తున్న కంపెనీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. భారత్‌లో ప్రస్తుతానికి కొన్ని స్టార్టప్‌లతో కలుపుకొని సుమారు పాతిక కంపెనీలు ఈ రంగంలో పనిచేస్తున్నాయి.

భారత్‌లో కీటకాలను ఆహారంలో తినేవారు దాదాపు పది రాష్ట్రాలలో ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోను, మధ్య భారత ప్రాంతంలోను, పడమటి కనుమల ప్రాంతంలోను, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాలకు చెందినవారు, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని కొందరు దాదాపు మూడువందల జాతులకు చెందిన కీటకాలను తింటారు. వీరు ఎర్రచీమలను, పట్టుపురుగుల ప్యూపాను, మిడతలు, గొల్లభామలను, తొలకరి వానలు మొదలయ్యే కాలంలో దొరికే ఊసిళ్లను తింటారు. భారత్‌లో కీటకాలను తినేవారు ఉన్నా, వాటి పెంపకం మాత్రం ఇప్పుడిప్పుడే పరిశ్రమగా రూపుదిద్దుకుంటోంది.

ఎందుకు పెంచుతున్నారంటే?
ప్రపంచవ్యాప్తంగా రకరకాల కీటకాలను పలు ప్రయోజనాల కోసం పెంచుతున్నారు. మనుషులకు, ఇతర జీవాలకు ఆహారంగా మాత్రమే కాకుండా, ఔషధాల తయారీ, వ్యర్థాల నియంత్రణ, రంగుల తయారీ, శాస్త్ర పరిశోధనలు తదితర అవసరాల కోసం కూడా కీటకాల పెంపకం చేపడుతున్నారు. కీటకాల్లో వేటిని ఎందుకు పెంచుతున్నారో తెలుసుకుందాం...

ఆహార వ్యర్థాల నిర్వహణ
ఆహార వ్యర్థాలను సురక్షితంగా, త్వరగా విచ్ఛిన్నం చేయడానికి; కోళ్లు, చేపలు, రొయ్యలు వంటి వాటి దాణా తయారీకి; సేంద్రియ ఎరువుల తయారీకి ఈగల్లో ఒకరకమైన ‘నల్ల సైనిక ఈగలు’ (బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై) పెంచుతున్నారు. వ్యర్థాల నిర్వహణ కోసం బొద్దింకలు, మీల్‌వార్మ్‌ వంటి కీటకాలను కూడా పెంచుతున్నారు.

వైద్య పరిశోధనలు
మలేరియా, డెంగ్యూ, చికున్‌ గున్యా వంటి వ్యాధులపై పరిశోధనల కోసం నియంత్రిత పరిస్థితుల్లో కొన్నిచోట్ల దోమల పెంపకం కూడా చేపడుతున్నారు. జన్యుమార్పిడి చేసిన దోమలను పెద్దసంఖ్యలో బయటకు విడిచిపెట్టడం ద్వారా వ్యాధికారక దోమల నియంత్రణ కోసం ప్రయోగాలు జరుపుతున్నారు. ఈగలలో ఒకరకానికి చెందిన ఫ్రూట్‌ ఫ్లైని జీవశాస్త్ర పరిశోధనల కోసం పెంచుతున్నారు. మానవ జన్యవులతో బాగా పోలికలు ఉండటం వీటి ప్రత్యేకత. అందువల్ల వ్యాధుల నియంత్రణ కోసం జరిపే ప్రయోగాల కోసం ఫ్రూట్‌ ఫ్లై పెంపకం సాగిస్తున్నారు. గాయాల వల్ల ఏర్పడే మృతకణాలను తొలగించడానికి ఈగల లార్వా (మాగట్‌) పెంపకం చేపడుతున్నారు.

ఆహార అవసరాలు
మనుషుల ఆహార అవసరాల కోసం, పశువుల దాణా, మనుషులకు ఆహారంగా ఉపయోగపడే చేపలు, రొయ్యలు వంటి జలచరాల దాణా కోసం కూడా కీటకాల పెంపకం చేపడుతున్నారు. మిడతలు, గొల్లభామలు, బొద్దింకలు, మీల్‌వార్మ్‌ వంటి కీటకాలను ఆహార అవసరాల కోసం పెంచుతున్నారు. వీటితో ప్రొటీన్‌ పౌడర్లు వంటివి కూడా తయారు చేస్తున్నారు.

ఇతర అవసరాలు
మరికొన్ని ఇతర అవసరాల కోసం కూడా కీటకాలను పెంచుతున్నారు. ఫుడ్‌ కలర్స్, దుస్తులకు వేసే రంగులు, లిప్‌స్టిక్‌ వంటి వాటి తయారీలో ఉపయోగించడానికి ‘కోచినీల్‌’ పురుగులను పెంచుతున్నారు. వార్నిష్‌లు, పాలిష్‌లు, మేకప్‌ సామగ్రి తయారీ, ఔషధ పరిశ్రమ అవసరాల కోసం చెట్లను ఆశ్రయించుకుని పెరిగే లక్కపురుగులను ప్రత్యేకంగా పెంచుతున్నారు. పంటలను పాడుచేసే పురుగులను నియంత్రించడానికి ఆరుద్ర పురుగులను (లేడీబర్డ్‌ బీటిల్స్‌) పెంపకం సాగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈగల పెంపకం
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈగల పెంపకం సాగుతోంది. కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రాంతంలోని ఆక్వా సాగు ఎక్కువగా ఉండటంతో వక్కలగడ్డ గ్రామంలో ఈగల పెంపకం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్‌ సుబ్రహ్మణ్యం సుందర్, నంద్యాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎ.వి.నాగేశ్వరరెడ్డి ఈ గ్రామంలో నిరుపయోగంగా ఉన్న కోళ్లఫారం షెడ్లను అద్దెకు తీసుకుని, అందులో ఈగల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీరితో పాటు డాక్టర్‌ శ్రావణి ఈ కేంద్రం నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు. ఇదేచోట విన్‌క్యులర్‌ ఆక్వా లాబ్‌ కూడా పెట్టారు.

చేపలు, రొయ్యలకు వచ్చే వ్యాధులకు ప్రకృతి సిద్ధమైన చికిత్సలను ఎలా చేయాలో వీరు రైతులకు సలహాలు ఇస్తున్నారు. ఈగల పెంపకం కేంద్రంలో వెయ్యి గుడ్లతో ఉత్పాదన ప్రారంభిస్తే, పదిహేడు రోజుల్లోనే అవి మూడు లక్షలకు చేరుకుంటాయి. మరో పదిహేడు రోజులు ఆగితే, వాటి సంఖ్య తొంభై లక్షలకు పెరుగుతుంది. బియ్యం, కొవ్వు తీసేసిన పాలు కలిపి వండిన జావను ఈగలకు ఆహారంగా పెడతారు.

ఈ షెడ్లలో ఈగలు సురక్షితంగా ఉండటానికి, వీటి నుంచి తప్పించుకుని బయటకు ఎగిరిపోకుండా ఉండటానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈగ గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలను వేరుశనగచెక్క పొడిలో వేస్తారు. పూర్తిస్థాయిలో లార్వాలు వేరుశనగచెక్క పొడిలోకి రాగానే, వాటిని విద్యుత్‌ డ్రైయర్‌లో ఉంచి, 95 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వేడి చేస్తారు. ఆ వేడికి అవి వేరుశనగపొడిలో కలిసి పొడి పొడిగా మారిపోతాయి. ఈ పొడిని బయటకు తీసి, ఆరబెట్టి ప్యాక్‌చేసి, ఆక్వా రైతులకు ‘లార్వా ప్రొటీన్‌ ఫుడ్‌’ దాణాగా సరఫరా చేస్తారు. చేపలు, రొయ్యలకు ఈ పొడిని పెడితే, అవి ఎగబడి తింటాయి. ఈ పొడిలో ఉండే అత్యధిక ప్రొటీన్‌ వల్ల అవి బాగా పుష్టిగా ఎదుగుతాయి..
ఇన్‌పుట్స్‌: ఆకుల సుధీర్‌కుమార్, సాక్షి, చల్లపల్లి

Advertisement
 
Advertisement
Advertisement