అడవి ద్రాక్షతో ఇన్ని ప్రయోజనలా..! | Sagubadi: Wild Grapes Information and Facts | Sakshi
Sakshi News home page

అపురూపమైన అడవి పండ్ల జాతులు: అడవి ద్రాక్షతో ఇన్ని ప్రయోజనలా..!

May 22 2026 1:11 PM | Updated on May 22 2026 6:36 PM

Sagubadi: Wild Grapes Information and Facts

వాడుక భాషలో అడవి ద్రాక్షకు వేర్వేరు భాషల్లో వేర్వేరు పేర్లున్నాయి: అస్సామీలో గోవాలియా లత, పానిలత అని, ఇంగ్లీష్‌ లో వైల్డ్‌ గ్రేప్, జంగల్‌ అంగూర్, దిబ్రోలి అని, ఒరియాలో పనికచో, పానినోహ, దిబ్రోయి, కంజినోయి, పానిపరు అని, కన్నడలో చితహంబు, కడుద్రాక్ష, కట్టుకోడి మిండ్రి అని, గుజరాతీలో జంగ్లీ డ్రక్‌ అని, తెలుగులో అడవి ద్రాక్ష, అడవి తీగ ద్రాక్ష, బెడసతివ్వ, దొబ–తీగ, పుల్ల తీగ, బెంగాలీ లో గొవాలియా–లత అని, మరాఠీలో ఒకేల, నడెన, రాన్‌ ద్రాక్ష గోలింద్‌ అని, మలయాళంలో వియ–పిర–పిటిచ, కరంట వల్లీ, చంబ్రవల్లీ అని, హిందీలో గొలిండ, కట్టిబేల్, పనిబేల్‌ అని, సంస్కృతంలో ఆమ్ల వెటసహ, వన ద్రాక్ష అని అంటారు. నేపాలీలో పురేని అంటారు. 

పూత : మే – ఆగస్టు పండ్లు : డిసెంబర్‌ – జనవరి

దీనికి 1824లో ‘విటిస్‌ లాటి ఫోలియా’ అనే శాస్త్రీయ పేరు పెట్టిన 60 ఏళ్ల తర్వాత ‘అంపెలోస్పిస్‌ లటిఫోలియా’గా పేరు మార్చారు. వీటి పండ్లు ద్రాక్ష గుత్తుల మాదిరిగా ఉంటాయి. పండిన తర్వాత ఎరుపు నలుపు రంగుకు మారుతాయి.

English Name:
Wild Grape/Jungal Angoor
శాస్త్రీయ నామం: అంపేలో సిస్సన్‌ లటిఫోలియా

Scientific Name: 
Ampelocissus latifolia (Roxb.) Planch.

Synonym (s): 
Vitis latifolia Roxb. 
Cissus latifolia (Roxb.) Walp.

కుటుంబం: విటేసి
Family: Vitaceae

ఉనికి: 
ద్రాక్ష మాదిరిగానే దీనికి కూడా పాకుడు గుణం ఉంది. వీటికి వేరు గడ్డలు ఉంటాయి. గడ్డలు నాటుకోవచ్చు లేదా∙విత్తనం కూడా వేసుకోవచ్చు. ఎంతో విలువైన తీగ చెట్టు. ఈ పండ్లలో 2–4 గింజలు ఉంటాయి. ఈ తీగ చెట్టు స్వస్థలం భారత ఉపఖండం, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక మాల్దీవులు మొదలగు దేశాలలో గుర్తించారు.

మన దేశంలో ఎక్కువగా అస్సాం, ఈస్ట్‌ హిమాలయాల వరుస, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదలగు రాష్ట్రాల్లో అడవి ద్రాక్ష కనిపిస్తుంది. అధిక వర్షపాతం ఉన్న అడవుల్లో ఎక్కువగా ఉంటుంది. నల్లమల అడవుల్లో ఒకప్పటి సాంద్రత ప్రస్తుతం లేదు. దీనిపై ఉన్నత స్థాయి పరిశోధనలు జరిగినప్పటికీ దీని ప్రయోజనాలు ప్రజల చెంతకు చేరలేదు.

ప్రయోజనాలు

అడవి ద్రాక్ష పండ్లు తినదగినవే. ఇవి సాధారణ ద్రాక్ష గుత్తుల్లాగే మొదట ఆకుపచ్చగా ఉండి ఎరుపునకు మారి ఆ తరువాత నలుపు రంగుకు మారతాయి. వగరు తీపితో కూడుకొని ఉంటాయి.

ఈ తీగ చెట్టుకు ఔషధగుణాలు ఉన్నాయి.

ఎన్నో పోషక విలువలు ఉన్నందున వీటిని తినడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

వీటి నుంచి ఎర్రరంగును తయారు చేస్తారు. ఈ రంగుకు మార్కెట్‌లో గిరాకీ ఉంది. 

ఈ గింజల నుంచి పలుకులను వేరు చేసి తింటారు. ఈ పలుకులు మొర్లి పలుకులను పోలి ఉంటాయి.

అనేక రోగాలను తగ్గించటానికి నాటు వైద్యంలో వీటిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా విరేచనాలు, బొల్లి, పంటి సమస్యలు, కడుపు నొప్పి, గౌట్, టీబీ అజీర్తి, శరీరపు వీక్‌ నెస్‌ తదితర సమస్యల నుంచి ఉపశమనం కోసం వాడుతారు.

ఎముకల పటిష్టతకు ఉపయోగిస్తారు.

ఆయుర్వేద, హోమియో మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. 

ఈ తీగ చెట్ల వినియోగం తప్ప భద్రపరచడం తక్కువ కాబట్టి రానున్న రోజుల్లో ఈ జాతి అంతరించే ప్రమాదం ఉంది.

దీనిపై నిర్దిష్టమైన పరిశోధనలు చేసి ఫలితాలను రైతుల చెంతకు చేర్చితే అనేక విధాలుగా లబ్దిపొందవచ్చు. అంటు ద్రాక్ష మొక్కల తయారీకి వీటి కొమ్మలను రూట్‌ స్టాక్‌గా వాడవచ్చు.ఈ పండ్లలో ఆల్కేన్‌ ఈస్టర్స్, అమెన్స్‌, కిటోన్స్‌, హల్డే హైట్స్‌ తదితర ఆమ్లాలు ఉంటాయి. 

డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య,
విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, 
ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, 
రాజేంద్రనగర్, హైదరాబాద్‌.
మొబైల్‌: 94407 08924 

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడిడెస్క్‌ 
 

(చదవండి: Rice Husk: వరిపొట్టుతో ఇన్ని ఉపయోగాలా..!)
 

Advertisement
 
Advertisement
Advertisement