ప్రపంచవ్యాప్తంగా మే 22న పాటించే అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ఈ ఏడాది ‘ప్రపంచవ్యాప్త ప్రభావం కోసం స్థానికంగా పనిచెయ్యటం’ అనే అంశంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు సచివాలయం సమన్వయంతో ఈ సంవత్సరం జీవవైవిధ్య దినోత్సవం ముఖ్య ఉద్దేశం కున్మింగ్–మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌లో ΄పొందుపరిచిన 23 ప్రతిష్టాత్మక లక్ష్యాలను నెరవేర్చేందుకు ఎక్కడికక్కడ స్థానికంగా చేసే అనేక రోజువారీ పనులు నేరుగా దోహదపడతాయి. వీటిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది.
ఎందుకంటే ప్రపంచంలోని నివాసయోగ్యమైన భూమిలో వ్యవసాయం దాదాపు సగభాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది పర్యావరణ వ్యవస్థపై ఒత్తిడికి ప్రాథమిక చోదకంగానూ, పర్యావరణ పునరుద్ధరణకు కీలక పరిష్కారంగానూ పనిచేస్తుంది.
ముఖ్యాంశాలు:
ప్రపంచంలోని 75% పైగా ఆహార పంటలు, 35% ప్రపంచ పంట దిగుబడులు తేనెటీగలు, సీతాకోకచిలుకల వంటి మేలుచేసే వాటి ద్వారా జరిగే పరాగ సంపర్కంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.
వ్యవసాయంలో అధిక స్థానిక రకాల విత్తనాలు, పశు జాతుల వైవిధ్యం ద్వారా తీవ్ర వాతావరణ సంఘటనలు, తెగుళ్ల వ్యాప్తి, మారుతున్న వాతావరణ ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని పెంపొందుతుంది.
భూమిలోని ఎన్నెన్నో విభిన్న సూక్ష్మజీవుల సమూహాలు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసి, కార్బన్‌ను సంగ్రహించి, దీర్ఘకాలంలో నేల సారాన్ని పెంపొందిస్తాయి.
విభిన్నమైన దేశవాళీ లేదా స్థానిక విత్తన రకాలను పరిరక్షించడం ఎందుకు అవసరమంటే.. ఏదో ఒకటే పంటను నిరంతరం సాగు చేసే ఏక పంటల వైఫల్యాల ముప్పు నుంచి తరతరాల పంట పొలాలను కాపాడుతుంది.
2026 థీమ్‌కు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్‌ఈపీ), ఆహార – వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ)లు ప్రకృతి/ సేంద్రియ/ బయోడైనమిక్/ ఆగ్రోఫారెస్ట్రీ తదితర స్థానిక సుస్థిర వ్యవసాయ మార్గాలను ప్రోత్సహించమని వివిధ దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచిస్తున్నాయి.
రైతులు, స్థానిక సంఘాలు స్థానికంగా అనుసరిస్తున్న తేనెటీగల పరిరక్షణ చర్యలను పెంపొందించటానికి విషపూరిత రసాయన వ్యవసాయంపై ఆధారపడటాన్ని తగ్గించటం, సామూహిక విత్తన బ్యాంకులను స్థాపించటం అవసరమని ఎఫ్‌ఏవో నొక్కి చెబుతోంది.
స్థానిక ప్రజలను వైవిధ్యమైన సంప్రదాయ ఆహారోత్పత్తుల వినియోగం వైపు ప్రోత్సహించటం జీవవైవిధ్య పరిరక్షణకు ముఖ్యం. శాకాహారపు అలవాట్ల వైపు మళ్లించడం, అలాగే స్థానిక పంటలను ప్రోత్సహించటం వల్ల బహుళ పంటల సాగు పెరిగి, ఆ మేరకు జీవవైవిధ్యానికి నష్టం చేసే ఏక పంట(మోనోకల్చర్) వ్యవసాయాన్ని తగ్గిస్తుంది.
ఈ సంవత్సరం చివర్లో ఆర్మేనియాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సదస్సు (కాప్17)లో పర్యావరణంలో జీవవైవిధ్యానికి కలుగుతున్న నష్టాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు పునరంకితం కావాల్సిన అవసరం ఉంది.
నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్
( చదవండి: Rice Husk: వరిపొట్టుతో ఇన్ని ఉపయోగాలా..!)


