‘నూకలు’ చెల్లిన కలుపు! | Sagubadi: Weed management in rice established by different methods | Sakshi
Sakshi News home page

‘నూకలు’ చెల్లిన కలుపు!

Apr 14 2026 12:52 AM | Updated on Apr 14 2026 12:52 AM

Sagubadi: Weed management in rice established by different methods

ఎకరానికి 100–200 కిలోల నూకలు రెండు దఫాల్లో చల్లితే కలుపు నివారణ 

యూరియాతో కలిపి నూకలు చల్లినా కలుపు నివారణ సహా ఇతర ప్రయోజనాలు 

సీవీఆర్‌ సరికొత్త ఆవిష్కరణ సూపర్‌ హిట్‌ అంటున్న రైతులు 

వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దీనిపై లోతుగా అధ్యయనం చేస్తే మేలు

వరి పొలాల్లో కలుపు నివారణకు రైతులు రసాయ­నిక గడ్డి మందులు / కలుపు మందులు పిచికారీ చెయ్య­టం రివాజు. అయితే, ప్రస్తుత రబీ పంట కాలంలో తెలు­గు రాష్ట్రాల్లో నీరు నిల్వగట్టే పద్ధతిలో వరి సాగు చేసే కొందరు వరి రైతులు ఒక సరికొత్త ప్రయోగం చేసి కలుపుపై నూటికి నూరు శాతం సక్సెస్‌ అయ్యారు. కలుపు మందులకు బదులుగా వరి బియ్యం నూకలను నాట్లు వేసిన పొలంలో చల్లి కలుపు మొలవకుండా అడ్డుకున్నారు. 

ఎకరానికి రూ. 5 వేలకు పైగా రైతులకు ఖర్చు తగ్గటంతో పాటు పర్యావరణానికి మేలు జరిగింది. ప్రముఖ రైతు శాస్త్రవేత్త పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి (సీవీఆర్‌) చెప్పిన ఈ చిట్కా సూపర్‌ హిట్‌ అయ్యింది. వరి నాటిన మొదటి 3 రోజుల్లో ఒకసారి, 25వ రోజు మరోసారి ఎకరానికి 100 కిలోల చొప్పున వరి బియ్యం నూక (రెండుసార్లు కలిపి ఎకరానికి 200 కిలోలు) చల్లాలని ఆయన సూచించారు. ఈ ఆవిష్కరణపై జనవరి 6న ‘సాక్షి సాగుబడి’లో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. 

తెలుగు రాష్ట్రాల్లో సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ దారులతో పాటు రసాయనిక ఎరువులు వాడే రైతులు, సమస్యాత్మక చౌడు భూముల్లో వరి పండించే రైతులు కూడా సత్ఫలితాలు పొందుతుండటం విశేషం. వరి నూకలు లేకపోతే ధాన్యాన్ని మరపట్టించి పొట్టుతో సహా పొలంలో చల్లినా కలుపు సమస్య తీరిందని రైతులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో దీనిపై అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

నూకలు కలుపును ఎలా నియంత్రిస్తాయంటే?
నూకలు చల్లితే కలుపు నియంత్రణ జరగటానికి వెనుక శాస్త్రీయత ఏమిటి అని ప్రశ్నించినప్పుడు తన పేరు వెల్లడించటానికి అంగీకరించని ఒక సీనియర్‌ శాస్త్రవేత్త ఇలా వ్యాఖ్యానించారు: ‘నూకలను వరి పొలాల్లో చల్లితే కలుపు నివారణకు సహాయపడుతుంది. ఒక రకమైన ఆచ్ఛాదన పొర (మల్చింగ్‌ లేయర్‌) ఏర్పడుతుంది. ఈ పొర సూర్యరశ్మిని అడ్డుకుంటుంది. కలుపు మొక్కల పెరుగుదలను అణచివేస్తుంది. కలుపు విత్తనాలు మొలకెత్తలేవు. పొలంలో నిల్వగట్టిన నీటి ఆవిరి నష్టం, నేల కోత తగ్గుతుంది. నేల ఆరోగ్యం మెరుగవుతుంది. పంట పెరుగుదలకు తోడ్పడుతుంది. అయితే, వరి పొలాల్లో నూకలు చల్లితే ఏమవుతుందనే అంశంపై శాస్త్రీయంగా పటిష్టమైన అధ్యయనాలు ఇప్పటి వరకు జరగలేదు. వరి పొట్టు బయోచార్‌ను పొలంలో చల్లినా కూడా ఈ ఫలితాలు వస్తాయి. ఈ విషయం పరిశోధనల్లో ఇప్పటికే నిర్ధారణైంది.’

యూరియాతో నూకలు చల్లితే మోకాళ్ల ఎత్తు తుంగ పోయింది!
రెండు పొలాల్లో మొత్తం 10.5 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఎకరానికి 1 బస్తా డీఏపీ, మూడు సార్లు కలిపి 2.5 బస్తాల యూరియా, అర బస్తా పొటాష్‌ వాడుతుంటాను. ఈ రబీ సీజన్‌లో 4.5 ఎకరాల పొలంలో డ్రమ్‌సీడర్‌తో ‘ఆర్‌ఎన్‌ఆర్‌31479’ వరి విత్తనాలు వేశాను. తుంగ మోకాళ్ల ఎత్తు పెరిగింది. వరి మొక్కలు దానికి సగం ఎత్తులోనే ఉన్నాయి. పంట పోయినట్లే నని దున్నేద్దాం అనుకున్నా. 

ఆ దశలో చింతల వెంకటరెడ్డి గారు నూకల గురించి చెప్పింది విని 4.5 ఎకరాల్లో 170 కిలోల సన్న (చీరు) నూకలను 3 కట్టల యూరియాలో కలిపి చల్లా. వారం రోజుల తర్వాత నుంచి తుంగ వాడిపోవటం మొదలైంది. కొన్నాళ్లలో తుంగ పూర్తిగా నేలవాలింది. వరి మొక్కలు మాత్రం ఏపుగా పెరిగాయి. కోతల నాటికి తుంగ ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. పోయిందనుకున్న పొలంలో ఎకరానికి 35 బస్తాలు పండింది. అందరితో పాటు నేనూ ఆశ్చర్యపోయాను. మరో 6 ఎకరాల్లో ‘కేఎన్‌ఎం 12368’ వరి నాట్లు వేశాను. 

తుంగ, ఇతర కలుపు లేకపోయినా రెండో దఫా వేసే 3 కట్టల యూరియాతో పాటు 150 కిలోల నూకలు కలిపి చల్లాను. పంట బాగా పెరిగి కోతకు వచ్చింది. ఎకరానికి 45 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. చివరి విడత యూరియా, పొటాష్‌ వెయ్యాల్సిన అవసరం రాలేదు. నూకల వల్ల పురుగుమందులు, ఫంగిసైడ్స్‌ చల్లాల్సిన అవసరం రాలేదు. పురుగుమందుల ఖర్చే ఎకరానికి రూ. 5 వేలు మిగిలాయి. క్వింటా నూకలకు రూ.1,800 వరకు ఖర్చవుతున్నది. అయినా, వీటిని చల్లటం వల్ల తుంగ వంటి మొండి కలుపు కూడా పోవటం ఒక్కటే కాదు ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. 
– వల్లభనేని వెంకట్రావు (81793 84318), లింగగిరి, హుజూర్‌నగర్‌ మం., సూర్యాపేట జిల్లా

చౌడు సమస్య తగ్గింది.. కలుపు మొలవ లేదు..
మాది 2 ఎకరాల చౌడు పొలం. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. చింతల వెంకటరెడ్డి గారు చెప్పినట్లు కలుపు నివారణకు నూకలు చల్లితే మంచి ఫలితాలు వచ్చాయి. 1.25 ఎకరాల వరి పొలంలో రెండు దఫాలుగా ఎకరానికి 100 కిలోల చొప్పున నూకలు చల్లాను. తుంగ, గరిక తదితర కలుపు మొలవలేదు. అంతేకాదు, చౌడు వల్ల ప్రతి ఏటా మొక్కలు చాలా చనిపోయేవి. కానీ, నూకలు వేశాక మొక్కలన్నీ బతికాయి. 30 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. మరో, 75 సెంట్ల వరి పొలంలో నూకలు ఒక్కసారే వేశాను. రెండోసారి వెయ్యలేదు. మొక్కలు 20% పోయాయి. ఇంకా పంట కొయ్య లేదు. నూకలు చల్లిన తర్వాత కొన్ని రోజులకు మురుగు వాసన వస్తుంది. అయితే, కలుపు పెరగదు. కలుపు మందులు కొట్టినా కలుపు అంతో ఇంతో వస్తూనే ఉంటుంది. నూకలు కలుపు రాకుండా చెయ్యటంతో పాటు చౌడు సమస్యలను కూడా తగ్గించాయి.   
–చిన్నపరెడ్డి నరసింహారెడ్డి (94406 86885), తిమ్మంపేట, జఫర్‌గఢ్‌ మం., జనగామ జిల్లా

శాస్త్రీయ పరిశోధన చెయ్యాలి
ఇవన్నీ కూడా మన సంప్రదాయ వైద్యంలో చెప్పే విషయాల వంటివి. ఏదైనా ఫలితాలనిస్తే దాన్ని మనము ఆలోచించాలి, అయితే, కొందరు రైతులు బాగుంది అంటున్నారు కాబట్టి, ఇంకా విస్తృత స్థాయిలో పరీక్షించాలి. క్రమబద్ధ శాస్త్రీయ పరిశోధన చేయకుండా దీన్ని మనం సిఫార్సు చేయటం సాధ్యం కాదు. 
– డాక్టర్‌ చెన్నబోయిన దామోదర రాజు,  అధిపతి–ప్రధాన శాస్త్రవేత్త, వరి పరిశోధనా సంస్థ, ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం.

ఎకరానికి 50 కిలోలు చల్లిన పొలాల్లోనూ కలుపు రాలేదు
వరి పొలాల్లో నూకలు చల్లితే కలుపు సమస్య తీరిపోవటం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమని ఈ రబీ పంట కాలంలో తొలిసారి నా అనుభవంలో రుజువైంది. 1.25 ఎకరం పడావు భూమిని సిద్ధం చేసి నాట్లు వేశాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నాం. నాట్లేసిన రెండో రోజు, 25వ రోజు వంద కిలోల చొప్పున వరి బియ్యం నూకలు చల్లాం. మా పొలంలో కలుపు అసలు రాలేదు. పంట ఎర్రబడకుండా ఆకుపచ్చగా, ఆరోగ్యంగా ఉంది. త్వరలో కోతకు రానుంది. 

పొలాన్ని వీడియోతీసి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తే, అనుసరించిన 60–70 మంది రైతులు ఫోన్‌ చేసి తమ అనుభవాలు చెప్పారు. ఎకరానికి 50 కిలోల నూకలు వేసిన పొలాల్లో కూడా కలుపు నివారణ జరిగింది. నాట్లేసిన తర్వాత 10–26 రోజులకు నూకలు చల్లిన పొలాల్లోనూ కొత్తగా కలుపు పుట్టలేదు. మా తమ్ముడు పొలంలో కనీసం రెండుసార్లు కలుపు తీయిస్తాడు. నాట్లేసిన 20 రోజులకు ఒకసారి కలుపు తీసినాక ఒకే ఒక్కసారి ఎకరానికి వంద కిలోలు నూకలు చల్లినా కలుపు మళ్లీ రాలేదు. 

చౌడు భూముల్లో ఆర్గానిక్‌ వరి సాగు చేసే పొలాల్లో నూకలు చల్లినా కలుపు రాలేదు. మొక్కలు చనిపోవటం, ఎరుపు రంగుకు మారటం కూడా జరగలేదని రైతులు చెబితే ఆశ్చర్యం కలిగింది. కలుపు మందులు కేన్సర్‌ కారకాలని చెబుతున్న నేపథ్యంలో నూకలతో కలుపు నివారణ ఆవిష్కరణను సీవీఆర్‌ అందించటం సంతోషదాయకం. 
– పడాల గౌతమ్‌ (98497 12341), ఎస్టేట్‌ మేనేజర్, రిషి వ్యాలీ స్కూల్, మదనపల్లి
 
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement