Sagubadi: నేల వైద్యుడు జీలుగ! | Sagubadi: Uses Of Manure Dhaincha In Every Season Its Cultivation | Sakshi
Sakshi News home page

Sagubadi: నేల వైద్యుడు జీలుగ!

Jun 12 2026 8:50 AM | Updated on Jun 12 2026 8:50 AM

Sagubadi: Uses Of Manure Dhaincha In Every Season Its Cultivation

Sagubadi: జీలుగ

పచ్చి రొట్ట పంటల్లో మేలైనది జీలుగ. శాస్త్రీయ నామం: సెస్బానియా సెస్బాన్‌. త్వరగా పెరిగే పప్పు జాతి మొక్క. నిస్సారమైన భూమిని బాగు చేస్తుంది. కాబట్టి దీన్ని ‘నేల వైద్యుడు’ అంటారు. పంటలకు ముందు పొలంలో జీలుగ సాగుతో భూసారం పెరిగి తర్వాత వేసే పంటకు యూరియా అవసరం తగ్గుతుంది. పనిలో పనిగా ఫ్లోరోసిస్‌ నియంత్రణ కూడా జరుగుతుందని చెబుతున్నారు ఫ్లోరోసిస్‌ విమోచన సమితి వ్యవస్థాపకులు డా. కె. గోవర్దన్‌ రెడ్డి.

ప్రతి పొలంలో జీలుగ ఎందుకు సాగు చెయ్యాలి?

  • గాలి నుంచి సేకరించి ఎకరం నేలకు 80–100 కిలోల నత్రజనిని అందిస్తుంది. ఎకరానికి యూరియాపై రూ. 2 వేలకు పైగా ఆదా.

  • త్వరగా పెరుగుతుంది 45–60 రోజుల్లో సిద్ధం. 6 నెలల్లో 3–4 మీటర్లు పెరుగుతుంది.

  • నీళ్లు అక్కర్లేదు ∙మొదటి నెల తర్వాత కరువును తట్టుకుంటుంది. మెట్ట భూములకు సరైనది.

  • నేలను సారవంతం చేస్తుంది. లోతైన వేర్లు గట్టి నేలను వదులు చేస్తాయి. జీలుగ సాగుతో ఎకరానికి 8–12 టన్నుల సేంద్రియ పచ్చిరొట్ట ఎరువు లభిస్తుంది.

  • దీని సాగుకు ఎరువుల ఖర్చు లేదు. యూరియా, డీఏపీ అవసరం లేదు. తన ఆహారాన్ని తానే తయారు చేసుకుంటుంది.

  • జీలుగ ఏ ఇతర పంటలు పండని చౌడు నేలల్లో కూడా బాగా పెరుగుతుంది.

  • ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాల్లో రసాయన ఎరువులు నేలను మరింతగా పాడు చేస్తాయి. జీలుగ భూగర్భ జలాలకు హాని చేయకుండా సహజ నత్రజనిని ఇస్తుంది. ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రతను తగ్గిస్తుంది. నేలకు ప్రాణం పోయండి, ఆ నేల మీకు ప్రాణం పోస్తుంది.


పచ్చిరొట్ట పంటగా జీలుగ సాగు ఎలా?
ఎకరానికి 25 కిలోల విత్తనం తీసుకోండి..

  • జూన్‌–జూలై నెలల్లో తొలకరి వానలకు వెదజల్లి, తేలికగా దున్నండి.

  • 45–60 రోజులు (50% పూత వచ్చే వరకు) పెరగనివ్వండి.

  • కోసి, భూమిలో దున్నేయండి. 15 రోజులు ఆగండి.

  • నత్రజని పెరిగిన ఆ నేలలో జొన్న, సజ్జ, పప్పు ధాన్యాలు వంటి పంటలు వేయండి. తరువాతి పంటకు యూరియా అవసరం 25–30% తగ్గిపోతుంది. నేల మెత్తగా, సారవంతంగా మారుతుంది.

విత్తనాలు – సలహాల కోసం మీ దగ్గరలోని వ్యవసాయ శాఖ కార్యాలయం / కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను గానీ, ఫ్లోరోసిస్‌ విమోచన సమితి వ్యవస్థాపకులు డా. కె. గోవర్దన్‌ రెడ్డి, (93933 13111)ని గానీ సంప్రదించండి. 

1 ఎకరానికి ఖర్చు – లాభం

ఖర్చు..  

  • విత్తనం 25 కిలోలు

  • దుక్కి, విత్తనాలు వేసే ఖర్చు రూ. 1,500

  • మొత్తం ఖర్చు: రూ. 3,300 

  ఆదా/లాభం..

  • రూ. 1,800 / యూరియా ఆదా రూ. 2,200

  • అధిక దిగుబడి రూ. 3,000 పైనే, మొత్తం లాభం రూ. 5,200 పైనే.

  • మొదటి పంటలోనే రూ. 1,900పైగా లాభం.

  • దానితో పాటు నేల సంవత్సరాల తరబడి 
        ఆరోగ్యకరంగా ఉంటుంది.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌.

Advertisement
 
Advertisement
Advertisement