
చెద పురుగులు (termites) ఇళ్లలోనే కాదు, పంట పొలాల్లో కూడా సమస్యలు సృష్టిస్తుంటాయి. పంటలను ఆశిస్తూ 10 నుంచి 50% వరకు దిగుబడి నష్టం కలిగిస్తుంటాయి. రైతులు సాధారణంగా రసాయనాలు చల్లి పంట పొలాల్లో చెదలును నియంత్రించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, రసాయనాలతో పని లేకుండా సులభంగా, స్వల్ప ఖర్చుతో చెదలు సమస్యకు పరిష్కారాన్ని వెదకటంలో ఓ వృద్ధ మహిళా రైతు అసాధారణమైన విజయం సాధించారు. యూకలిప్టస్ కొమ్మలు/కట్టె ముక్కలను పొలంలోని పంటల సాళ్ల మధ్య ఉంచితే, చెద పురుగులు పక్కనే ఉన్న పంటల జోలికి వెళ్లకుండా యూకలిప్టస్ కొమ్మలనే ఆశిస్తున్నాయని ఆమె కనుగొన్నారు.
సజ్జ నుంచి గోధుమ వరకు..
గోధుమ చేనులో 12“12 మీటర్ల దూరంలో ఎకరానికి 32 చొప్పున స్ప్రింక్లరు ఉంటాయి. ప్రతి స్ప్రింక్లర్‌కు దగ్గర్లో ఒక యూకలిప్టస్ కట్టె ముక్క/ కొమ్మను ఆమె పెట్టారు. ఒక్క గోధుమ మొక్కను కూడా చెదలు ఆశించలేదు. ఒక్కో కట్టె ముక్కను వేలకొద్దీ చెద పురుగులు చుట్టుముట్టాయి. అంటే పంట వైపు నుంచి ఈ యూకలిప్టస్ కట్టెలు చెదపురుగుల దృష్టిని వంద శాతం మళ్లించాయన్న మాట. ఎకరానికి ఖర్చు కేవలం రూ. 320లు. ఈ కట్టెలను ప్రతి పంట కాలానికీ కొత్తవి వేయాల్సిన అవసరం లేదు. మూడు పంటల వరకు అవే సరిపోతున్నాయని ఆమె తెలిపారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయ గుర్తింపు
భగవతి దేవి ఈ విషయాన్ని ఫతేపూర్ షెఖావతిలోని కేవీకే శాస్త్రవేత్తల చెప్పారు. వరుసగా నాలుగేళ్ల పాటు అనేక పంటల్లో ప్రయోగం చేసి సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు. బికనెర్‌లోని రాజస్థాన్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బార్లీ పంటలోనూ అద్భుత ఫలితాలు రావటంతో, రైతులందరికీ ఇది అనుసరించమని చెబుతున్నారు.
తళుక్కుమన్న ఉపాయం
పనులు చేస్తూనే అసాధారణంగా ఉన్న విషయాలను గమనిస్తూ ఉండటం భగవతి దేవికి అలవాటు. వంట కలపను ఇంటికి తెచ్చి పొయ్యిలో పెడుతున్న ఒక సందర్భంలో ఆమె దృష్టిని యూకలిప్టస్ కర్రలు ఆకర్షించాయి. యూకలిప్టస్ కర్ర ముక్కల పైకి మిగతా కర్రల కంటే చాలా ఎక్కువ చెదపురుగులు చేరుతున్నట్లు ఆమె గుర్తించారు. ఈ గ్రహింపు కలిగిన మరుక్షణమే ఆమె మదిలో ఒక కొత్త ఉపాయం తళుక్కున మెరిసింది. ఆలోచన వచ్చిందే తడవుగా అప్పుడు సాగులో ఉన్న సజ్జ పంటలో అమలు చేసింది.
2 నుంచి 3 అడుగుల పొడవు, 2 నుంచి 3 అంగుళాల లావు ఉన్న యూకలిప్టస్ కర్ర ముక్కలను తీసుకొని, సజ్జ పొలం అంతటా సాళ్ల మధ్యలో పెట్టింది. ఆమె అనుకున్నట్లుగానే, ఆ కర్ర ముక్కల చుట్టూ వేలకొలది చెద పురుగులు చేరి, కర్రలను కొరికి తినటం ప్రారంభించాయి. ఆశ్చర్యమేమిటంటే.. చెద పురుగులు ఇక సజ్జ మొక్కల జోలికి పోలేదు. యూకలిప్టస్ కర్ర ముక్క నుంచి 4 అంగుళాల దూరంలో ఉన్న సజ్జ మొక్కలను కూడా అవి ఆశించలేదు. అంతే. భగవతి దేవి మొహం ఆనందంతో వెలిగిపోయింది. జఠిలమైన చెదలుకు ప్రకృతిసిద్ధమైన పరిష్కారాన్ని కనుగొన్న రాజస్థాన్ వృద్ధ మహిళా రైతు యూకలిప్టస్ కర్ర ముక్కలను పొలంలో ఉంచటం ద్వారా.. చెద పురుగులు పంటలను పాడు చెయ్యకుండా కాపాడుతున్నారు.