మకడమియ గింజలు.. సుసంపన్న పోషక విలువలు | sagubadi macadamia nuts health benefits nutrition facts details | Sakshi
Sakshi News home page

macadamia nuts: తక్కువ పిండి పదార్థం, ఎక్కువ కొవ్వు

Jun 25 2025 8:19 PM | Updated on Jun 25 2025 8:19 PM

 sagubadi macadamia nuts health benefits nutrition facts details

మకడమియ.. క్వీన్‌ ఆఫ్‌ నట్స్‌. మకడమియ కాయ లోపల ఉండే గింజలు డైటరీ ఫ్యాట్‌కు పెట్టింది పేరు. మకడమియ కాయలు పెద్ద గోళీకాయంత సైజులో ఉంటాయి. పచ్చి కాయ ఆకుపచ్చగా, ఎండుకాయ ముదురు గోధుమ రంగులో ఉంటుంది. దాని పైపొర గట్టిగా ఉంటుంది. దాన్ని పగులగొడితే లోపల వెన్న రంగు లేదా లేత గోధుమ రంగులో గింజ ఉంటుంది. అంచేత.. దీన్ని తెలుగులో ‘వెన్న గింజ’ అందాం!

అవకాడోను ‘వెన్న పండు’ అంటారు. 100 గ్రాముల పండులో వెన్న రంగులో ఉండే గుజ్జు 15 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. దీని కన్నా చాలా ఎక్కువ మోతాదులో మకడమియ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. తక్కువ పిండి పదార్థం, ఎక్కువ కొవ్వు, ప్రొటీన్‌ను కలిగి ఉండటం దీని విశిష్టత. 100 గ్రాములు మకడమియ గింజల్లో కొవ్వు 76 గ్రాములు, మాంసకృత్తులు 8 గ్రా., పిండి పదార్థాలు 14 (పీచు 8.6 తీసేస్తే నికర పిండి పదార్థం 5.4) గ్రాములు ఉంటాయి. 

లో కార్బ్‌ హెల్దీ ఫ్యాట్‌ డైట్‌ తీసుకునే శాకాహారులకు, వీగన్‌ ఆహారాన్ని తీసుకునే వారికి ఆరోగ్యకరమైన కొవ్వు, మాంసకృత్తులకు మకడమియ గింజలు అద్భుతమైన వనరు. ట్రీ నట్‌ జాతుల్లో పేరెన్నిక గన్న మకడమియ పుట్టిల్లు ఆస్ట్రేలియా అయినప్పటికీ ఉత్పత్తిలో దక్షిణాఫ్రికా ముందుంది. కెన్యా, మలావితో పాటు అమెరికాలోని హవాయి దీవుల్లోనూ విస్తారంగా సాగవుతోంది. మన దేశంలో కర్ణాటక, తమిళనాడు ముందున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే సాగు ప్రారంభమైంది. అధిక విలువైన గింజలనిచ్చే దీర్ఘకాలిక చెట్టు మకడమియ. వాణిజ్యపరంగా కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు.

మకడమియ గింజల (macadamia nuts) ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. వరల్డ్‌ మకడమియ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూ.ఎం.ఓ.) సమాచారం ప్రకారం.. 2022లో 2,98,914 టన్నుల మకడమియ కాయల నుంచి తీసిన గింజల ఉత్పత్తి జరిగింది. 2027 నాటికి ఇది రెట్టింపవుతుందని అంచనా. 2030 నాటికి 6,60,000 మెట్రిక్‌ టన్నులకు పెరుగుతుందని డబ్ల్యూ.ఎం.ఓ. ఊహిస్తోంది. 

ఆరోగ్యదాయకమైన నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్న వారి సంఖ్య ఆసియా దేశాల్లో, ముఖ్యంగా చైనా, భారత్‌లలో, అంతకంతకూ పెరుగుతుండటం.. ఈ దేశాల్లో ప్రజల ఆదాయాలు వేగంగా పెరుగుతుండటం, పాశ్చాత్య ఆహారపు అలవాట్లు విస్తరిస్తుండటం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వంటశాలల్లోనూ, ఆహారోత్పత్తుల పరిశ్రమల్లోనూ మకడమియ గింజల వినియోగం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

చెట్ల ఎత్తు 7 నుంచి 40 అడుగులు
మకడమియ చెట్లు ఏ కాలంలో అయినా పచ్చగా ఉంటాయి. ఈ చెట్టు 2–12 మీటర్ల (7–40 అడుగులు) ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టుకు పొడవాటి పూల జడ మాదిరిగా పూలు పూచి, కాయలుగా మారతాయి. కాయలో ఒకటి లేదా రెండు గింజలు ఉంటాయి. పెద్ద సైజు కాబూలి శనగల గింజల్లాగా ఉంటాయి. కాయ పైన పెంకు చాలా గట్టిగా ఉంటుంది. ఏదైనా పదార్థం గట్టితనాన్ని కచ్చితంగా చెప్పాలంటే.. ‘విక్కర్స్‌ హార్డ్‌నెస్‌’ స్కోర్‌లో కొలుస్తారు. దీని స్కోరు 35.

దీన్ని తొలిగా వాణిజ్య స్థాయిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన హవాయిలో సాగు చేశారు. ఆస్ట్రేలియా నుంచి 1880వ దశకంలో మకడమియ విత్తనాలు తీసుకెళ్లి హవాయిలో సాగు ప్రారంభించారు. తర్వాత వందేళ్ల వరకు హవాయినే అత్యధిక సాగుదారు. 2010వ దశకం నుంచి సాగు చేస్తున్న దక్షిణాఫ్రికా ఇప్పుడు అత్యధిక ఉత్పత్తిదారుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సాగువుతున్న ఆస్ట్రేలియాకు చెందిన ఆహార పంట ఇదే!

రెండు వంగడాలు
మకడమియ చెట్టు జాతులు నాలుగు. ఇందులో రెండు రకాలను వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. మొదటిది మకడమియ ఇంటెగ్రిఫోలియ. దీని కాయ పెంకు నున్నగా ఉంటుంది. రెండోది మకడమియ టెట్రాఫిల్లా. దీని కాయ పైపెంకు గరుకుగా ఉంటుంది. దీనికి మరింత సువాసన ఉంటుంది. కొత్త చిగుళ్లు ఎర్రగా, ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. నాటిని నాలుగేళ్లలో కాపుకొస్తుంది. పొడవాటి కంకికి పూత పూస్తుంది. గెలలుగా కాయలు కాస్తాయి. 8 ఏళ్ల చెట్టు ఏటా 18 కేజీల కాయలు కాస్తుంది. కాయల బరువుకు కొమ్మలు విరిగే పరిస్తితి కూడా ఉంటుందట. అయితే, కాయల బరువులో పైన పెంకు బరువు 72.4% పోగా 27.6% తినదగిన గింజలు వస్తాయి.

దక్షిణాఫ్రియా సూటబుల్‌
ప్రస్తుతం మకడమియ నట్స్‌ సాగులో దక్షిణాఫ్రికాదే ఆధిపత్యం. ఆ దేశపు వాతావరణం, సారవంతమైన నేలలు, ఆధునిక పద్ధతుల్లో సాగుకు అధిక పెట్టుబడులు పెట్టడంతో దక్షిణాఫ్రికాలోని లింపొపొ, క్వాజులు–నటల్, పుమలంగ రాష్ట్రాల్లో సాగు మకడమియ సాగు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నట్స్‌కు డిమాండ్‌ కారణంగా పెద్ద కమతాల రైతులు ఆసక్తి చూపటంతో విస్తీర్ణం త్వరితగతిన పెరిగింది.  ప్రాసెసింగ్‌ సదుపాయాలు, ఎగుమతి వసతులకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం, చీడపీడలను తట్టుకునే నాణ్యమైన అధికోత్పత్తి వంగడాలను వాడటం దక్షిణాఫ్రికాకు కలిసి వచ్చింది. ప్రస్తుతం 60 వేల మెట్రిక్‌ టన్నుల మకడమియ కాయలను ఏటా ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచ మార్కెట్‌ సరఫరాలో ఇది 30%.  

ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌ ఈశాన్య ప్రాంతం, క్వీన్స్‌లాండ్‌ మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో ఆది నుంచి విస్తారంగా సాగువుతోంది. అందుకే దీనికి క్వీన్స్‌లాండ్‌ నట్, బుష్‌ నట్, మరూచి నట్, బాపిల్‌ నట్‌ అని కూడా పిలుస్తారు. అక్కడి ఆదివాసులకు ఇదొక ముఖ్య ఆహారం. యూరోపియన్లు ఆస్ట్రేలియాకు రాక మునుపు నుంచే వారు వీటిని తింటున్నారనటానికి ఆధారాలున్నాయని చెబుతారు. పొదలా పెరిగే చెట్టుకు కాచేది కాబట్టి బుష్‌ నట్‌ అన్నారు. ఆస్ట్రేలియా 45 వేల నుంచి 50 వేల మెట్రిక్‌ టన్నుల కాయలను ప్రతి ఏటా ఉత్పత్తి చేస్తోంది. పండించిన దాంట్లో నుంచి 70% వరకు జపాన్, అమెరికా, చైనాలకు ఎగుమతి చేస్తోంది.

మలావి
ఆఫ్రికా ఖండంలో వ్యవసాయ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మలావి. గత పదేళ్లలో మకడమియ సాగు ఈ దేశంలో బాగా విస్తరించింది. ఈ దేశపు వాతావరణం, సారవంతమైన భూములు అనుకూలిస్తున్నాయి. ప్రస్తుతం ఏటా 8 వేల నుంచి 10 వేల టన్నుల వరకు ఉత్పత్తి చేస్తోంది.

కెన్యా
మలావి మాదిరిగానే కెన్యా కూడా కాఫీ, తేయాకు పంటలకు బదులుగా మకడమియ సాగును ప్రోత్సహిస్తోంది. 6 వేల నుంచి 8 వేల మకడమియ నట్స్‌ను కెన్యా ఏటా పండిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రాసెసింగ్‌ సదుపాయాలను కూడా సమకూర్చుకుంది.

హవాయి
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భాగమైన హవాయి దేశంలోని మిగతా రాష్ట్రాలకు వందల మైళ్ల దూరంలో ఉండే ద్వీప రాష్ట్రం. ఈ ఒక్క రాష్ట్రంలోనే మకడమియ సాగవుతోంది. 20వ దశాబ్దంలో ఇదే అత్యధికంగా పండించింది. తర్వాత కాలంలో దక్షిణాఫ్రియా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం హవాయి ఏటా 5–6 వేల మెట్రిక్‌ టన్నులు పండిస్తోంది. 

250 కోట్ల డాలర్ల మార్కెట్‌
ప్రపంచవ్యాప్తంగా మకడమియ గింజలకున్న ప్రస్తుత మార్కెట్‌ విలువ 250 కోట్ల డాలర్లు. వచ్చే పదేళ్లలో చాలా పెరుగుతుందని చెబుతున్నారు. మకడమియ పోషక విలువల గురించి ఆరోగ్య స్పృహ గల వారిలో అవగాహన పెరుగుతుండటం.. మొక్కల నుంచి వచ్చే కొలెస్ట్రాల్‌ లేని ఆయిల్స్‌కు ఆదరణ పెరుగుతుండటం.. ఆసియా, యూరప్‌ దేశాల్లో స్పెషాలిటీ, గౌర్‌మెట్‌ స్నాక్‌ మార్కెట్లు విస్తరిస్తుండటం.. పోలాంట్‌ బేస్‌డ్‌ డెయిరీ ప్రత్యామ్నాయాలకు ఆదరణ పెరటంతో మకడమియ గింజలతో తయారుచేసే పాలకు ప్రజాదరణ రావటం.. వంటి కారణాల వల్ల మకడమియ వాణిజ్యపరంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

చ‌ద‌వండి: ఔష‌ధ మొక్క‌.. ఆరోగ్యానికి ర‌క్ష‌

కరువు ప్రాంతాల్లో సాగు చేసేటప్పుడు నీటి యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవటం, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల్లో మకడమియ సాగును విస్తరింపజేసే దశలో జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవటం, చిన్న–సన్నకారు రైతులకు సంబంధించి న్యాయబద్ధమైన వాణిజ్య ప్రయోజనాలు అందేలా చేయటం ద్వారా మకడమియ సాగును పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది.

కమ్మటి రుచి
మకడమియ గింజలకు ఇంత ప్రాచుర్యం రావటానికి కారణం అందులోని సుసంపన్నమైన పోషక విలువలతో పాటు వెన్న వంటి రూపం, రుచి, సువాసనతో గింజ రుచిగా ఉండటమే. ఈ గింజను కాయలో నుంచి వెలికితీసిన తర్వాత అలాగే తినొచ్చు లేదా వేపుకొని తినొచ్చు. చాక్లెట్లు, అనేక చిరుతిళ్లలో వాడుతున్నారు. 78% వరకు నూనె ఉంటుంది. వంటకు, సౌందర్య సాధనాల తయారీలో వాడుతున్నారు. డెయిరీ ఫ్రీ బటర్స్, స్ప్రెడ్స్‌ తయారీలో ఈ నూనె వాడుతున్నారు. మకడమియ ఆయిల్‌ను ప్రీమియం హెయిర్‌కేర్, స్కిన్‌కేర్, మసాజ్‌ ఉత్పత్తుల్లో వాడుతున్నారు. ఒమెగా 7 ఫ్యాటీ ఆసిడ్స్, మోయిశ్చరైజింగ్‌ ప్రోపర్టీస్‌ కారణంగా దీనికి ప్రాధాన్యం ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement