దున్నకుండానే మొక్కజొన్న, వేరుశనగ! తక్కువ శ్రమ.. ఖర్చు ఆదా

Sagubadi: Cultivate Maize Groundnut Double Wheel Marker Made It Easy - Sakshi

డబుల్‌ వీల్‌ మార్కర్‌ పరికరంతో జీరో టిల్లేజి పద్ధతిలో విత్తుకుంటున్న ఉత్తరాంధ్ర రైతులు

తక్కువ శ్రమతో పాటు సమయం, ఖర్చు ఆదా కావడం.. నెల రోజుల పంట కాలం కలిసి రావటంతో డబుల్‌ వీల్‌ మార్కర్‌కు ప్రాచుర్యం

మహిళా రైతులకు అనుకూలమైన ఆవిష్కరణ కావటం మరో విశేషం

దుక్కి దున్నకుండానే మొక్కజొన్న సాగు(జీరో టిల్లేజి) పద్ధతి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇటీవల చాలా ప్రాచుర్యం పొందింది. దీనికి ఏకైక కారణం డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ అందుబాటులోకి తెచ్చిన ‘డబుల్‌ వీల్‌ మార్క్‌ర్‌’ (రెండు చక్రాలతో రంధ్రాలు వేసే పరికరం). సార్వా(ఖరీఫ్‌)లో వరి సాగు చేసిన భూముల్లో దుక్కి దున్నకుండా ఈ పరికరంతో రైతులు సులభంగా నేలపై రంధ్రాలు చేసి విత్తనాలు వేసుకుంటున్నారు.

వరి కోసిన తర్వాత తక్కువ సమయంలోనే మొక్కజొన్న విత్తుకోవడానికి ఈ పరికరం రైతులకు ఎంతో ఉపయోగ పడుతోంది. నాలుగేళ్ల క్రితం ఈ పరికరం తొలుత అందుబాటులోకి వచ్చింది. సార్వా వరి తర్వాత మొక్కజొన్న పంటను వరుసగా మూడు దఫాలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న రైతులు ఉత్తరాంధ్రలో ఉన్నారు. వరుసల మధ్య దూరం తగ్గించుకునే చిన్న మార్పు చేసుకొని దుక్కిలేని పద్ధతిలో వేరుశెనగ విత్తుకోవడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషిస్తున్నారు. 

 మొక్కజొన్నతో పాటు వేరుశనగ
మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం, వరుసల మధ్య 60 సెం.మీ.ల దూరంలో డబుల్‌ వీల్‌ మార్కర్‌తో రంధ్రాలు చేసి దుక్కి చేయకుండానే మొక్కజొన్న విత్తుకోవచ్చు. అదేవిధంగా వేరుశనగ విత్తుకోవడానికి మార్కర్‌లో స్వల్ప మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం, వరుసల మధ్య 40 సెం.మీ.ల దూరంలో వేరుశనగ విత్తుకోవాలి. 

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గత రబీలో వరి కోసిన 48,146 ఎకరాల్లో దున్నకుండా డబుల్‌ వీల్‌ మార్కర్‌తో మొక్కజొన్నను సాగు చేశారు. 18 మండలాల్లో సుమారు 25 లక్షల వ్యంతో మండలానికి 40 చొప్పున 720 పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ తెలిపింది. ఈ పరికరాలన్నీ ఎల్‌. సత్యనారాయణ తయారు చేసి ఇచ్చినవే. 

సమాన దూరంలో విత్తనాలు నాటడం వలన గాలి, వెలుతురు ధారాళంగా సోకి, పంటలకు పురుగులు, తెగుళ్ల బెడద తక్కువగా ఉంది. చేను ఏపుగా పెరిగి సాధారణ పద్ధతిలో కంటే జీరోటిల్లేజ్‌ పద్ధతిలో మేలైన దిగుబడులు నమోదు అవుతుండటం విశేషం. మహిళలు ఉపయోగించడానికి డబుల్‌ వీల్‌ మార్క్‌ర్‌ అనువుగా ఉండటం మరో విశేషం. మహిళా రైతులకు, ముఖ్యంగా చిన్న, సన్నకారు ఒంటరి మహిళా రైతులకు ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగకరంగా ఉంది.  

నెల కాలం కలిసి వస్తుంది! 
తొలకరి వరి చేను కోసిన తరువాత పొలంలో వరి కొయ్యకాళ్లలో దుక్కి దున్నకుండానే పదును చూసుకుని డబుల్‌ వీల్‌ మార్కర్‌ను నడిపి మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో రైతులకు దుక్కి ఖర్చులు ఆదా అవ్వటమే కాకుండా నెల రోజుల పంట కాలం కలిసి వస్తుంది.

మొక్కజొన్న సాగు ప్రారంభమైన తొలినాళ్లలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో రైతులకు కొయ్యతో గాని, కొయ్యతో చేసిన పెగ్‌ మార్కర్‌ అనే పరికరంతో గాని వరి మాగాణిల్లో నేరుగా రంధ్రాలు చేసి మొక్క జొన్న విత్తనాలు విత్తేవారు. పెగ్‌ మార్కర్‌ పరికరాన్ని ఉపయోగించేటప్పుడు ఎక్కువ శ్రమ, ఎక్కువ సమయం వృథా అవుతుండేది. మగ కూలీలు మాత్రమే పెగ్‌ మార్కర్‌ను ఉపయోగించేవారు. 

2016 నుంచి ప్రయోగాలు 
కూలీల ఖర్చు, శ్రమ తగ్గించుకుంటూ మొక్కజొన్న, వేరుశెనగ పంటలను దుక్కి దున్నకుండా నేరుగా ఎలా విత్తుకోవాలనే అంశంపై డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి హరిబాబు (84999 28483) 2016 నుంచి అనేక ప్రయోగాలు చేసి ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. తొలుత ఒక చక్రం ఉన్న మార్కర్‌ను, తర్వాత ఐదు చక్రాల మార్క్‌ర్లను డిజైన్‌ చేసి రైతులకు అందించారు. వీటితో సరైన ఫలితాలు రాకపోవడంతో డబుల్‌ వీల్‌ మార్క్‌ర్‌ను డిజైన్‌ చేశారు.

ఇది రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో మంచి స్పందన వచ్చింది. ఆముదాలవలసలోని ఏరువాక కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనల మేరకు ఉక్కుతో రెండు చక్రాల మార్కర్‌ (డబుల్‌ వీల్‌ మార్కర్‌) పరికరం దిద్దుకుంది. 

తుది రూపుదిద్దిన సత్యనారాయణ
డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ రూపొందించిన డబుల్‌ వీల్‌ మార్కెర్‌కు రైతు లంకలపల్లి సత్యనారాయణ (83741 02313) మార్పులు చేసి బరువు తగ్గించి 2019లో తుది రూపుదిద్దారు. సత్యనారాయణ వ్యవసాయం చేస్తూనే వెల్డర్‌గా పనిచేస్తున్నారు. ఆ అనుభవంతో సులభంగా ఒక వ్యక్తి తన పొలానికి భుజాన వేసుకొని తీసుకుని వెళ్లేందుకు వీలుగా డబుల్‌ వీల్‌ మార్కర్‌ పరికరాన్ని మార్చారు.

మొదట తన పొలంలో ఉపయోగించి సంతృప్తి చెందిన తర్వాత, తానే తయారు చేసి రూ. 2,900కు ఇతర రైతులకు అందిస్తున్నారు. 2021 రబీ నాటికి రణస్థలం మండలంలో రైతులకు 85 డబుల్‌ వీల్‌ మార్కర్లను ఇచ్చారు. ఆ తర్వాత రైతుల్లో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది.
– గంగి నాగరాజు, సాక్షి, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top