సువార్త
యేసు పునరుత్థానుడైన తరువాత 40 రోజులు వరకు ఆయన సేవకులకు, శిష్యులకు, ప్రేమించిన వారికి దర్శనం ఇచ్చాడు. అనేక విషయాలు ప్రబోధించాడు, వాటిలో ప్రాముఖ్యంగా మీరు నన్ను ప్రేమించిన యెడల మీరు నా ఆజ్ఞలు గైకొనులాగున తండ్రిని వేడుకొనుచున్నాను, నేను వెళ్లుచున్నాను, నేను వెళ్లి మీ కొరకు ఆదరణ కర్తను పంపుతాను ఆ ఆదరణ కర్త మిమ్ములను సర్వసత్యంలోనూ, మంచి మార్గంలోనూ నడిపిస్తాడు. అప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ మార్గం ఏది? తండ్రి ఎవరని ప్రశ్నలు అడిగారు.
అందుకు యేసు నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవ్వరును దేవుని వద్దకు రాలేరన్నాడు. తండ్రి, నేను ఏకమై ఉన్నామన్నాడు. ఆదరణ కర్త ఎవరు సత్య స్వరూపి ఆయన ఆత్మయై ఉన్నాడు, కావున భయపడకండి అంటూ ధైర్యపరిచాడు.
నా తండ్రి ఇంట అనేక నివాసాలు, స్థలము ఉన్నవి నేను మిమ్ములను నాతో ఉండు లాగున తీసుకొని వెళ్తాను. ఆదరణకర్తను పంపుతాను అనగా పరిశుద్ధాత్మ ఆయన కూడా వ్యక్తి, శక్తి అనగా త్రిత్వదైవత్వం. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్ముడు వీరు ఒక్కరైనా ఏక దేవుడై ఉన్నారు. అని సందేశం ఇచ్చి వారిని బేతనీయ అనే ప్రాంతానికి తీసుకొని వెళ్లి వారిపై చేతులుంచి ఆశీర్వదించి పరమునకు ఆరోహణమయ్యాడు (పరి. యోహాను 14:1–30) , (లూకా 24: 50–51) పరలోకం అనగా నిత్యజీవముండే స్థలము (హెవెన్) భౌతిక శరీరం విడిచి మన ఆత్మ చేరే శాశ్వత ఆధ్యాత్మిక స్థలం. ఆరోహణమనగా పైకి వెళ్లడం, అది ఒక క్రీస్తుకే సాధ్యం. ఎందుకనగా పరిశుద్ధాత్మ మహిమ కన్యగర్భంలో ఏ విధంగా జన్మించాడో అదే రీతిన దేవునితో ఆరోహణమయి దేవునిలో లీనమయ్యాడు. కుడిపార్శా్వన కూర్చుని ఉన్నాడు. అంటే ఇది ఏఐ లాగున కాదు ఆ ప్రణవ నాదమైన పవిత్ర వాక్యం (పరి. యోహాను 1:1–2).
ఒకటి యేసు వారి ఆరోహణం, రెండు పరిశుద్ధాత్ముని పంపుతానన్న వాగ్దానాన్ని చూస్తున్నాం (పరి. యోహాను : 14:16). పరిశుద్ధాత్మ అనేది క్రైౖ స్తవ సంఘానికి ఊపిరి, ప్రాణం. పరిశుద్ధాత్మ తండ్రి (సృష్టికర్త), కుమారుడు (యేసుక్రీస్తుతో), సమానం. దీన్ని పరిశీలించగా ‘రువా’ హెబ్రూ పదం అనగా ఊపిరి, శ్వాస ఇది వీచే గాలిలోనూ, జీవించే మనుషుల్లోనూ ఉన్న దేవుని ఆత్మ, అందుకే ‘సామెతలు’ గ్రంథకర్త 20:27, ఈ విధంగా ప్రబోధించాడు. నరుని ఆత్మ యెహోవా (ప్రభువు) పెట్టిన దీపం. యెహోవా అనగా సర్వంతర్యామి, సర్వశక్తుడగు దేవుడు, పాత నిబంధన గ్రంథంలో ఈ విధంగా ఉన్నది.
దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాణి నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అనగా మన శ్వాస, నిశ్వాసలలో ఉన్న ఊపిరి ఆయనదే (దేవునిదే). మనలో నుండి ఆ శ్వాస ఎప్పుడు ఆగిపోతుంది అనగా మనం అబద్ధాలు, వ్యభిచారం, మద్యపానం, ధూమపానం మొదలగు వాటికి బానిసలై స్పృహ కోల్పోయినప్పుడు మరణించుతాం. దానినే పాపం వల్ల వచ్చు జీతం మరణం అని బైబిల్ చెబుతుంది, ఉదాహరణకు గొంగళి పురుగును చూడగా, దాన్ని మనుషులు అసహ్యించుకుంటారు కానీ అదే రూపాంతరం చెంది సీతాకోకచిలుకగా అయినప్పుడు ఆనందించుతాము, అలాగే పరిశుద్ధాత్ముని మనలోనికి ఆహ్వానిస్తే దురాత్మ దూరమైపోతుంది, అలాగే దురలవాట్లు గల వ్యక్తిని చూసినప్పుడు అసహ్యించుకుంటారు. పరిశుద్ధాత్మ అట్టి వారిలో ప్రవేశించితే ఆ వ్యక్తికి గౌరవమర్యాదలు ఇస్తారు కదా!
కావున పరిశుద్ధాత్మను కోరుకుందురు గాక, దేవుడిచ్చిన జీవాత్మను కాపాడుకుందాం ఇలాంటి సందేశం ఇచ్చి యేసు – మెస్సయ్యగా, ప్రభువుగా, క్రీస్తుగా చూస్తున్నారు.
ఈ సందేశం ఇచ్చిన ప్రభువును మనుషులలో దీపాలు వెలిగించును గాక, ప్రభువును అంతరంగంలోనికి రమ్మని ఆహ్వానిద్దాం, ఎందుకనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందుచేత దేవుని అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశించక నిత్యజీవం పొందుతారు, అందుచేత నిత్యజీవాన్ని కోరుకుందుముగాక! (పరి. యోహాను 3:16). – బి.బి. చంద్రపాల్ కోట


