
లొట్టలేసుకొని తింటున్న ప్రజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది
వరి పొలాల్లో, చెరువుల్లో పీతలు లభ్యం
పురుగు మందుల ప్రభావంతో తగ్గుతున్న పీతల సంతతి
బొమ్మనహళ్లి : కర్ణాటక జిల్లాలోని మడికెరి ప్రాంతంలో సీజనల్‌గా లభించే పీతలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పీతలతో కర్రీస్, వేపుళ్లు చేసుకొని ఆరగిస్తుంటారు. నిప్పులపై కాల్చడం, లేదా ఆవిరి ద్వారా పీతలను ఉడికించి రకరకాల వంటలు చేస్తారు.
ఆరోగ్యానికి ఎంతో మేలు
పీతలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎంతో శక్తిని ఇస్తాయి. ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, జింక్, ప్రొటీన్లకు మూలం. కొలస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో సహాయ పడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.భాస్వరం అధికంగా ఉన్నందువల్ల దంతాలు, ఎముకలు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. అందుకే పీతలకు విపరీతమైన డిమాండ్.
వర్షాలు కురిసినప్పుడే పీతలు లభ్యం
పది కాళ్ల పీతల్లో ఎన్నో రకాలు జాతులు ఉన్నాయి. మడికెరిలో లభించే పీతలు మంచి రుచితో ఉంటాయి. దీంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వర్షాలు కురిసినప్పుడు మాత్రమే ఈ పీతలు లభిస్తాయి. వేసవిలో ఎండిపోయిన చెరువులో ఎక్కడ దాక్కొని ఉంటాయో కాని తొలకరి జల్లులు ప్రారంభం కాగానే బురద మట్టిలో, చెరువుల్లో దర్శనం ఇస్తాయి. వీటిని పట్టుకునేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతారు. చేతికి ఒక పీత దొరికిందంటే చాలు పట్టలేని సంతోషం కలుగుతుంది.
చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం
జోరుగా పీతల విక్రయాలు
మడికెరిలో పీతల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ప్రాణంతో ఉన్న పీతలను పట్టి విక్రయిస్తారు. గతంలో పంట పొలాలు, బురద మడుల్లో, చిన్న చిన్న కాలుల్లో పీతలు లభించేవి. కానీ ప్రస్తుతం పీతలు లభించడం లేదని స్థానికులు అంటున్నారు. వరి పంటకు ఎక్కువగా పురుగు మందులు వినియోగిస్తుండటంతో పీతలు కనుమరుగు అవుతున్నాయి. రానురాను వాటి సంతతి తగ్గుతోంది. మడికేరిలోని కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండు సమీపంలో పీతల వ్యాపారం చేస్తున కుమార్ అనే వ్యక్తి మాట్లాడుతూ గతంలో మాదిరిగా పీతలు ఇప్పడు లభించడంలేదన్నాడు.
గతంలో వరిపొలాల్లో, బురద ఉన్నమడిలో, కాలువలో పీతలను పట్టి విక్రయించేవారమని, ప్రస్తుతం పంట పొలాలు లేవు, వరిమడులు లేవు ఆందులో పీతలుకూడా లేవన్నారు. ప్రస్తుతం పీతలను పట్టడానికి రోజూ 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందన్నాడు. సుమారు ఐదారుమంది గుంపుగా కలిసి పగలు రాత్రి కష్టపడి ప్రాణాలతో ఉన్న పీతలను పడుతామన్నారు. డిమాండ్ మేర పీతలు లభ్యం కావడం లేదన్నాడు.
ఇదీ చదవండి: జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్‌లుక్ వైరల్
కృత్రిమంగా పీతలను పెంచవచ్చు
పీతలను కృత్రిమంగా పెంచేందుకు అవకాశం ఉంది. ఇందుకు మత్స్యశాఖ సహకారం అందజేస్తుంది. అయితే కొడుగు జిల్లాలో కృత్రిమంగా పీతలు పెంచేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తమిళనాడు, కేరళలో ఎక్కువగా కృత్రిమ పద్ధతుల్లో పీతలు సాగు చేస్తున్నారు. వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. మడికెరిలో మాత్రం కృత్రిమంగా సాగు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
–సీ.ఎస్.సచిన్, మత్స్యశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్