
సామాజిక అభివృద్ధి, బాధ్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ‘సైకిల్ ఫర్ ఏ కాజ్’ పేరుతో రైడ్ నిర్వహించారు. రాడిసన్ హోటల్ గ్రూప్ సౌత్ ఆసియా చేపట్టిన ఈ ఈవెంట్‌లో 120 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. రాడిసన్ పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక అభివృద్ధికి, అవగాహనకు మద్దతివ్వడంలో భాగంగా నిర్వహించిన ఈ రైడ్‌లో సైక్లిస్టులు రైడ్ ఫర్ హోప్ (3 కి.మీ), రైడ్ ఫర్ చేంజ్ (6 కి.మీ), రైడ్ ఫర్ ఇంపాక్ట్ (50 కి.మీ) వంటి మూడు విభాగాల్లో పోటీపడ్డారు.
ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ సందీప్ జోషి మాట్లాడారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 60కి పైగా నగరాల్లో దీనిని నిర్వహించామన్నారు. ఈ సైక్లోథాన్ కేవలం సైక్లింగ్ మాత్రమే కాదు, సమాజంలో నిజమైన మార్పే దీని ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులు ఆతిథ్య రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని పేర్కొన్నారు.
నయనానందకరం అనుష్క నృత్యం
నాట్య గురువు ప్రమోద్‌రెడ్డి శిష్యురాలు చెరుకు అనుష్క భరతనాట్యం నయనానందకరమని ఐపీఎస్ అధికారి ఎం.రమేష్ అన్నారు. రవీంద్రభారతిలో అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అనుష్క అరంగేట్రం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లలకు సంస్కృతి, సంప్రదాయ నృత్యం పట్ల అవగాహన కల్పిచి శిక్షణ ఇప్పించాలని అన్నారు.
ఓ వైపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ, మరోవైపు సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పుష్పాంజలి, ఆనంద నర్తన గణపతి, వర్ణం, థిల్లాన, ప్రదోష సమయం వంటి అంశాలపై చక్కటి హావాభావాలతో సాగిన నృత్య ప్రదర్శన అహూతులను ఆకట్టుకుంది. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నాట్య గురువు అనుపమ కైలాష్, తల్లిదండ్రులు చెరుకు గోవర్ధన్‌రెడ్డి, అంజలి పాల్గొన్నారు.
(చదవండి: కాశీ నేపథ్యంలో.. 'కైలాసవాస శివ'..)