
నా భర్త చనిపోయిన తరువాత భార్యను కోల్పోయిన ఒకతన్ని రెండవ పెళ్లి చేసుకున్నాను. మొదటి భర్తతో నాకు పదేళ్ల పాప, ఏడేళ్ల బాబూ ఉన్నారు. నా రెండవ భర్తకు కూడా 12 సంవత్సరాల పాప ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు నా మొదటి భర్త ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు రెండవ భర్తకు సహజ సంతానంగా లేదా దత్తత సంతానం అయిపోతారా? నా మొదటి భర్త ఆస్తిలో నాకు, నా ఇద్దరు పిల్లలకు వాటా వస్తుందా? నా మొదటి భర్తకి వారసత్వపు ఆస్తితోపాటు – స్వార్జితం ద్వారా కూడా ఆస్తులు ఉన్నాయి. రెండవ భర్త ఆస్తిలో నా సంతానానికి హక్కు ఉంటుందా? నా మొదటి భర్త అమ్మగారు అంటే మా అత్తయ్యగారు బతికే ఉన్నారు. ఆవిడది కూడా మా మామయ్యగారితో రెండవ వివాహమే! కానీ ఆమెకి మొదటి భర్తతో పిల్లలు లేరు. రెండవ వివాహం చేసుకుంటే మొదటి భర్త ఆస్తిలో వాటా రాదు అని చట్టం ఉంది కాబట్టే ఆవిడకి కూడా తన మొదటి భర్త నుంచి ఆస్తి రాలేదని, నాకు కూడా అలాగే రాదని చెబుతోంది. అది నిజమేనా?
– ఒక సోదరి, ఖమ్మం జిల్లా
బహుశా మీ అత్తయ్యగారి మొదటి భర్త చనిపోయిన కాలంలో అది నిజం కావచ్చు. పూర్వం ’హిందూ వితంతు వివాహ చట్టం, 1856’ అని ఉండేది. అప్పట్లో అది చాలా విప్లవాత్మక చట్టం అయినప్పటికీ ఆ చట్టం ప్రకారం రెండవ పెళ్లి చేసుకున్న వితంతు మహిళకు మొదటి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండేది కాదు. కానీ ఈ చట్టం 1983లో రద్దు అయింది. ప్రస్తుత చట్టంలో వితంతు వివాహం/లేదా పునర్వివాహం చేసుకున్న స్త్రీకి మొదటి భర్త ఆస్తిపై ఉన్న హక్కులు తొలగిపోవు! అలా తొలగిస్తే అది రాజ్యాంగ స్పూర్తికే వ్యతిరేకం. కాబట్టి మీకు మాత్రం మీ మొదటి భర్త ఆస్తిలో ఒక భాగం వాటా ఉంటుంది.
ఇక మీ పిల్లల విషయానికి వస్తే... మీరు రెండవ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీ మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం రెండవ భర్తకు చెందరు. ఒకవేళ రెండవ భర్త నిజమైన తండ్రిగా వ్యవహరించాలి అని మీరు అనుకుంటే, మీరు మీ పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వవలసి వస్తుంది. అయితే దత్తత ఇచ్చేసిన తర్వాత సాధారణ పరిస్థితిలో అయితే దత్తత ఇవ్వబడ్డ పిల్లలకు వారి సహజ తల్లిదండ్రుల ఆస్తులలో (పూర్వీకుల ఆస్తిలోనైనా లేక స్వార్జితంలో అయినా) ఎటువంటి హక్కు ఉండదు. కానీ దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిలో మాత్రం దత్తపుత్రులకు/దత్త పుత్రికకు వారి సహజ సంతానంతో సమానంగా హక్కు ఉంటుంది. అంటే మీ రెండవ భర్తకి మీరు దత్తత ఇస్తే ఆయన తదనంతరం (వీలునామా రాయకుండా మరణిస్తే) ఆస్తిలో తన సొంత కూతురితో సమానంగా మీ పిల్లలకు కూడా చెరొక వాటా వస్తుంది.
దత్తత ఇచ్చే సమయానికి ఒకవేళ మీ మొదటి భర్త ఆస్తిలో పంపకాలు జరిగి మీ పిల్లలకి ఆ ఆస్తి ఇప్పటికే వచ్చి ఉన్నట్లయితే, వారిని దత్తత ఇచ్చేసినప్పటికీ కూడా వారి ఆస్తి వారి వద్దనే ఉంటుంది. అంటే మీరు ముందుగా మీ మొదటి భర్త నుండి సంక్రమించే ఆస్తిని పంచుకుని తర్వాత పిల్లల్ని దత్తత ఇస్తే పిల్లలకి నష్టం వుండదు. ఎందుకంటే మీ రెండవ భర్త తన ఆస్తిని తనకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మీ పిల్లలకి ఇవ్వకపోతే వారు చేయని తప్పుకి పిల్లలు బలయ్యే అవకాశం ఉంది కదా! ఈ విషయాలు అన్నింటిని మీ మొదటి భర్త తల్లిగారికి వివరించండి. ఒప్పుకోని పక్షంలో మీరు పార్టిషన్ సూట్ ద్వారా మీ హక్కును అలాగే మీ పిల్లల హక్కును కూడా కాపాడుకోవచ్చు. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే పైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కేసులలో పూర్తి పత్రాలతో, సమాచారంతో దగ్గరలోని లాయర్‌ని కలవడం అవసరం.