స్కూల్
ప్రస్తుతం స్కూల్ అని పిలువబడుతున్న ఈ పదాన్ని మొదట ఏమని పిలిచేవారో తెలుసా? అసలు ఈపదం ఎక్కడినుంచి వచ్చింది? ఎలా స్కూల్ గా మారింది? అనేదానిగురించి ఇప్పుడు తెలుసుకుందాం!
"స్కూల్" అనే పదాన్ని ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనుగొనలేదు. కొన్ని భాషల్లోని పదాలు వ్యక్తులు సృష్టించినవీ కూడా కావు. శతాబ్దాలపాటు ప్రజల వాడుకలో క్రమక్రమంగా రూపుదిద్దుకున్నాయి. అలాంటి పదాల్లో నేడు వాడుకలో ఉన్నది స్కూల్ అనే పదమొకటి.
నేడు ఆంగ్లంలో స్కూల్ (School) అనే పదం ప్రాచీన గ్రీకు పదమైన "స్కోలే"(scholē) నుంచి వచ్చింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? ఈ గ్రీకు పదానికి మొదట్లో విశ్రాంతి సమయం లేదా ఖాళీ సమయం అనే అర్థాలు ఉండేవి. ప్రజలు వారి పనులు ముగించుకున్నాక దొరికే ఖాళీ సమయంలో చర్చలు చేయడం, తత్వశాస్త్రం నేర్చుకోవడం, జ్ఞానం సంపాదించడం చేసేవారట. స్కోలే పదానికి "విద్యాభ్యాసం", "ఉపన్యాసాలు జరిగే స్థలం" అని అర్థాలు వచ్చేవి. కాలక్రమేనా గ్రీకులో స్కోలే, లాటిన్‌లో స్కోలా, పాత ఇంగ్లీష్ లో స్కోల్ గా మారి, చివరికి ఆధునిక ఇంగ్లీష్ లో స్కూల్ గా రూపాంతరం చెందింది. అంటే నేడు మనం "స్కూల్" అని పిలిచే పదానికి అసలు అర్థం "ఖాళీ సమయంలో జ్ఞానం సంపాదించే స్థలం" అన్నమాట!
ఈ స్కూల్ పదం తెలుగులో చూసుకున్నట్లయితే, పూర్వకాలంలో బడి అని పిలిచేవారు. బడి అనే పదానికి అర్థం చదువు చెప్పే స్థలం, పాఠశాల అనే అర్థం. ఇది ఇంగ్లీష్ స్కూల్ నుంచి వచ్చిన పదం అసలే కాదు. తెలుగు భాషలో చాలా కాలంగా వాడుకలో ఉన్న స్వదేశీ పదంగా భాషావేత్తల భావన. పూర్వకాలంలో గురువు తన ఇంటి వద్ద లేదా ఖాళీస్థలంలో పిల్లలకు అక్షరాలు, లెక్కలు నేర్పేవారట. ఆ చదువు జరిగే చోటును బడి అని పిలిచేవారు. ఇప్పటికీ ఈ పదం సహజంగా వాడుకలో కొనసాగుతుంది. అయితే అధికారిక పదం పాఠశాల. పాఠం అంటే.. చదువు, శాల అంటే.. ఇల్లు లేదా స్థలం అని అర్థం. ప్రజల నిత్య వాడుకలో ఉన్న స్వచ్ఛ తెలుగు పదం బడిగా ఉంటే, సంస్కృత మూలం ఉన్న అధికారిక పదం పాఠశాల.


