ఝార్సుగూడ: ఒడిశాలోని ఒక చిన్న పట్టణమైన ఝార్సుగూడ నుంచి దక్షిణ కొరియా సంగీత ప్రపంచం ‘కే-పాప్’ వరకు ఒక సాధారణ యువతి సాగించి ప్రస్థానం ఇప్పుడు చర్చనీయాంశంగా నిలిచింది. ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరంతర రియాలిటీ షోల తిరస్కరణలను దాటుకుని, ‘బ్లాక్‌స్వాన్’ అనే అంతర్జాతీయ కే-పాప్ బ్యాండ్‌లో సభ్యురాలిగా చేరిన శ్రీయా లెంకా.. భారతీయ ప్రతిభను ప్రపంచ వేదికపై చాటారు.
కన్నీటి కథలు లేని చోట గెలుపు లేదు
శ్రీయా తన కెరీర్ ఆరంభంలో దాదాపు 40 రియాలిటీ షోల ఆడిషన్స్‌లో పాల్గొని విఫలమయ్యారు. అప్పట్లో ఆమె గమనించిన చేదు నిజం ఏమిటంటే, అక్కడ ప్రతిభ కంటే కంటెస్టెంట్ల ‘స్ట్రగుల్ స్టోరీలకే’ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ‘నా ప్రతిభను నమ్ముకున్నాను తప్ప, సానుభూతి కోసం కష్టాలను చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు’ అని ఆమె తన తండ్రి అభిప్రాయంతో ఏకీభవించారు. ఈ తిరస్కరణలే ఆమెను మరింత దృఢంగా మార్చాయి.
ప్రయాణ ఖర్చులకే కటకటలాడిన కుటుంబం
ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన శ్రీయా, డ్యాన్స్ శిక్షణ కోసం తన తండ్రితో కలిసి ప్రతి వారం రూర్కెలా వెళ్లేవారు. బస్సు లేదా రైలు టికెట్లకు కూడా డబ్బులు లేని రోజుల్లో, తండ్రి అప్పుచేసి తనను తీసుకెళ్లేవారిని శ్రీయా గుర్తుచేసుకుంటారు. డ్యాన్స్ నేర్చుకోవాలనే తపనతో ఆమె పడిన కష్టం, ఆమెను కఠిన పరిస్థితులను తట్టుకునేలా తీర్చిదిద్దింది.
కఠిన శిక్షణ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
కోవిడ్ సమయంలో డ్యాన్స్ క్లాసులు మూతపడటంతో శ్రీయా నిరాశలో ఉన్నప్పుడు, తండ్రి ఆమెకు ధైర్యాన్నిచ్చారు. అదే సమయంలో వచ్చిన కే-పాప్ ఆడిషన్స్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పాయి. రోజుకు 8 గంటల వోకల్ ప్రాక్టీస్, 6 గంటల డ్యాన్స్ సాధనతో తన గదిని డ్యాన్స్ ఫ్లోర్‌గా, ఇంటి పైకప్పును స్టేజీగా మార్చుకున్నారు. 40 వేల మంది పోటీదారులను వెనక్కి నెట్టి, అంతర్జాతీయ వేదికపై స్థానం సంపాదించడం వెనుక ఆమె చూపిన అంకితభావం సామాన్యమైనది కాదు.
విజయపథంలో అడుగులు
కొరియా వెళ్లిన కొత్తలో భాష, అక్కడి సంస్కృతి, కఠినమైన డైట్ చార్ట్ శ్రీయాకు కొత్త సవాళ్లను విసిరాయి. ఉదయం 4 గంటలకే నిద్రలేచి, అర్థరాత్రి వరకు కఠిన శిక్షణలో పాల్గొనే ఆమె, నేడు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ పర్ఫార్మర్ ఒక్కో షోకి దాదాపు రూ. 6 లక్షల పారితోషికం అందుకుంటున్నారు. శ్రీయా లెంకా కథ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా కలలను నిజం చేసుకోవాలనుకునే యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: ‘షిగెల్లా’ మళ్లొచ్చింది.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్


