
ప్రపంచంలో మామిడిపండ్లకు చిరునామాగా సగర్వంగా నిలిచిన భారతదేశం, అనేకరకాల ప్రాదేశిక మామిడి పండ్లను కలిగి ఉంది. వీటిలో ప్రతీ మామిడి రకం తనదైన ప్రత్యేకమైన రుచి, సువాసన, సాంస్కృతిక నేపథ్యంతో ప్రసిద్ధి చెందింది. కానీ మార్కెట్ ఆధారిత వ్యవస్థ వల్ల వాణిజ్యపరంగా మొలకెత్తిన హైబ్రిడ్ రకాల ప్రభావంతో, ఈ విలువైన దేశీ మామిడి రకాలు క్రమంగా అదృశ్యం అవుతున్నాయి. ఇప్పటికే అన్ని చోట్లా లభించడం తగ్గిపోయిన ఈ మామిడి రకాలను ఈ వేసవి టూర్ల సందర్భంగా ఎక్కడైనా దొరికితే ఆస్వాదించడం మరచిపోవద్దు.
1. కరుప్పట్టి కాయ – తమిళనాడు
తమిళనాడు దక్షిణ ప్రాంతాల్లో పుట్టిన ఈ కరుప్పట్టి కాయ ప్రత్యేకత ఏమిటంటే, ఇది చక్కెర పాకం (పామ్ జాగరీ)ను తలపించే రుచిని కలిగి ఉంటుంది. ఈ మామిడి పచ్చిగా తినడానికి కూడా బాగుంటుంది. అలాగే పచ్చళ్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఆకుపచ్చ రంగు ఫైబర్‌తో నిండిన గుజ్జుతో ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.
2. కన్నిమాంగా – కేరళ
కేరళలో కన్నిమాంగా అనే చిన్న మామిడికాయలు పచ్చడికి ప్రసిద్ధి. ‘కన్నిమాంగా‘ అంటే ‘కన్య మామిడి‘, అంటే పూర్తి పక్వతకు ముందు కోయబడే కాయలు. ఈ రకాన్ని పచ్చడి రూపంలో వాడితే, కేరళ వంటకాల మసాలా రుచులకు ఇది సరిపోతుంది. అధిక దిగుబడి కలిగిన వాణిజ్య రకాల సాగు పెరిగిన నేపథ్యంలో, ఈ మామిడి మొక్కలు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. అయితే స్థానిక రైతులు గిరిజన సంఘాలు దీన్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
3. కల్భావి మావు – కర్ణాటక
కర్ణాటక తీరప్రాంతాలలో పుట్టిన కల్భావి మావు మామిడి, గులాబీ వాసన తీపి రుచితో కొత్తగా ఉంటుందనే పేరు సంపాదించింది. ఇది గోల్డెన్ యెల్లో రంగులో మధ్య పరిమాణంలో ఉంటుంది. అదనపు తీపి కలిగి ఉండడంతో నేరుగా తినడానికి మాత్రమే కాకుండా స్వీట్స్ తయారీలో కూడా వాడేవారు. ఇటీవలి వరకూ మార్కెట్లలో విరివిగా లభించిన ఈ రకం, క్రమంగా తగ్గిపోతోంది.
4. బటాషా – పశ్చిమ బెంగాల్
బెంగాల్‌కు చెందిన బటాషా మామిడి, బాగా తీయగా ఉంటుంది. ఇది చిన్న పరిమాణంలో ఉండి, రసం నిండిన గుజ్జుతో ఉంటుంది అయితే దీని మృదువైన తొక్క ఎక్కువ దూరాలకు తరలించలేనంత సున్నితంగా ఉండటంతో, ఈ మామిడి వాణిజ్యం పెద్దగా పుంజుకోలేదు. దాంతో దీని సాగు కూడా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఇది కేవలం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోంది.
5. అమ్మ చెట్టు – ఆంధ్రప్రదేశ్
ఈ మామిడి రకాన్ని అందించే చెట్టుకు తెలుగులో ‘‘అమ్మ చెట్టు’’ అనే పేరు, మామిడికి కూడా అదే పేరు. పెద్దదైన పరిమాణం, ఫైబర్‌తో నిండిన గుజ్జుతో ఉన్న ఈ మామిడి చెట్లు గ్రామీణ జీవన విధానంలో భాగంగా ఉండేవి. అయితే, ఈ చెట్ల నిర్వహణ కష్టం కావడంతో, ఈ రకం సాగు తగ్గిపోయింది. ఇక ఇది కేవలం కథల్లో, జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోనుంది.
అధిక దిగుబడి, హైబ్రిడ్ రకాలపై దృష్టి పెరగడంతో దేశీ రకాల మామిడి ప్రాధాన్యత తగ్గిపోయింది. అలాగే టెంక లేని పండ్లను ఇష్టపడే ఆధునిక వినియోగదారుల అభిరుచి వల్ల, స్వాభావికంగా పెరిగే దేశీ రకాల విస్త్రుతికి అడ్డంకి ఏర్పడింది. మరోవైపు నగరీకరణ విస్తరణ వల్ల తోటలపై భౌగోళిక ఒత్తిడి పెరిగింది. యువతలో దేశీరకాల గురించి అవగాహన లేకపోవడం కూడా సాగును దెబ్బతీసింది.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... కారణాలేవైనా మనదైన మామిడి వెరైటీలను మనం కోల్పోతుండడం దురదృష్టకర పరిణామమేనని చెప్పాలి.
(చదవండి: కల్తీ పుచ్చకాయను పసిగట్టొచ్చు ఇలా..!)