
ఇది మామిడి సీజన్ – ఎండల వేడితో పాటూ దక్కే తీపి రుచులు మామిడి పండ్లు. ఈ సీజన్‌లో మామిడి పండ్లు తింటాం కానీ.. తొక్క మాత్రం తీసి విసిరేస్తాం. కానీ మీకు తెలుసా? మామిడి తొక్క కూడా ఓ పోషకవంతమైన ఆహారం కావచ్చు. అవును – మామిడి తొక్క తినదగినదే, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి మంచిది కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు..
తొక్క తినడం సురక్షితమేనా?
సాంకేతికంగా చూస్తే, అవును. మామిడి తొక్క విషమేమీ కాదు. ఇది ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగిఫెరిన్, క్వెర్సిటిన్, కెరోటినాయిడ్లు వంటి బయోయాక్టివ్ పదార్థాలతో నిండివుంది. అయితే మామిడి తొక్క మందంగా, కొద్దిగా చేదుగా, కొన్నిసార్లు కొబ్బరి తరహాల ఉంటుంది. అందువల్ల చాలా మందికి నచ్చదు.అంతేకాదు కొంత మందికి మామిడి తొక్కలోని కొన్ని పదార్థాలు అలెర్జీ కలిగించొచ్చు మామిడిని తీసేటప్పుడు మురికితో పాటు చర్మంపై మంట వచ్చినట్లయితే, తొక్క తినకుండా ఉండటమే మంచిది.
తొక్కలో పోషకాలు...
ఇందులోని ఫైబర్: జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మాంగిఫెరిన్ వంటి పదార్థాలు శరీరంలో అలర్జీలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేసే కెరోటినాయిడ్లు, విటమిన్ ఇ చర్మాన్ని కాంతి వంతం చేస్తుంది. అలాగే కొన్ని పరిశోధనలు మామిడి తొక్క బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడవచ్చని చెబుతున్నాయి.
రుచికరంగా తినే విధాలు:
మామిడి తొక్క చట్నీ:
2 మామిడిల తొక్క (శుభ్రంగా కడగాలి)
ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి
అల్లం చిన్న ముక్క, తగినంత ఉప్పు,కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి.
ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో కొద్దిగా మిక్స్ చేయండి. కావాలంటే మస్టర్డ్ గింజలు, కరివేపాకు టాంపర్ చేయొచ్చు.
ఎండబెట్టి పొడి తయారు చేయడం:
మామిడి తొక్కని ఎండలో లేదా ఓవెన్ లో బాగా ఎండబెట్టి పొడి చేసి, స్మూతీల్లో లేదా మసాలా మిశ్రమాలలో కలుపుకోవచ్చు.
ఒక చిన్న ముక్క మామిడి తొక్క పండిన మామిడి, అరటిపండు, యోగర్ట్‌తో కలిపి మేళవిస్తే.. తీపి, చేదు మధ్య బ్యాలెన్స్ అవుతుంది.
తొక్కని తరిగి, నీళ్ళలో నానబెట్టి, కొన్ని రోజులు ఫెర్మెంటేషన్‌కు ఉంచండి. స్వచ్చమైన వెనిగర్ లాగా తయారవుతుంది. సలాడ్ డ్రెస్సింగ్‌కు బాగా సరిపోతుంది.
శుభ్రంగా కడిగిన మామిడి తొక్కని వేడి నీటిలో లేదా గ్రీన్ టీ లో వేసి మరిగించండి. హల్కా రుచి, యాంటీ ఆక్సిడెంట్ల తేలికపాటి పౌష్టికత మీకు లభిస్తుంది.
జాగ్రత్తలు...
పండే మామిడి తొక్కపై పురుగుమందుల శేషాలు ఉండొచ్చు. తొక్క తినాలంటే ఆర్గానిక్ మామిడిని మాత్రమే ఎంచుకోవాలి. అలా దొరకని పక్షంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అవేంటంటే..
నీళ్ళలో 1 టీస్పూన్ ఉప్పు, టీస్పూన్ పసుపు కలిపి 10–15 నిమిషాలు నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగడం ద్వారా కాయపై అలుముకున్న పెస్టిసైడ్స్ ఏవైనా ఉంటే తొలగించవచ్చు.
అలాగే ఒక బౌల్ నీటిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 15 నిమిషాలు నానబెట్టి, తరువాత మంచి నీటితో కడగడం
1:3 నిష్పత్తిలో వెనిగర్ : నీటిలో కలిపి 15–20 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగాలి.
అలాగే తినాలనుకుంటే మామిడి తొక్కని మృదువైన బ్రష్ లేదా గుడ్డతో సున్నితంగా తోమి శుభ్రం చేయాలి.
(చదవండి: Miss World 2025: మెక్సికన్ 'మే'నూ..! అందుబాటులో అంతర్జాతీయ వంటకాలు..)