
ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం సంవత్సరంలోని మొదటి నెల ‘ముహర్రం’ (Muharram 2025). ప్రతి సంవత్సరం ఈ నెల వస్తూనే ముహమ్మద్ ప్రవక్త(స) వారి జీవితంలోని ఓ ముఖ్యమైన ఘట్టం మనసులో మెదులుతుంది. అదే ‘హిజ్రత్’. (మక్కా నుండి మదీనాకు వలస). హిజ్రత్ తరువాతనే ధర్మానికి జవసత్వాలు చేకూరాయి, ధర్మం ఎల్లెడలా విస్తరించింది. ధర్మ పరిరక్షణ, మానవ సేవ, మానవులకు సత్యసందేశాన్ని అందించడం లాంటి మహత్తర ఆశయం కోసం కష్ట నష్టాలను సహించాల్సి వచ్చినా, చివరికి స్వదేశాన్ని విడిచి వలస వెళ్ళవలసి వచ్చినా వెనకాడకూడదనే విషయాన్ని ముహర్రం ప్రతి సంవత్సరం విశ్వాసులకు గుర్తుచేస్తూ ఉంటుంది.
ముహర్రం ఘనతకు సంబంధించి ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా అన్నారు. ‘ముహర్రం అల్లాహ్ నెల. రమజాన్ ఉపవాసాల తరువాత శ్రేష్టమైన ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలే’. (సహీహ్ ముస్లిం: 2755) ప్రవక్త మహనీయులు మదీనాకు వలస వెళ్ళిన తరువాత, అక్కడి యూదులు రోజా (ఉపవాసం) పాటించడం గమనించారు. అది ముహర్రం పదవ తేదీ. (యౌమె ఆషూరా ) అప్పుడు ప్రవక్త వారు, ’ఏమిటి ఈరోజు విశేషం?’ అని వారిని అడిగారు. దానికి వారు,’ ఇది చాలా గొప్పరోజు. ఈ రోజే దైవం మూసా ప్రవక్త(అ) ను, ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. ఫిరౌన్‌ను, అతడి సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. అప్పుడు మూసా ప్రవక్త, దైవానికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈ రోజు ఉపవాసం పాటిస్తాము’. అని చె΄్పారు. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం’ అని చెప్పి, మీరు రెండు రోజులు రోజా పాటించమని తన సహచరులకు బోధించారు. అంటే ముహర్రం మాసం 9,10 కాని, లేక 10,11 కాని రెండురోజులు రోజా పాటించాలి.
కాకతాళీయంగా ’కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ్ర΄ాముఖ్యత మరింతగా పెరిగి΄ోయింది. అంతమాత్రాన ముహర్రం నెలంతా విషాద దినాలుగా పరిగణించడం సరికాదు. ఎందుకంటే అమరత్వం అనేది మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమోగాని, విషాదం ఎంతమాత్రం కాదు. ‘కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి పోషించవలసిన పాత్రను హజ్రత్ ఇమామె హుసైన్ ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ప్రతియేటా ‘ముహర్రం ‘నెలలో ఆయన త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్మరించుకుంటారు. కనుక మొహర్రం నెల ప్రాముఖ్యం, హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం మామూలు విషయం కాదు. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాన్నుండి ప్రేరణ పొందాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు దాన్ని కాపాడుకోడానికి నడుం బిగించాలి. ఇదే ఇమామె హుసైన్ అమరత్వం మనకిస్తున్న సందేశం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
(జులై 6 ముహర్రం పండుగ సందర్బంగా)