
కేవలం 4 అంగుళాలే పెరిగే ‘మరుగుజ్జు వరి’
ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఇటలీ శాస్త్రవేత్తలు
వ్యోమగాములు స్వయంగా పండించుకోవచ్చు
రోదసీలోనూ, చంద్రుడిపైనా ఎక్కడైనా పండుతుంది
భూమ్మీద ఎడారుల్లో, ఇళ్లలోనూ సాగు చేసుకోవచ్చు
ఏ గ్రహంపైనైనా అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకొని పెరిగే అద్భుతమైన ‘అతి మరుగుజ్జు (సూపర్ డ్వార్ఫ్)’ వంగడం సిద్ధమైంది. రోదసీలోగానీ.. చంద్రుడు, అంగారకుడి మీదగానీ.. భూమిపైన ప్రత్యేక వాతావరణంలోనూ.. ఎడారుల్లో, ఇంట్లో కూడా ఇక వరి ధాన్యం పండించుకోవచ్చు. ఇటలీ అంతరిక్ష సంస్థ (ఐఎస్‌ఎ), మరో మూడు ఇటాలియన్ విశ్వవిద్యాలయాలతో కలిసి ఈ అద్భుత వరి వంగడాన్ని రూపొందించింది. చంద్రుడిపై మనుషుల దీర్ఘకాల మనుగడకు అవసరమైన విలక్షణ వరి వంగడాన్ని రూపొందించాలన్న లక్ష్యంతో ‘మూన్ రైస్’ పేరిట చేపట్టిన పరిశోధనా ప్రాజెక్టు విజయవంతమైంది.
2–3 అడుగులు ఎత్తు పెరిగే పొట్టి (డ్వార్ఫ్) వరి వంగడాలు మాత్రమే మనకు తెలుసు. అయితే, ఈ సరికొత్త రకం కేవలం 4 అంగుళాల (10 సెంటీమీటర్లు) ఎత్తు మాత్రమే పెరుగుతుంది. అదీకాకుండా, అధిక మాంసకృత్తులు గల ధాన్యాన్ని దిగుబడినిస్తుందట. అంతరిక్ష యాత్రల్లో పాల్గొనే వ్యోమగాములు ముందుగా వండి ప్యాక్ చేసిన ఆహారంపైనే ప్రస్తుతం ఆధారపడుతున్నారు. తాజా పదార్థాలు వారి ఆహారంలో ఉండే అవకాశం లేదు. సుదీర్ఘ కాలం అంతరిక్ష యాత్రలో గడిపే వ్యోమగాముల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందటం లేదు. భూగోళానికి మరింత ఎక్కువ దూరంలో రోదసీలో పరిశోధనలు చేపట్టాలంటే విటమిన్లు, పీచుపదార్థం అధికంగా ఉండే ఆహారాన్ని అక్కడే పండించాలి. మూన్ రైస్ పరిశోధనా ప్రాజెక్టు ఈ లక్ష్యంతోనే ప్రారంభమైంది. ఐఎస్‌ఏ మొక్కల జీవశాస్త్రవేత్త మార్తా డెల్ బియాంకో ఈ పరిశోధన వివరాలను ప్రకటించారు. బెల్జియంలో సుప్రసిద్ధ ‘సొసైటీ ఫర్ ఎక్స్‌పరిమెంటల్ బయాలజీ’ వార్షిక సమావేశంలో ఇటీవల ఆమె ప్రసంగించారు.
భూమ్మీద రైతులకూ ఉపయోగమే
మూన్ రైస్ ప్రాజెక్టు పరిశోధనలు అంతరిక్ష సేద్యానికి పనికొచ్చే విషయాలకు మించిన ప్రయోజనాలను అందిస్తోంది. ఇది భూమిపై ఉండే రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ‘అత్యంత సమస్యాత్మక అంతరిక్షంలో పెరగటానికి రూపొందుతున్న ఈ అతి మరుగుజ్జు వంగడం ఆర్కిటిక్, అంటార్కిటిక్ ధ్రువాలకు దగ్గరి ప్రాంతాల్లో లేదా ఎడారుల్లో లేదా తక్కువ స్థలం ఉండే ఇళ్లలో కూడా నియంత్రిత వాతావరణంలో సాగుకు కూడా ఉపయోగపడుతుంది’ అని డెల్ బియాంకో తెలిపారు. వరి మొక్కలు అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణకు ఎలా స్పందిస్తాయనే అంశంపై కూడా శాస్త్రవేత్తల బృందం పరిశోధిస్తోంది.
4 ఏళ్ల 9 నెలల పరిశోధన
వరి జన్యుశాస్త్రంలో పట్టున్న మిలన్ విశ్వవిద్యాలయం, పంట శరీర ధర్మశాస్త్రంలో ప్రత్యేక కృషిచేస్తున్న రోమ్ విశ్వవిద్యాలయం, అంతరిక్ష పంటలపై పరిశోధనలో ఆరితేరిన నేపుల్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలసి ఇటలీ అంతరిక్ష సంస్థ పరిశోధనలు చేస్తోంది. ‘నాలుగేళ్ల 9 నెలల క్రితం ప్రారంభించిన పరిశోధనల్లో చాలా పురోగతి ఉంది. మిలన్ విశ్వవిద్యాలయంలో కేవలం 10 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే ఉత్పరివర్తన చెందిన వరి రకాలపై పరిశోధనలు కొలిక్కివచ్చాయి. ఇది గొప్ప ప్రారంభ విజయం. పంట ఎదుగుదల, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మొక్కల నిర్మాణాన్ని మార్చగల జన్యువులను రోమ్ విశ్వవిద్యాలయం గుర్తించి మార్పులు చేసింది. ప్రాథమిక ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. అంతరిక్షంలో మాంసాన్ని పెంచలేం. అందుకని ప్రొటీన్ అధికంగా ఉండేలా ఈ వంగడాన్ని అభివృద్ధి చేస్తున్నాం’ అన్నారు డెల్ బియాంకో.
తాజా ఆహారం.. మానసిక ఆరోగ్యం!
తాజా ఆహారం శరీర పోషణకు మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. అంతరిక్షానికి తీసుకెళ్లిన ముందే వండిన ఆహారం కొంత కాలం బాగా నే ఉంటుంది. దీర్ఘకాలం దానిపై ఆధారపడటం సాధ్యం కాదు. అందువల్ల అక్కడే వ్యోమగాముల కళ్ల ముందు పెరిగే పంట వంగడాలను రూపొందించటం ద్వారా వారికి తాజా ఆహారంతో పాటు ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని కూడా అందించాల్సి ఉంటుంది. వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు జరిగే తప్పుల వల్ల ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టానికి కూడా దారితీయొచ్చు.
హార్మోన్ మార్పుతో..
‘మన దగ్గర ఇప్పటికి ఉన్న పొట్టి వంగడాలు అంతరిక్ష వ్యవసాయానికి ఉపయోగపడటం లేదు. ఇంకా తక్కువ ఎత్తు పెరిగే రకం కావాలి. వరి మొక్కలో ఎత్తును ప్రభావితం చేసే గిబ్బరెల్లిన్ అనే హార్మోన్‌లో మార్పు చేశాం. కానీ, అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తటం కూడా ఒక సవాలు. అక్కడ పెరిగే పంట మరీ తక్కువ ఎత్తు ఉండటం ఒక్కటే చాలదు.. మంచి ఉత్పాదకతను కూడా ఇవ్వగలగాలి. ఇలాంటి వంగడాన్ని తయారుచేయటం అనేక సవాళ్లతో కూడినది’ – మార్తా డెల్ బియాంకో, ఐఎస్‌ఏ మొక్కల జీవశాస్త్రవేత్త
సాక్షి, స్పెషల్ డెస్క్