
సాధారణ శిశువు ఆరోగ్యకరమైన బరువు 2.5 నుంచి 4.5 కిలోల మధ్య ఉంటుంది. అంతకు మించి ఉంటే అసాధారణ శిశువుగా పరిగణిస్తారు. కానీ ఈ బుడతడు పుట్టుకతో వైద్యులనూ, అమ్మనూ విస్తుపోయేలా చేశాడు. ప్రసూతి వార్డులోనే ఇంత పెద్ద శిశువు ఎప్పుడూ చూడలేదని వైద్యులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ శిశువుని చూసి ఆ తల్లి ఈ బిడ్డ నా బిడ్డేనా అనే సందేహం వ్యక్తం చేసేలా అతడి ఆకృతి సంభ్రమాశ్చర్యాలకు గరయ్యేలా చేసింది. ఇదంతా ఎక్కడంటే..
అమెరికాలోని టంపాకు దక్షిణంగా ఉండే ఫ్లోరిడాలో చేసుకుంది. 42 ఏళ్ల డానియెల్లా హైన్స్ అనే మహిళ సెప్టెంబర్ 03న భారీ మగ శిశవుకి జన్మనిచ్చింది. ఆ శిశువు బరువు దగ్గర దగ్గర ఏడు కేజీలు. అసాధారణ బరువుతో జన్మించి..పుట్టుకతో రికార్డు సృష్టించిన ఘనత దక్కించుకోవడమే కాదు పూర్తి ఆరోగ్యంతో ఉండటం విశేషం.
ఇలా పుట్టడం అనేది అత్యంత అసాధారణమైతే, ఆరోగ్యంగా ఉండటం అనేది కూడా అత్యంత అరుదు. డానియల్‌కు సీజేరియన్ ఆపరేషన్ చేసి ఆ శిశువుని బయటకు తీశారు. స్పృహ వచ్చాక తన బిడ్డను చూసి..ఇది తన బిడ్డేనా అని ఆశ్చర్యపోయింది. ఇంత పెద్దగానా..! అని నోరెళ్లబెట్టింది. అంతేగాదు ఆమె ప్రసూతి వార్డుకి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మరి ఆ బిడ్డను తిలకిస్తున్నారు. ఆహా పుట్టుకతో సెలబ్రిటీగా మారడమే కాదు, నన్ను కూడా ప్రత్యేకమైన తల్లిగా నిలబెట్టావురా కన్నా..! అంటూ సంబరపడిపోయింది ఆ తల్లి.
నిజంగా భగవంతుడు మాకు ఇంత పెద్ద ఆశీస్సులు అందించాడని ఊహించలేకపోయా అంటూ నాటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ సంగతులను వివరించింది డానియోల్లా. అలాగే ఆ శిశువు కూడా అత్యంత పొడవే. డానియెల్లా దంపతులు కూడా పొడుగ్గానే ఉంటారు. అయితే డానియెల్లా గర్భంతో ఉన్నప్పుడూ..మధుమేహంతో బాధపడింది.
శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల అసాధారణత వల్ల గర్భణీలకు ఇంత పెద్దగా శిశువులు పుట్టే అవకాశం ఉందని వైద్యులు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కూడా. అయినప్పటికీ ఇలా భారీ సైజులో శిశువు జన్మించడమే అందర్నీ విస్తుపోయేలా చేసింది. కాగా, ఇంతకుమునుపు ఈ రికార్డు బ్రెజిల్‌లో ఓ తల్లి ప్రసవించిన మగబిడ్డ పేరు మీద ఉండేదట.