అనుకుంది.. సాధించింది

Minister PK Sekar Babu sits for annadhanam with narikuravars - Sakshi

తమిళనాడు రాష్ట్రం, మామల్లపురం గ్రామంలో శుక్రవారం నాడు సామాజికహితమైన ఓ అద్భుతం ఆవిష్కారమైంది. ఆ ఊరి ఆలయంలో భోజన కార్యక్రమంలో ఆ రాష్ట్ర హెచ్‌ఆర్‌ అండ్‌ సీఈ (హిందూ రిలిజియస్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్స్‌) మంత్రి పీకే శేఖర్‌బాబు అత్యంత సామాన్యమైన మహిళ అశ్వినితో కలిసి భోజనం చేశారు. ఆమెతో కలిసి భోజనం చేయడానికి మంత్రి ఆ ఊరు వచ్చాడు. ఆ భోజన కార్యక్రమంలో అశ్విని ఒడిలో ఆమె కొడుకు కూడా ఉన్నాడు. ఈ అద్భుతమైన సంఘటనకు దారి తీసిన మరో విషాద సంఘటన కూడా ఇదే నెలలో ఓ రోజు జరిగింది.

ఆ రోజు ఏం జరిగిందంటే...
‘‘మధ్యాహ్నమైంది. ఆలయంలో అన్నదాన కార్యక్రమం మొదలైంది. మేము క్యూలో నిలబడి ఉన్నాం. టేబుల్‌ మీద అరిటాకులు పరిచారు. మా వంతు వచ్చే లోపు కుర్చీలు నిండిపోయాయి. ఒక పంక్తి పూర్తయిన తర్వాత రెండో విడత ఆకులు పరిచారు. ఆ పంక్తిలో మేము కూర్చున్నాం. అప్పుడు ఆలయానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని లేవమని చెప్పాడు. ‘అందరి భోజనాలు పూర్తయిన తర్వాత మిగిలిన అన్నాన్ని ఆలయం వెలుపల ఇస్తాం, బయట నిలబడండి’ అని చెప్పాడు’’ అని నాటి సంగతులను గుర్తు చేసుకుంది అశ్విని.

మీ ఇంటి పెళ్లి కాదు!
‘‘ఇది కనుక మీ ఇంట్లో పెళ్లి అయితే... మీ అందరి భోజనాలు పూర్తయిన తర్వాత మిగిలినవి ఇస్తారు. అప్పటి వరకు మేము దూరంగా నిలబడి ఎదురు చూస్తుంటాం. కానీ ఇది ప్రభుత్వం పేదవాళ్ల కోసం రూపొందించిన పథకం. మాకు స్థానం కల్పించడానికి అయిష్టత చూపిస్తున్న మీరంతా చదువుకున్న వాళ్లు. మేము చదువుకోని వాళ్లం. ఈ రోజు మేము నిరక్షరాస్యులమే. నా కొడుకును బాగా చదివిస్తాను. ఈ దారుణం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చూస్తాను’’ అన్నదామె ఆవేదనతో కూడిన ఆవేశంతో. ఆమె అలా మాట్లాడినప్పుడు ఆమె సామాజిక వర్గం మొత్తం ఆమె వెనుక ఉంది. ఆమె ధర్మాగ్రహానికి సమాజ ఆమోదం లభించింది. పలువురిని ఆలోచనలో పడేసింది. మరికొందరు ఆమెను బలపరిచారు.

నిశ్శబ్దంగా తగిలింది!
ఆ రోజు ఆమె మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో ఓ సంచలనం అయింది. వేగంగా చేరాల్సిన చోటుకి చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. సీఎం స్టాలిన్‌ ఆదేశాల మేరకు సంబంధిత శాఖ మంత్రితోపాటు కాంచీపూరం హెచ్‌ఆర్‌ అండ్‌ సీసీ జాయింట్‌ కమిషనర్‌ రంగంలో దిగారు. అశ్విని గురించి వాకబు చేసి ఆమె వివరాలు సేకరించి ఆమెను సంప్రదించారు. ఆ తర్వాత ‘ఇది ముఖ్యమంత్రి ఆదేశం’ అంటూ ఈ నెల 29వ తేదీ, శుక్రవారం నాడు అదే ఆలయంలో నరి కురువ సామాజిక వర్గానికి చెందిన వాళ్లతో కలిసి మంత్రి శేఖర్‌బాబు, తిరుపోరూర్‌ ఎమ్‌ఎల్‌ఏ ఎస్‌ఎస్‌ బాలాజీ, ఉన్నతాధికారి భోజనం చేశారు. అశ్విని తెగువను ప్రశంసిస్తూ ఆమెను ప్రభుత్వం తరఫున చీర సారెతో సత్కరించారు. ఆ సహపంక్తిలో పాల్గొన్న నరి కురువ సామాజిక వర్గంలోని అందరికీ చీర, ధోవతి పంచారు.
 
పేదవాళ్లకు ఆహార భద్రత కోసం తమిళనాడు ప్రభుత్వం 754 కోట్లతో అన్నదానం పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా రోజూ ఆలయ ప్రాంగణంలో అన్నం వండి పేదవారికి భోజనం పెడుతోంది. ఓ రోజు మామల్లపురంలోని స్థలశయన పెరుమాళ్‌ ఆలయంలో ఈ అవాంఛిత సంఘటన చోటుచేసుకుంది. నాటి సంఘటనకు ప్రతిస్పందన ఇది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top