‘ఇంట్లో బోర్ కొడితేబయట తినొచ్చు’ అనేవారు. ఇప్పుడు బయట తినడానికి దొరికేలా లేదు. కొన్నాళ్ల తర్వాత ఇంటి పరిస్థితీ తెలియదు. ఏమంటే యుద్ధం వల్ల గ్యాస్ లేదు. కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టవ్ దాటి గ్యాస్ వచ్చాక అది ఇంటి ఊపిరిగా మారింది. ఇప్పటి తరానికి తెలియదు గాని గ్యాస్ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి స్త్రీలకు.
‘వాళ్లు గ్యాస్ కొనుక్కున్నారట’...
1980లలో ఇది చిన్న ఊళ్లలో పెద్ద వార్త. గ్యాస్ కొనుక్కోవడం అంటే ఆడవాళ్లకు అతి పెద్ద రిలీఫ్ ఏమిటంటే– అది ఎప్పుడు పడితే అప్పుడు వెలుగుతుంది. వాన వచ్చినా, చలి ఉన్నా, అర్ధరాత్రయినా, తెల్లవారుజామున కానీ... ఎప్పుడైనా సరే... టప్.. వెలుగుతుంది. ఆడవాళ్లు ఈ వింతను చూడటానికి ఆ గ్యాస్ కొనుక్కున్న వారి ఇంటికి వెళ్లేవారు. అప్పటివరకూ వాళ్లకు కట్టెల పొయ్యి తెలుసు. కట్టెలు తెచ్చుకుని, పొయ్యిలో పెట్టుకుని, వాటిని కిరోసిన్ వేసి ముట్టించి, బాగా మండే వరకు ఆగి... ఆ తర్వాత ఊదుడు గొట్టంతో ఊది ఊది... ఇన్ని చేస్తే గాని వంట పూర్తి కాదు.
ఇక కిరోసిన్ స్టవ్ ఉంటుంది గానీ అందుకు కిరోసిన్ కావొద్దూ! వొత్తులు ఉండే స్టవ్‌ను వొత్తులు సరి చేసుకుని వెలిగించి మెల్లగా వంట మొదలెడితే ఎప్పటికో అవుతుంది. పంప్ స్టవ్ కొంచెం డేంజర్. ఇది మగవారికి సౌకర్యంగాని ఆడవాళ్లకు బెరుకే. బుజ్‌మని నీలిరంగు మంట వచ్చే ఈ స్టవ్‌లు ఆ రోజుల్లో పేలేవి. ఈ స్టవ్‌లు వాడాలంటే తరచు పిన్‌తో నొక్కి బర్నర్‌ను యాక్టివేట్ చేయాలి. అది మరో తలనొప్పి. అయినా సరే. పెద్ద టెన్షన్ ఉండేది కాదు. కట్టెలు దొరుకుతాయి. కిరోసిన్ కూడా బ్లాక్‌లో బాగానే దొరికేది. వంట చేయాలనుకోవాలేగాని చేయొచ్చు. ఆ సమయంలో ఇదిగో ఇలా గ్యాస్ ఊడిపడింది.
ఎన్నో అనుమానాలు
మొదట గ్యాస్ స్టవ్‌ను ఎవరూ నమ్మలేదు. సిలిండర్ పేలి చచ్చిపోతారని భయపడుతూ స్తోమత ఉన్నవారు కూడా కొనలేదు. గ్యాస్ మంట మీద వొండేది రుచిగా ఉండదని మరో అభి్ర పాయం. గ్యాస్ స్టవ్‌ను ఎలా తుడవాలి, ఎలా శుభ్రం చేయాలి తెలియదు. ఇక రెగ్యులేటర్‌ది పెద్ద అవస్థ. అది బిగించడం తీయడం తెలియదు. రెగ్యులేటర్ ఆన్ ఆఫ్ బటన్‌తో కూడా భయం ఉండేది. ఇక గ్యాస్ లీక్ కావడం గురించి గగ్గోలు ఉండేది. గ్యాస్ వాసన వస్తే భయపడిపోయేవారు. ఇవన్నీ ఇలా ఉండగా గ్యాస్ డీలర్లు గ్యాస్ కొనమని ప్రచారం చేసేవారు. ఆ ఎర్రరంగు సిలిండర్ ఇంటిలోకి అడుగుపెట్టింది.
సిలిండర్ వొచ్చిందా
సింగిల్ సిలిండర్‌లే చాలా ఇళ్లలో. డబుల్ సిలిండర్ ఏ కొద్దిమంది దగ్గరో ఉండేది. సిలిండర్ అవుతూ ఉండగా గ్యాస్ బుక్ చేస్తే అయిపోయిన ఎన్నో రోజులకు అది వచ్చేది. అంతవరకు మళ్లీ రకరకాల పద్ధతుల్లో వంట సాగేది. ‘గ్యాస్ దొరకడం లేదట’ అనే వార్త అప్పటినుంచి ఇప్పటి వరకూ స్త్రీలను హైరానా పెడుతూనే ఉంది. గ్యాస్ అయిపోవడం కూడా గమ్మత్తుగా జరుగుతుంది. అదెప్పుడూ తీరుబడిగా ఉన్నప్పుడు అయిపోదు. ఉదయాన్నే అందరూ హడావిడిగా బయలుదేరుతూ వంట చేసుకుని టిఫిన్లు కట్టుకుంటూ ఉండగా అయిపోతుంది. ఆ క్షణంలో ఇంట్లో రేగే కలకలం శత్రుదేశాల సరిహద్దుల వద్ద కూడా ఉండదు.
కాస్త సిలిండర్ ఇస్తారా
సిలిండర్ చేతుల్లోకి కుటుంబాలు వెళ్లాక ఇరుగు పొరుగు మధ్య గ్యాస్ స్నేహం ఏర్పడింది. వీరు ‘సిలిండర్ ఇచ్చేవారు’ ‘సిలిండర్ ఇవ్వనివారు’గా విభజితం అయ్యాయి. మనకు సిలిండర్ ఇచ్చేవారే క్లోజ్‌ఫ్రెండ్సు. గ్యాస్ ఎప్పుడైపోతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఇలాంటి స్నేహం ఒక్కటైనా లేకపోతే మనుగడ కష్టమైపోతుంది. గతంలో పోస్టుమ్యాన్ వస్తే జనానికి ఆనందం ఉండేది. ఇప్పుడు గ్యాసు బండి వీధిలోకి వస్తే సంతోషం కలుగుతోంది. బంగారం ధర, గ్యాస్ ధర... ఇవే సగటు మధ్యతరగతి మహిళకు మోదం ఖేదం కలిగించే విషయాలుగా మారాయి. 1980లలో 40 రూ పాయలున్న సిలిండర్ నేడు 930కి చేరింది.


