పోలీసులకే చుక్కలు చూపించిన పుర్రె కేసు..ఆగంతకుడెవరో తెలిసినా..

Linda Sherman Missing Case Suddenly Unsolved Murder Case - Sakshi

విచక్షణ లేని ఆధిపత్యం.. తట్టుకోలేనంత క్రోధం.. దానికి మించిన స్వార్థం.. పశ్చాత్తాపమే లేని మనస్తత్వం.. మానవత్వం సిగ్గు పడటానికి ఇంతకన్నా అవలక్షణాలేముంటాయి? కానీ.. అవన్నీ కూడదీసుకుని చరిత్రలో ఒకడు ప్యాంటూ షర్టు వేసుకుని దర్జాగా తిరిగాడు. ఓ అమాయకురాలి జీవితాన్ని నేటికీ మిస్టరీగా మిగిల్చాడు.

అది 1990 జూన్‌ 28 మధ్యాహ్నం రెండు కావస్తోంది. అమెరికా, మిస్సోరీలో బ్రిడ్జ్‌టన్‌ లోని కాసా గలార్డో రెస్టారెంట్‌.. కస్టమర్స్‌తో కిటకిటలాడుతోంది. కిటికీ పక్కనే కూర్చుని భోజనం చేస్తున్న ఇద్దరు ఫ్లైట్‌ అటెండంట్స్‌కి ఉన్నట్టుండి, కిటికీ బయట ఏదో అలికిడి వినిపించింది. తిరిగి చూస్తే ఆ పొదల మాటున ఓ పుర్రె స్పష్టంగా కనిపింంది. కావాలనే ఎవరో దాన్ని అక్కడ పెట్టి తప్పుకున్నారు. దగ్గరకెళ్లి చూసేసరికి ఆ చుట్టుపక్కల మనుషులెవ్వరూ లేరు. ఊహించని ఆ క్రైమ్‌ సీన్‌.. అక్కడున్న వారందరినీ వణికింంది. రంగంలోకి దిగిన విచారణ అధికారులు.. పుర్రెను స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలకు పంపించారు. ఆ పరిశీలనలో పుర్రె ఓ మహిళదని తేలింది.

అయితే కొన్ని రోజుల క్రితమే ఆ ప్రాంతంలోని శ్మశానవాటికను ఒక చోటి నుం మరోచోటికి మార్చారు. చాలా సమాధులను తరలించారు. ఆ సమయంలో బయటపడిన పుర్రెను ఎవరో ఆకతాయిలు కావాలనే జనాల మధ్య పెట్టి భయపెట్టి ఉంటారనే అంచనాకొచ్చారు. దాంతో ఆ పుర్రెను బ్రిడ్జ్‌టన్‌ మార్చురీకి పంపించేశారు. సరిగ్గా పద్నాలుగు నెలల తర్వాత (1991 సెప్టెంబర్‌ 6న) పుర్రె దొరికిన రెస్టారెంట్‌కి 25 మైళ్లదూరంలో ఉన్న వినిటా పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌కి.. తెరిచి ఉన్న ఓ ఎన్వలప్‌ లెటర్‌ వచ్చింది. దానిలో ‘బ్రిడ్జ్‌టన్‌ పోలీసులకు రెస్టారెంట్‌ బయట దొరికిన పుర్రె లిండా షెర్మాన్‌ అనే మహిళది’ అని టైపింగ్‌ అక్షరాలతో ఉంది. అది చూడగానే ఆ అధికారులు షాకయ్యారు.

వెంటనే బ్రిడ్జ్‌టన్‌ పోలీసులను అలర్ట్‌ చేశారు. దాంతో ఆ పుర్రెను పరీక్షలకు పంపించారు. అన్ని నెలలుగా ఆ పుర్రెపై ఎలాంటి సీల్‌ లేకపోవడంతో దానిపై ఏ వేలి ముద్రలు దొరకలేదు. వైద్య పరీక్షల్లో డీఎన్‌ఏ తేలలేదు. చివరికి దంత పరీక్షల్లో.. ఆ పుర్రె నిజంగానే ఆరేళ్ల క్రితం (1985 ఏప్రిల్‌ 22న) మిస్సయిన లిండా షెర్మాన్‌దేనని రుజువైంది. దాంతో ఒక్కసారిగా ఈ కేసు సంచలనమైపోయింది. పత్రికల మొదటి పేజీ వార్తగా వరింది. పాత ఫైల్స్‌ తిరగేస్తే.. వినిటా పోలీస్‌ స్టేషన్‌లో లిండాకి సంబంధించిన కేసులు చాలానే బయటికి వచ్చాయి. అప్పటికి ఆరేళ్ల క్రితమే మిస్సోరీలోని సెయింట్‌ లూయీలో గవర్నమెంట్‌ రికార్డ్స్‌ సెంటర్‌లో పనిచేసే లిండా.. తన 27 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయినట్లు రికార్డ్స్‌లో ఉంది. వినిటా పార్క్‌లోని సెయింట్‌ లయీ శివారులో పుట్టి పెరిగిన లిండా.. పదహారేళ్ల వయసులో తన సీనియర్‌ విద్యార్థి డోనాల్డ్‌ డాన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాదికే వారికి ఒక పాప కూడా పుట్టింది.

ఆ పాపకి ప్రేమగా ప్యాట్రీషియామేరీ అని పేరు పెట్టుకున్నారు. పాప పుట్టిన తర్వాత కూడా లిండా చదువు కొనసాగించింది. అయితే వారి సంతోషాలకు ఆర్థిక కష్టాలు శాపంగా మారాయి. ఇద్దరూ ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. షిఫ్ట్‌ టైమింగ్స్, చాలీచాలని ఆదాయం వారి బంధాన్ని మరింత దెబ్బతీశాయి. రెండు మూడేళ్లకే కేసులు, విడాకులు అనుకుంటూ వైవాహిక జీవితం ఛిద్రమైంది. చాలాసార్లు పోలీస్‌ స్టేషన్లకు, కోర్టులకు తిరిగిన ఆ భార్యభర్తలు.. కొన్నిసార్లు రాజీపడి కలసి బతకడానికి ప్రయత్నించారు. గొడవ జరిగిన ప్రతిసారీ లిండా.. తన కూతురు మేరీని తీసుకుని దగ్గర్లోని పుట్టింటికి వెళ్లిపోయేది. రాజీ కుదరగానే తిరిగి భర్త దగ్గరకు వచ్చేది.

డాన్‌.. లిండాపై చాలా పొసెసివ్‌గా ఉండేవాడు. అది కాస్తా అనుమానంగా మారిపోయింది. ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చినా భరించేవాడు కాదు. వేరే మగవాళ్లతో మాట్లాడితే సహించేవాడు కాదు. ఎదురు తిరిగితే కొట్టేవాడు. ఏప్రిల్‌ 1985 నాటికి డాన్‌ పెట్టే బాధలు భరించలేక అతడికి వ్యతిరేకంగా.. రిస్టెయినింగ్‌ ఆర్డర్‌ (గృహ హింస, రక్షణా ఉత్తర్వులు) తెచ్చుకుంది. అయినా డాన్‌ మారలేదు. దాంతో తన తొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి శాశ్వతంగా ముగింపు చెప్పాలని నిర్ణయించుకుని.. ఆ విషయాలన్ని తన కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో పంచుకుంది. అయితే ఆమెకి బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని.. అతడితో ఆమెకి వివాహేతర సంబంధం ఉందని డాన్‌ నమ్మేవాడు. పంచాయతీకి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ అదే వాదనకు దిగేవాడు. ఉన్నట్టుండి అదే ఏడాది, ఏప్రిల్‌ 22 తర్వాత లిండా ఎవరికీ కనిపించలేదు.

ఈ కథ మొత్తం తిరగదోడిన పోలీసులు.. వెంటనే డాన్‌ని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ‘లిండా మరణంతో నాకెలాంటి సంబంధం లేదు. ఆరేళ్లక్రితమే నా భార్య.. తన బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయింది. వాళ్లిద్దరూ సహోద్యోగులని నా అనుమానం. వాడే ఆమెను చంపి ఉంటాడు’ ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా ప్రశ్నింనా ఇదే సమాధానం ఇచ్చాడు డాన్‌. దాంతో పోలీసులు లిండా.. చివరి రోజు ఎక్కడికి వెళ్లింది? ఏం జరిగింది? లాంటి వివరాలు సేకరించడంలో బిజీ అయ్యారు. ఏప్రిల్‌ 22 తెల్లవారు జామున 2:16కి తన ఆఫీస్‌ నుంచిబయలుదేరిందని తేలడంతో లిండా కూతురు మేరీని విచారించారు. ‘ఆ రోజు నిద్రపోతుంటే మమ్మీ, డాడీల గొడవ వినిపింంది. మరునాడు నేను లేచేసరికి మమ్మీ సోఫాలో అటు తిరిగి పడుకుని ఉంది. రోజూ నన్ను స్కూల్‌కి తీసుకుని వెళ్లే మమ్మీ ఆ రోజు ఇంకా లేవకపోవడం ఆశ్చర్యంగా అనిపింంది.

ఆ రోజు డాడీనే నన్ను స్కూల్‌కి తీసుకెళ్లారు. కనీసం నాకు బై చెప్పడానికి కూడా మమ్మీ నిద్ర లేవలేదు. నేను మమ్మీని చూడటం అదే చివరిసారి’ అని చెప్పింది మేరీ. దాంతో ఆ రాత్రి ఏం గొడవ పడ్డారు? అని డాన్‌ను మరోసారి విచారణలో కూర్చోబెట్టారు పోలీసులు. ‘ఇంటికి రావడానికి అంత ఆలస్యం ఎందుకు అయిందని గొడవ పడ్డాను. మేరీని స్కల్‌లో డ్రాప్‌ చేసి, నేను ఆఫీస్‌కి వెళ్లిపోయాను. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి.. లిండా ఇంట్లో హడావుడిగా పనులు చేసుకుంటోంది. సాయంత్రం 6 గంటలకు కారులో ఇంటి నుం బయలుదేరడం చూశాను. మళ్లీ రాలేదు. ఆఫీస్‌లో ఆరా తీస్తే అసలు ఆఫీస్‌కే రాలేదన్నారు. గతంలోలానే తాత్కాలికంగా నాకు దూరంగా వెళ్లి ఉంటుందని సరిపెట్టుకున్నాను. ఇంట్లో వెతికితే తన బ్యాగ్, ఇతర ముఖ్యమైన వస్తువులు కనిపించలేదు. అదే విషయాన్ని లిండా కుటుంబానికి చెప్పి.. మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చాను’ అని చెప్పాడు.

డాన్‌. లిండా కనిపించకుండా పోయిన కొన్ని రోజులకే ఆమె కారు.. ఓ స్థానిక విమానాశ్రయంలో దొరికింది. అందులో ఆమె వస్తువులన్నీ భద్రంగానే ఉన్నాయి. ఏప్రిల్‌ 24 నుంచి ఆ కారును అక్కడ చూశామని సెక్యూరిటీ చెప్పారు. అయితే ఆమె పేరు మీద ఏ ఫ్లైట్‌ టికెట్‌ న మోదు కాలేదు. కొన్ని రోజులకు ఆమె.. వేరే వ్యక్తి కారులో వెళ్లడం చూశానని డాన్‌ ఆరోపించాడు. గలార్డో రెస్టారెంట్‌కి డాన్‌ రెగ్యులర్‌గా వెళ్తుండేవాడట. అది అతడి ఫేవరెట్‌ ప్లేస్‌ అని అతడి సన్నిహితులు కొందరు బయటపెట్టారు. ‘పుర్రె దొరికిన రోజు సాయంత్రం అదే రెస్టారెంట్‌లో ఉన్నాను. అదేరోజు పుర్రె కలకలం గురించి నేనూ విన్నాను. అయితే ఆ రోజు.. అది నా భార్య లిండా పుర్రె అని నాకు తెలియలేదు’ అని పోలీసులకు చెప్పుకొచ్చాడు డాన్‌.

ఇక్కడే మరో ట్విస్ట్‌ ఉంది.1989లో డాన్‌.. లిండాతో విడాకులకు అప్లై చేసుకున్నప్పుడు.. లిండా అదృశ్యంపై సరైన ఆధారం లేకపోవడంతో విడాకులు ఇవ్వకుండా ఆ కేసును కొట్టేసింది కోర్టు. సరిగ్గా ఏడాదికి లిండా పుర్రె బయటపడింది. అంటే హంతకుడు కచ్చితంగా డాన్‌ అయ్యి ఉంటాడని కొందరు అధికారులు నమ్మారు. ‘పుర్రె బయటపెట్టడంతో పాటూ.. అది లిండా పుర్రె అని అజ్ఞాత లేఖ రాశారంటే.. ఆమె చావు ప్రపంచానికి నిర్ధారణ కావాలి. ఆ అవసరం ఒక్క డాన్‌కి మాత్రమే ఉంది. అతడికి విడాకులు కావాలన్నా.. రెండో పెళ్లి చేసుకోవాలన్నా.. లిండా లేదు, ఇక తిరిగి రాదు అనే క్లారిటీ కోర్టుకు రావాలి. నిజానికి డాన్‌ ఆ రోజు తెల్లవారు జామునే గొడవ సమయంలో లిండాను చంపేసి.. కూతురుకి తెలియకుండా జాగ్రత్తపడి ఉంటాడు.

ఆ తర్వాత లిండాను ఎక్కడో పాతిపెట్టి ఉంటాడు. విడాకులు రాకపోయేసరికి పుర్రె బయటపడేలా చేసి, అజ్ఞాత లేఖ రాసి.. ఈ కథను నడిపించి ఉంటాడని వారు భావించారు. అదే వాదనను లిండా కుటుంబం కూడా నమ్మింది. కానీ దేనికీ ఆధారం లేదు. ఈ వాదనను బలపరిచేలా నిజంగానే డాన్‌ 1994లో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. డాన్‌ చెప్పినట్లు.. ఇంటి నుంచి లిండా కారులో వెళ్లడం.. మరో వ్యక్తి కారులో తిరగడం.. ఏ ఒక్కరూ చూడలేదు. మరోవైపు 1999లో లిండా పుర్రెను పరిశీలింన ఆర్కియాలజిస్టులు.. అది ఆల్‌రెడీ భూమిలో ఖననం చేసిన పుర్రె అని, దానిపైనున్న మట్టి నమూనాలను సేకరించి.. మిస్సోరీలో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. మిగిలిన శరీర భాగాల కోసం చాలా చోట్ల తవ్వి, తనిఖీలు చేశారు.

కుటుంబంలోనూ నేర చరిత్ర
కానీ ఎక్కడా లిండా అవశేషాలు దొరకలేదు. కొన్నేళ్లకు డాన్‌ మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌ ఒకామె పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి.. ‘డాన్‌.. తన భార్య లిండాను చంపానని నా ముందు ఒప్పుకున్నాడు’ అని చెప్పింది. కానీ, ఆధారాలేమీ చూపించలేకపోయింది. ఇక 2015 మే 7న ఇల్లినాయిలోని మౌంట్‌ వెర్నాయాలో ‘గుడ్‌ సమారిటన్‌ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం’లో డాన్‌ తన 58వ ఏట అనారోగ్యంతో మృతి చెందాడు.

అయితే అతడి కూతురు మేరీ.. అతడిని చివరి చూపు చూడటానికి కూడా వెళ్లలేదు. 1974లో డాన్‌ తండ్రి చార్లెస్‌ను ఎవరో అతడి ఇంట్లోనే గన్‌తో కాల్చి చంపేశారు. హంతకులు తేలకపోయినా, కుటుంబీకులే అనుమానితులయ్యారు. కొన్నాళ్లకు డాన్‌ తల్లి ఆడ్రీ.. ఒక హత్య కేసులో నేరస్థురాలిగా.. జైలుకి కూడా వెళ్లింది. ఏది ఏమైనా డాన్‌.. లిండాను చంపేశాడనే దానికి సరైన ఆధారం లేక.. ఆమె మిగిలిన బాడీ ఎక్కడ ఖననమైందో తెలియక.. ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.  

-సంహిత నిమ్మన

(చదవండి: ఇప్పటికీ అంతు తేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ.. అడవిలో ఏం జరిగింది?)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top