
విదేశాలకు వెళ్లచ్చు గృహహింస చేశానంటూ ఈమధ్య నాపై సెక్షన్ 85 బి.ఎన్.ఎస్ కింద కేసు నమోదు అయింది. పోలీసులు నన్ను పిలిచి సెక్షన్ 35 బీ. ఎన్.ఎస్.ఎస్ నోటీసు ఇచ్చారు. ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళవలసి వస్తుంది. నేను మా ఆఫీస్‌లో వీసా ప్రాసెస్ చేసి ఉంది. అయితే పెండింగ్ కేసు ఉంటే.. ఎయిర్‌పోర్టులోనే నన్ను ఆపేస్తారు అని కొందరు చెప్తున్నారు. నిజమేనా? ఒకవేళ అలా చేస్తే పరిష్కారం ఏమిటి?
– విజయ్ కుమార్, వరంగల్
క్రిమినల్ కేసులు ఉన్నంత మాత్రాన విదేశాలకు వెళ్లకూడదు అని ఎక్కడా లేదు. అలా అనుకుంటే చాలామంది విదేశాలలో పనిచేసే వారిపై 498– ఎ(సెక్షన్ 85 బి. ఎన్.ఎస్) కేసులు సాధారణం అయిపోయాయి. వారందరూ వెళ్లగలిగేవారు కాదు, వెళ్తే ఉండగలిగే వారు కాదు. ప్రత్యేకించి మిమ్మల్ని ఏదైనా కేసులో కోర్టు ఆదేశిస్తే మాత్రమే దేశం వదిలి వెళ్లకూడదు. మీకు సరైన పాస్‌పోర్ట్ – వీసా ఉండి, ఎటువంటి కోర్టు ఆదేశాలు లేకుంటే నిరభ్యంతరంగా విదేశాలకు వెళ్లవచ్చు.
అయితే కోర్టు వాయిదా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాలేని పక్షంలో అందుకు తగిన వెసులుబాట్ల కోసం మీ లాయరు గారితో మాట్లాడి తెలుసుకోండి.
మా సొంత ఊరు నిర్మల్. ఉద్యోగరీత్యా నేను కెనడాలో ఉన్నాను. నాపై ఒక కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది అని, లుక్ ఔట్ సర్క్యులర్ ఉందని పోలీసు వారు మా ఇంటికి వచ్చారు. 2016 లో జరిగిన ఒక లావాదేవీలో నాపై చీటింగ్ కేసు పెట్టినట్టు తెలిసింది. ఇప్పుడు భారత దేశానికి వస్తే నన్ను విమానాశ్రయంలోనే అరెస్టు చేస్తారని అంటున్నారు. బెయిల్ కూడా దొరకదు అంటున్నారు. నిజమేనా?
– రవిచంద్ర, కెనడా
మీరు విన్నది నిజమే! మీమీద లుక్ అవుట్ సర్కులర్ ఉండి ఉంటే మీరు భారతదేశంలో అడుగుపెట్టిన మరుక్షణమే మిమ్మల్ని అరెస్టు చేస్తారు. చీటింగ్ కేసు అన్నారు గనుక సూరిటీ తీసుకుని బెయిల్ ఇస్తారు. మీకు వీలు ఉంటే, తెలంగాణ హైకోర్టులో లుకౌట్ సర్క్యులర్‌పై రిట్ పిటిషన్ వేసి, కోర్టు ద్వారా ముందస్తు రక్షణ పొంది అప్పుడు రావటం మంచిది.
మీ తరఫు న్యాయం ఉంటే భయం అవసరం లేదు. ముందు మీరు మీపై ఉన్న కేసు ఏంటి, కేసు ఏ స్టేజిలో ఉంది అనే విషయం తెలుసుకోండి. హై కోర్టులో లేదా సదరు కేసు నమోదైన కోర్టులో ఉపశమనం కోసం పిటిషన్లు వేయండి.
(చదవండి: 1971 Bhuj Airbase Story: ఆ 300 మంది మహిళలు 72 గంటల్లోనే..! ఎలాంటి రక్షణ ఆయుధాలు, శిక్షణ లేకుండానే..)