పౌరసత్వ చట్టంలో ఆ ప్రక్రియ మీకు వర్తించదు! | Legal Advice: Citizenship Act 1955, Amendments, Termination | Sakshi
Sakshi News home page

పౌరసత్వ చట్టంలో ఆ ప్రక్రియ మీకు వర్తించదు!

May 6 2026 6:10 PM | Updated on May 6 2026 7:05 PM

Legal Advice: Citizenship Act 1955, Amendments, Termination

నా భర్త ఇటీవలే ఫ్రాన్స్‌ దేశ పౌరసత్వం పొందారు. కుటుంబ కారణాల వల్ల నేను ఇక్కడే నా కూతురిని చదివించుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము.  సమస్య ఏంటంటే ఇప్పుడు మా ఆయన భారత పాస్‌పోర్టు తిరిగి ఇచ్చేసి ఓవర్సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవగా ముందు సెక్షన్‌ 8 కింద పౌరసత్వాన్ని రినన్సియేట్‌ (తిరిగి వదిలేయటం) చేయాలని చెప్తున్నారు. మరోదేశం పౌరసత్వం తీసుకున్నాక భారత పౌరసత్వం రద్దవదా? భారత ప్రభుత్వ వెబ్సైట్లో సెక్షన్‌ 8 ప్రక్రియ చేస్తే గనక ఆ పౌరుని సంతానానికి కూడా భారతీయ పౌరసత్వం పోతుందని చదివాను. నా కూతురికి పౌరసత్వం పోతే ఇబ్బంది అవ్వచ్చు. మా ఆయన ఓసీఐ పొందాలంటే వారు చెప్పినట్టు సెక్షన్‌ 8 ప్రకారం పౌరసత్వం వదిలేస్తున్నట్టు ప్రకటించాల్సిందేనా?
– మనోజ్ఞ, చిత్తూరు

భారత పౌరసత్వం చట్టం 1955లోని సెక్షన్‌ 9(1) ప్రకారం, మీరు ఫ్రాన్స్‌ దేశ పౌరసత్వం పొందిన రోజునుంచే మీ భారత పౌరసత్వం దానంతట అదే రద్దవుతుంది. దీనికి ఎటువంటి ప్రత్యేక ప్రకటన లేదా అనుమతి అవసరం లేదు. అందువల్ల ఆ చట్టంలోని సెక్షన్‌ 8 (రినన్సియేషన్‌) ప్రక్రియ మీకు వర్తించదు, అవసరం లేదు. 

ఇప్పటికీ భారత పౌరుడిగా ఉన్న వ్యక్తి స్వచ్ఛందంగా పౌరసత్వాన్ని వదులుకునే సందర్భంలో మాత్రమే సెక్షన్‌ 8 ఉపయోగించబడుతుంది. మీలాగా వేరే దేశం పౌరసత్వం తీసుకుంటే అసలు ఆ ప్రక్రియ – సందర్భం రెండూ అప్రస్తుతం. పౌరసత్వ చట్టం లేదా పాస్‌పోర్టు నిబంధనల ప్రకారం, సెక్షన్‌ 9 కింద పౌరసత్వం రదై్దన సందర్భంలో సెక్షన్‌ 8 తప్పనిసరి అని ఎక్కడా లేదు.

సరైన విధానం ఏమిటంటే...
(జీ) భారత పాస్‌పోర్ట్‌ను సరెండర్‌ చేయడం,
(జీజీ) సరండర్‌ ధ్రువీకరణ పత్రం ΄పొందడం,
(జీజీజీ) ఓసీఐ కోసం దరఖాస్తు చేయడం. 

ఇకపోతే, మీరు భయపడుతున్నట్లు సెక్షన్‌ 8 ప్రక్రియ చేస్తే మీ కూతురి భారతీయ పౌరసత్వం పోయే ప్రమాదం లేకపోలేదు. అలా చేయాల్సిందే అని ఎవరైనా అంటే, ఫ్రాసెస్‌లోని భారతీయ ఎంబసీ ను సంప్రదించండి. వారు కూడా అలాగే అంటే, మీ భర్తను భారతదేశానికి వచ్చి ఇక్కడ ఓసీఐ కోసం దరఖాస్తు చేయమని చెప్పండి. ఇతర దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు ఎవరూ ఇప్పటివరకూ సెక్షన్‌ 8 ప్రక్రియ చేయమని అడిగిన దాఖలాలు లేవు. 

పైగా అలా చెయ్యొద్దు అన్న సూచనలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉన్నాయి. పైన సూచించిన విధంగా పాస్‌పోర్ట్‌ సరెండర్‌ ప్రక్రియను కొనసాగించమని ఫ్రాన్స్‌లోని రాయబారి కార్యాలయానికి అధికారికంగా తెలియజేయండి. ఏదైనా సమస్య వస్తే, విదేశాంగ శాఖకు ఫిర్యాదు/దరఖాస్తు చేయండి. ఖచ్చితంగా మీ సమస్య తీరుతుంది. లేకుంటే హై కోర్టులో వ్యాజ్యం వేసే అవకాశం మీకు ఉంది.
శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  )

(చదవండి: సంగీతానికి వయసుతో పనిలేదు..! వాహ్వా అనిపించుకున్న రిటైర్డ్‌ టీచర్‌)

Advertisement
 
Advertisement
Advertisement