బహుముఖం: ‘జెమ్‌’వాల్‌ | Sakshi
Sakshi News home page

బహుముఖం: ‘జెమ్‌’వాల్‌

Published Sun, Sep 11 2022 4:03 AM

Kullu girl Ishani Singh Jamwal conquers Kun peak in Kargil - Sakshi

చిన్నప్పటి నుంచి ఎంతోమంది సాహసికుల గురించి వింటూ పెరిగింది ఇషానిసింగ్‌ జమ్వాల్‌. అయితే ఆ సాహసాలు ఆమె చెవికి మాత్రమే పరిమితం కాలేదు.   ‘ఛలో... మనమెందుకు చేయకూడదు’ అని అనిపించేలా చేశాయి. తాజాగా కార్గిల్‌లోని కున్‌ శిఖరాన్ని అధిరోహించి ‘జెమ్‌’ అనిపించుకుంది...

ఇండియన్‌ మౌంటెనీరింగ్‌ ఫెడరేషన్‌ (ఐఎంఎఫ్‌)కు చెందిన తొమ్మిదిమంది సభ్యులు కార్గిల్‌లోని 7,077 మీటర్ల ఎత్తయిన కున్‌ శిఖరాన్ని అధిరోహించడానికి గత నెల చివరి వారంలో బయలుదేరారు.  తాజాగా కున్‌ శిఖరాన్ని అధిరోహించిన ఇషానిసింగ్‌ జమ్వాల్‌ జేజేలు అందుకుంటుంది. ‘ఈ సాహసయాత్రలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని పర్వతారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది ఇషా.

హిమాచల్‌ప్రదేశ్‌లోని పహ్‌నల గ్రామానికి చెందిన ఇషానిసింగ్‌కు చిన్నప్పటి నుంచి ఎడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ అంటే ఇష్టం. ఆరవతరగతి నుంచే రకరకాల సాహసక్రీడల్లో పాల్గొనేది.
స్కీయింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో మన దేశం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించింది. పర్వతారోహణపై ఆసక్తితో మనాలిలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌లో శిక్షణ తీసుకుంది.

చిన్నప్పుడు ఇషా తన పుస్తకాలలో రాసుకున్న ‘ఎడ్వెంచర్‌ ఈజ్‌ వెయిటింగ్‌ ఫర్‌ యూ’ ‘నెవర్‌ గివ్‌ అప్‌’ ‘లైఫ్‌ ఈజ్‌ యాన్‌ ఎడ్వెంచర్‌’లాంటి వాక్యాలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఎడ్వెంచర్‌ స్పోర్ట్స్‌కు సంబంధించిన రకరకాల విషయాలను ఇషాకు చెబుతుండేవారు.
పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే పర్వతారోహణలో రికార్డ్‌ సృష్టించిన ఫ్రెంచ్‌ మహిళ మేరీ ప్యారడైస్‌ నుంచి ఆల్ఫ్‌లోని మ్యాటర్‌హార్న్‌ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళ లూసీ వాకర్‌ వరకు ఎంతోమంది సాహహికులైన మహిళలు గురించి చెబుతుండేది తల్లి నళినీసింగ్‌.

పుస్తకాల విషయానికి వస్తే అలనాటి ‘నో పిక్‌నిక్‌ ఆన్‌ మౌంట్‌ కెన్యా’ నుంచి ఇప్పటి ‘నో షార్ట్‌ కట్స్‌ టు దీ టాప్‌’ వరకు ఇషాకు ఎన్నో ఇష్టం.
విన్న మాట కావచ్చు, చదివిన అక్షరం కావచ్చు తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ఇషానిసింగ్‌కు ఉపయోగపడ్డాయి.
‘ఇషా కున్‌ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించడం ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు తండ్రి శక్తిసింగ్‌.
ఇషానిలోని మరోకోణం... మోడలింగ్‌.
ఎన్నో ప్రముఖ బ్రాండ్‌లకు మోడలింగ్‌ చేసింది.

ఇషాని ‘తనిష్క్‌’ కోసం చేసిన ఒక యాడ్‌లో ఆమెను ‘మౌంటెనీర్‌’ ‘అథ్లెట్‌’ ‘మోడల్‌’ అంటూ పరిచయం చేస్తారు. అయితే ఆ వరుసలో చేర్చాల్సిన మరో విశేషణం... మోటివేషనల్‌ స్పీకర్‌. ఆమె ఉపన్యాసాలు ఆకట్టుకోవడమే కాదు స్ఫూర్తిని ఇస్తాయి.
‘మనకు మనం కొత్తగా కనిపించే ప్రయత్నం చేయాలి’ అంటుంది ఇషానిసింగ్‌.
అప్పుడే కదా విజయాలు మన దరి చేరేవి!
 

Advertisement
 
Advertisement
 
Advertisement