Kerala: ఆ మందును భర్తకు తినిపిస్తే కొంగు పట్టుకు తిరుగుతాడని చెప్తే! ఏంటి ఇదంతా?.. ఇకనైనా మారాలి

Kerala Incident Human Sacrifice: Dont Believe Superstitions Will Ruin Lives - Sakshi

సందర్భం

ఇరుగమ్మ... పొరుగమ్మ.. మూఢ విశ్వాసాలు

Kerala Human Sacrifice Incident : ‘వొదినా... ఇది విన్నావా... దిండు కింద కరక్కాయ పెట్టుకుంటే మంచిరోజులొస్తాయట’.. ‘అక్కా.. ఈ సంగతి తెలుసా? నల్లకోడితో దిష్టి తీస్తే జ్వరం తగ్గుతుందట’.. ‘వ్రతం చేసి నెల రోజులు ఉపవాసం పాటిస్తే.. ఇక సంపదే సంపద’.. ‘బాబాగారి దగ్గరికెళ్లి తాయెత్తు కట్టుకొస్తే.. కష్టాలన్నీ పోతాయి’... ఇరుగమ్మలు పొరుగమ్మలు ఏమేమో చెబుతుంటారు.

వాటిని గడప దాటి లోపలికి రానిస్తే ఇంటికే ప్రమాదం. కష్టాలు అందరికీ ఉంటాయి. సరైన దిశ లేనప్పుడు మూఢవిశ్వాసాలు పాటించైనా బయటపడాలనుకుని ప్రమాదాలు తెచ్చుకుంటారు. స్త్రీ చదువు, స్త్రీ చైతన్యం మూఢ విశ్వాసాల నుంచి కుటుంబాన్ని కాపాడగలదు. అప్పుడే కేరళలో జరిగిన ఉదంతాల వంటివి పునరావృత్తం కాకుండా ఉంటాయి. మేలుకో మహిళా.. మేలుకో. 

ఆ మధ్య యూ ట్యూబ్‌లో ఒక ఇరుగమ్మ పర్సులో లవంగాలు పెట్టుకుంటే డబ్బు నిలుస్తుంది అని చెప్పింది. యూ ట్యూబ్‌లో కాబట్టి అందరూ వేళాకోళం చేశారు. జోకులేశారు. కాని అదేమాట ఆ ఇరుగమ్మ కేవలం తన పక్కింటామెతో చెప్పి ఉంటే? ఆ పక్కింటామె అమాయకంగా దానిని నమ్మి ఉంటే? భర్త పర్సులో లవంగాలు పెట్టి డబ్బు కోసం ఎదురు చూసి ఉంటే?

ఇవి ఆధ్యాత్మిక సంప్రదాయాలు
దేవుణ్ణి పూజించడం, మొక్కులు మొక్కుకోవడం, కష్టాల నుంచి బయట పడేయమని గుడిలో అర్చనలు చేయడం ఇవి ఆధ్యాత్మిక సంప్రదాయాలు. కాని సంప్రదాయానికి ఆవల అంగీకరం లేని పుకార్లుగా మూఢవిశ్వాసాలు వ్యాపిస్తూ ఉంటాయి. ఫలానా లాకెట్‌ ధరిస్తే మేలు, ఉంగరం ధరిస్తే వశీకరణం, ఫలానా వ్యక్తిని సంప్రదిస్తే చేతబడి, ఫలానా మందును భర్తకు అన్నంలో పెట్టి తినిపిస్తే అతడిక కొంగు పట్టుకు తిరుగుతాడని... ఇలాంటివి లక్ష.

అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు వస్తే మనిషి మానసిక స్థయిర్యం దెబ్బ తింటుంది. ఎలాగైనా వాటి నుంచి గట్టెక్కాలని చూస్తాడు. ఆ సమయంలోకి ఇరుగువారు, పొరుగువారు తోచిన మూఢ సలహాలు ఇస్తారు. వాటిని పాటించడం వల్ల ఇంకా ప్రమాదంలోకి వెళ్లడం తప్ప మరో ఉపయోగం లేదు. అనారోగ్యం వస్తే తగిన వైద్యం చేయించుకుని ఆత్మస్థయిర్యంతో ఆ జబ్బు మీద పోరాడాలి.

మంత్రాలకు కాసులు రాలవు
దేవుని మీద విశ్వాసం ఉంటే ప్రార్థన మేలు చేస్తుంది. అంతే తప్ప మంత్రగాళ్లు మేలు చేయరు. ఆర్థిక కష్టాలు వస్తే విజ్ఞుల సలహా తీసుకుని అయినవారి మద్దతుతో వాటి నుంచి బయటపడాలి తప్ప మంత్రాలకు కాసులు రాలవు. అయినా సరే మూఢవిశ్వాసాలు గట్టిగా లాగుతాయి. వాటిని స్త్రీలు నమ్మడం మొదలెడితే చాలా ప్రమాదం.

మగవాడికి కనీసం బజారులో అలాంటి పనులు ఖండించేవారు తారసపడతారు. ఇరుగమ్మలు, పొరుగమ్మలు కలిసి తమ లోకంలో తాము ఉంటూ ఇలాంటివి నమ్ముతూ పోతే ఇంటి మీదకే ప్రమాదం వస్తుంది. 

ఒకప్పుడు సమాజంలో నాస్తికవాదం, హేతువాదం, అభ్యుదయ వాదం మూఢవిశ్వాసాలకు జవాబు చెప్పేవి. బాబాల, స్వామిజీల ట్రిక్కులను తిప్పి కొట్టేవి. అతీంద్రియ శక్తుల మీద కంటే మనిషికి తన మీద తనకు విశ్వాసం కల్పించేవి. కాని ఇవాళ ఎటు చూసిన చిట్కాలు, కిటుకులు చెప్పేవారు తయారయ్యారు. మంగళవారం ఫలానా రంగు బట్ట కట్టమని, బుధవారం ఫలానా పని చేయొద్దని, శుక్రవారం ఫలానా ప్రయాణం చేయొద్దని... ఇలా ఉంటే సమాజం ఎలా ముందుకు వెళుతుంది?

వెంటనే పోలీసులకు పట్టించాలి
ఎవరికీ హాని చేయని మూఢ విశ్వాసాలనైనా క్షమించవచ్చు. కాని ఎవరికైనా హాని చేస్తే తప్ప తాము బాగు పడము అనే మూఢవిశ్వాసం వ్యాపింప చేసేవారిని వెంటనే పోలీసులకు పట్టించాలి. అలాంటి ఆలోచనలో ఉన్నవారు ఆ మత్తు నుంచి తక్షణమే బయటపడి స్పృహలోకి రావాలి.

హైదరాబాద్‌లో ఆ మధ్య ఒక రియల్టర్‌ ముక్కుముఖం తెలియని స్వామిని పూజకు పిలిస్తే అతడు ప్రసాదంలో మత్తు మందు కలిపి ప్రాణం మీదకు తెచ్చాడు. ఇవాళ కేరళలో నరబలి ఇస్తే తప్ప ఆర్థిక కష్టాలు పోవు అని ఎవరో నూరిపోస్తే ఒక దంపతులు అంతకూ తెగించారు. అదీ అక్షరాస్యతలో మొదటిగా ఉండే కేరళలో జరిగిందంటే ఇరుగు పొరుగువారు నూరిపోసే మూఢ విశ్వాసాల శక్తిని అంచనా వేయొచ్చు.

చీకటిలో దారి ఎప్పటికీ తెలియదు. అంధ విశ్వాసం అనేది కారు నలుపు చీకటి. వెలుతురు ఉన్నట్టు భ్రమ కల్పిస్తుంది. లేనిపోని ఆశలు రేకెత్తిస్తుంది. హేతువును నాశనం చేస్తుంది. ఆలోచనకు ముసుగేస్తుంది. ఏదైనా చేసి సులభంగా గట్టెక్కడానికి తెగించమంటుంది. 

జ్వరం వచ్చిన పిల్లవాడికి దిష్టి తీయడం సంప్రదాయమే కావచ్చు. డాక్టరుకు చూపించి మందులు వాడుతూ సంప్రదాయం ప్రకారం దిష్టి తీసి తృప్తి పడితే దానికో అర్థం ఉంటుంది. ఆ మాత్రపు ఇంగితంతో లేకపోతే ఎంతో ప్రమాదం. ఎంతెంతో ప్రమాదం.

చదవండి: Kerala Human Sacrifice Case: డబ్బుపై అత్యాశతోనే నరబలి.. చంపేసి ముక్కలు చేసి తిన్నారా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top