Kerala Human Sacrifice Case: డబ్బుపై అత్యాశతోనే నరబలి.. చంపేసి ముక్కలు చేసి తిన్నారా?

Kerala Human Sacrifice Case: CM Vijayan Reacts - Sakshi

తిరువనంతపురం: కేరళ నరబలి ఉదంతం.. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో.. డబ్బు దొరుకుతుందనే ఆశతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే.. ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురు నిందితులు(దంపతులతో సహా) నేరాన్ని అంగీకరించడంతో పాటు అవశేషాలు దొరక్కపోవడంపై పోలీసులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. 

తొలుత బాధిత మహిళలు రెస్లీ, పద్మను నరబలి ఇచ్చి.. వాళ్లను ముక్కలుగా నరికి కాల్చేసి.. పాతేసి ఉంటారని అనుమానించారు. అయితే.. కాల్చేసిన, పాతేసిన ఆనవాలు ఎక్కడా దొరక్కపోవడంతో.. క్లూస్‌ టీమ్‌కు సైతం ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో తినేసి ఉంటారని భావిస్తున్నారు. రెస్లీని 56 ముక్కలు, పద్మను 5 ముక్కలుగా చేసినట్లుగా నిందితులు(దంపతులు భగవంత్‌ సింగ్‌, లైలా.. స్నేహితుడు షఫీ).. అంగీకరించారు. బహుశా  తర్వాత ఆ భాగాలను తినేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. లైలా ఈ మేరకు వాంగ్మూలం ఇవ్వగా.. భగవంత్‌ సింగ్‌ మాత్రం నోరు మెదపలేదు. దీంతో ఈ విషయంపై ధృవీకరణ కోసం.. ముగ్గురు నిందితులను మరోసారి విచారించాలని భావిస్తున్నారు.

తాంత్రికుడు చెప్పాడని.. జూన్‌ 8, సెప్టెంబర్‌ 26వ తేదీల్లో సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆ ఇద్దరినీ నర బలి ఇచ్చినట్లు విచారణలో తేలింది. మంగళవారం నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఎర్నాకుళం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. ఇక నిందితుల కస్టడీ కొరుతూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. 

భగవంత్‌ సింగ్‌ మసాజ్‌ థెరపిస్ట్‌. దీంతో డబ్బు ఆశతో పాటు నిందితుల లైంగిక ఆనందం, తాంత్రిక పూజల కోణంలోనూ ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. రోజెలిన్‌, పద్మను కట్టేసి.. ఆపై క్రూరంగా చంపి.. ఆపై ముక్కలు చేసినట్లు తెలుస్తోంది.  రోజెలిన్‌ జూన్‌ నుంచి కనిపించకుండా పోగా.. కడవంతర(ఎర్నాకుళం)కు చెందిన పద్మ సెప్టెంబర్‌ నుంచి అదృశ్యం అయ్యింది. పద్మ మిస్సింగ్‌ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు.. ఈ నరబలి వ్యవహారం చిక్కింది. షఫీ వాళ్లను కిడ్నాప్‌ చేసినట్లు అంగీకరించాడు.

సీఎం పినరయి విజయన్‌ స్పందన
ఇక భగవంత్‌ సింగ్‌ రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, అధికార పార్టీ మూలాలు ఉండడంతో.. బీజేపీ విమర్శలకు దిగింది. దీంతో ఈ ఉదంతంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. కేసును త్వరగా చేధించిన పోలీసులను అభినందిస్తూ..  సిట్‌ బృందం ద్వారా విచారణ కూడా అంతే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నరబలి రాకెట్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి.. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని పోలీస్‌ శాఖను ఆదేశించారాయన. జబ్బుపడిన మనస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి కార్యకలాపాల్లో మునిగిపోతారని, ఇలాంటి ఆచారాలు నాగరిక సమాజానికి సవాలుగా పరిణమిస్తాయని విజయన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్త: మహిళల బలి.. తల నరికి, నాలుక కోసి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top