
ఇరుకు దారుల్లో ద్విచక్ర వాహనాలు ఎలాగోలా ప్రయాణించగలవు గాని, కార్లు ముందుకెళ్లడం అంత సులువు కాదు. ఈ సమస్యను అధిగమించాలనే ఆలోచనతోనే ఇటాలియన్ మెకానిక్ ఆండ్రియా మరాజీ ప్రపంచంలోనే అతి సన్నని కారును రూపొందించాడు. అలాగని అతడేమీ కొత్తగా కారును తయారు చేయలేదు.
తన షెడ్డులో మూలపడిన 1993 మోడల్ ‘ఫియట్ పాండా’ కారు రూపురేఖలను తాను కోరుకున్న రీతిలో మార్పులు చేసి, ఇలా అతి సన్నని కారుగా మార్చేశాడు. దీనికోసం ఆండ్రియా ఏకంగా పన్నెండు నెలలు శ్రమించాడు. రోడ్ల మీద పరుగులు పెట్టేలా దీనిని తీర్చిదిద్దడానికి పూర్తిగా ఫియట్ కంపెనీకి చెందిన ఒరిజినల్ విడి భాగాలనే ఉపయోగించాడు.
కారుకు ఉన్న పాత పెట్రోల్ ఇంజిన్‌ను తొలగించి, ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను ఏర్పాటు చేసి, బ్యాటరీని అమర్చాడు. బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే, పాతిక కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారు ఎత్తు 140 సెం.మీ., పొడవు 340 సెం.మీ., వెడల్పు 50 సెం.మీ. మాత్రమే! ఈ కారులోనే చక్కర్లు కొడుతూ ఆండ్రియా యూట్యూబ్ సంచలనంగా మారాడు.
(చదవండి: జైలు శిక్షనే శిక్షణగా మార్చుకున్న జీనియస్ ఖైదీ..!)