రోడ్డు పక్కన మైలురాళ్లు..ఇన్ని విషయాలను వివరిస్తాయా!? | Interesting Facts: Why Are Road Milestones In India In Different Colours | Sakshi
Sakshi News home page

రోడ్డు పక్కన మైలురాళ్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?

May 27 2026 11:16 AM | Updated on May 27 2026 12:09 PM

Interesting Facts: Why Are Road Milestones In India In Different Colours

ప్రయాణం అంటేనే కొత్త అనుభూతి. కొండలు, కోనలు, పచ్చని చెట్ల మధ్య సాగే ప్రయాణంలో మనకు తరచూ రోడ్డు పక్కన మైలురాళ్లు కనిపిస్తుంటాయి. 'ఫలానా ఊరు ఇంకెన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది?' అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ రాళ్లను చూస్తుంటాం. కానీ, మైలురాళ్లపై ఉండే రంగులు మనం ఏ తరహా రహదారిపై ప్రయాణిస్తున్నామో, దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో ఇట్టే చెప్పేస్తాయి. మరి ఆ రంగుల వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందామా..!

పసుపు రంగు: జాతీయ రహదారి (National Highway)
మీరు వెళ్లే మార్గంలో మైలురాయి పైభాగం పసుపు రంగులో ఉండి, కింద తెలుపు రంగు ఉంటే.. మీరు జాతీయ రహదారి (National Highway - NH) పై ప్రయాణిస్తున్నారని అర్థం.ఈ రహదారులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) నిర్మించి, నిర్వహిస్తుంది. ఇవి ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో, అలాగే దేశంలోని ప్రధాన నగరాలు, నౌకాశ్రయాలను అనుసంధానిస్తాయి.

ఆకుపచ్చ రంగు..రాష్ట్ర రహదారి (State Highway)..
ఒకవేళ మైలురాయి పైభాగం ఆకుపచ్చ రంగులో ఉంటే.. మీరు రాష్ట్ర రహదారి (State Highway - SH) పై ఉన్నట్లు లెక్క. ఈ రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి. ఇవి రాష్ట్రంలోని వివిధ జిల్లాలను, ప్రధాన నగరాలను రాష్ట్ర రాజధానితో లేదా జాతీయ రహదారులతో కలుపుతాయి.

నలుపు లేదా నీలం రంగు: జిల్లా రహదారి (District Road)..
మైలురాయి పైభాగంలో నలుపు, ముదురు నీలం (డార్క్ బ్లూ) లేదా పూర్తిగా తెలుపు రంగు ఉండి, దానిపై నగరాల పేర్లు రాసి ఉంటే.. అది జిల్లా రహదారి అని అర్థం. వీటి నిర్వహణను జిల్లా పరిపాలనా యంత్రాంగం లేదా కార్పొరేషన్, మున్సిపాలిటీలు చూసుకుంటాయి.
మీరు ఒక పెద్ద నగరానికి లేదా జిల్లా కేంద్రానికి సమీపిస్తున్నారని ఈ రంగు సూచిస్తుంది.

నారింజ రంగు: గ్రామీణ రహదారి (Rural Road)..
మైలురాయి పైభాగం నారింజ (ఆరెంజ్) రంగులో కనిపిస్తే.. మీరు ఏదైనా గ్రామీణ ప్రాంతానికి వెళ్తున్నారని అర్థం. ఈ రహదారులను 'ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన' (PMGSY) కింద నిర్మిస్తారు. కుగ్రామాలను సైతం ప్రధాన రహదారులతో అనుసంధానించేందుకు ఈ రోడ్లు ఉపయోగపడతాయి.

మైలురాళ్లపై ఏ రంగు ఉన్నా, వాటి కింది భాగం మాత్రం ఎప్పుడూ తెలుపు రంగులోనే ఉంటుంది. రాత్రి వేళల్లో వాహనాల లైట్ల వెలుతురు పడినప్పుడు ఈ తెలుపు రంగు స్పష్టంగా కనిపించి, డ్రైవర్లకు మైలురాయిని దూరం నుంచే గుర్తుపట్టేలా చేస్తుంది. ఇకపై మీరు ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు, కేవలం కిలోమీటర్లనే కాకుండా మైలురాయి రంగును కూడా గమనించండి. మీ ప్రయాణం ఎంత సురక్షితమైన మార్గంలో సాగుతుందో మీకే అర్థమైపోతుంది. 

- పసుపులేటి. వెంకటేశ్వరరావు

Advertisement
 
Advertisement
Advertisement