194 కేజీల బరువున్న వైద్యుడు 110 కిలోల బరువు తగ్గాడు.. తన సీక్రెట్‌ ఇదేనంటూ...

indian doctor anirudh deepak transformation weight loss fat loss diet workout - Sakshi

శరీరానికి అవసరమైనంత మేరకే కేలరీలు తీసుకోవడం, ఫిజికల్‌ యాక్టివిటీని కొనసాగించడం ద్వారా ఎవరైనా బరువు తగ్గవచ్చని చెబుతుంటారు. దీనిని తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఒక వైద్యుడు ఏకంగా 110 కిలోల బరువు తగ్గారు.ఈ వైద్యుని పేరు డాక్టర్‌ అనిరుద్ధ్‌ దీపక్‌. ఆయన సర్టిఫైడ్‌ న్యూట్రిషనిస్టు కూడా. చెన్నైకి చెందిన ఈయన 5 అడుగుల 7 ఇంచుల ఎత్తు కలిగివున్నారు. 

డాక్టర్‌ అనిరుద్ధ్‌ బరువు ఒకప్పుడు 194 కిలోలు ఉండేది. అయితే ఇప్పుడు అతని బరువు 80 కిలోల కన్నా తక్కువగానే ఉంది. 194 కిలోల నుంచి 80 కిలోలకు తగ్గిన అతని ఫిట్‌ నెస్‌ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్‌ అనిరుద్ధ్‌ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి తింటూవుండటం అలవాటు. ఈ కారణంగానే నా శరీర బరువు మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఈ విషయన్ని నేనెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. పిజ్జా, బర్గర్‌, ఫ్రైడ్‌ ఫుడ్‌ మొదలైనవాటిని ఎంతో ఇష్టపడేవాడిని. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ పొట్ట నింపేసేవాడిని’ అని తెలిపారు.

2018లో అతని ఎంబీబీఎస్‌ పూర్తయ్యింది. అయితే ఇంతలోనే అనిరుద్ధ్‌ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. ఆ సమయంలో వైద్యులు అనిరుద్ధ్‌తో ఇదే శరీర బరువుతో ఉంటే మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఇదే అతని జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. బరువు తగ్గాలని అనిరుద్ధ్‌ నిర్ణయించుకున్నారు. 

తాను బరువు తగ్గిన విధానం గురించి అనిరుద్ధ్‌ మాట్లాడుతూ ‘ఒక ట్రైనర్‌ నాకు డైట్‌, వర్కవుట్‌ ప్లాన్‌ చెప్పారు. దీనిని క్రమం తప్పకుండా అనుసరిస్తూ రెండేళ్లలో 110 కిలోల బరువు తగ్గాను. రోజులో కేవలం 5 మిల్లీలీటర్ల వంట నూనెను మాత్రమే తీసుకునేవాడిని. 2000 కేలరీలు మాత్రమే ఉండేలా చూసుకున్నాను.బ్రేక్‌ ఫాస్ట్‌లో పోహా లేదా చపాతీ, సోయా చంక్స్‌, సలాడ్‌ తీసుకునేవాడిని. స్నాక్స్‌లో పండ్లు, బాదాం మాత్రమే తినేవాడిని. మధ్యాహ్నం భోజనంలో రైస్‌ లేదా రోటీ, పప్పు లేదా రాజ్మా, కూర, పెరుగు తీసుకున్నాను.ఈవెనింగ్‌ స్నాక్స్‌లో ప్రొటీన్‌, రాత్రి ఆహారంలో రైస్‌ లేదా రోటీ, పన్నీర్‌, కూర ఉండేలా చూసుకునేవాడిని. నేను ఫిట్‌నెస్‌ జర్నీ ప్రారంభించినప్పుడు లాక్‌డౌన్‌ నడుస్తోంది.దీంతో హోమ్‌ వర్క్అవుట్‌ మాత్రమే చేయగలిగాను. ఈ సమయంలో నేను డంబెల్స్‌, ఫ్లోస్‌తో వ్యాయామాలు చేసేవాడిని. హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్‌, జంప్‌ రోప్‌, సర్కిట్‌ ట్రైనింగ్‌, ఫంక్షనల్‌ ట్రైనింగ్‌ మొదలైనవి చేసేవాడిని’ అని డాక్టర్‌ అనిరుద్ధ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top